ప్రచార ప్రకటనలకు అనుమతి తప్పనిసరి | Sakshi
Sakshi News home page

ప్రచార ప్రకటనలకు అనుమతి తప్పనిసరి

Published Fri, Apr 19 2024 2:40 AM

ఎన్నికల వ్యయ పరిశీలకులతో  
మాట్లాడుతున్న కలెక్టర్‌ శుక్లా - Sakshi

అమలాపురం రూరల్‌: ప్రచార ప్రకటనలకు అనుమతి తప్పనిసరని నిబంధనలు అతిక్రమించిన వారిపై తగిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి హిమాన్షు శుక్లా తెలిపారు. గురువారం కలెక్టరేట్‌లో మీడియా సర్టిఫికేషన్‌ సమన్వయ కేంద్రాన్ని కలెక్టర్‌, ఎన్నికల వ్యయ పరిశీలకులు సుమిత్‌దాస్‌ గుప్తా, రాహుల్‌ దింగడాతో కలిసి సందర్శించి కేంద్ర నిర్వహణ తీరును పార్టీల ప్రచార ప్రకటనల ప్రెస్‌ క్లిప్పింగ్స్‌ రికార్డుల ఆధారంగా పరిశీలించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ వ్యయ పరిశీలకులకు కేంద్రం పనితీరును వివరిస్తూ వివిధ ఎలక్ట్రానిక్‌ ప్రసార మాధ్యమాల్లో ప్రసారమయ్యే రాజకీయ ప్రకటనలకు ముందస్తు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని మీడియాకు సూచించారన్నారు. దీని కోసం కలెక్టరేట్‌లో జిల్లా స్థాయి మీడియా సర్టిఫికేషన్‌ అండ్‌ మానిటరింగ్‌ కమిటీ కేంద్రాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. ఎలక్ట్రానిక్‌ మీడియాలో రాజకీయ ప్రకటనలకు ముందస్తు అనుమతి మంజూరు చేయటంతో పాటు, చెల్లింపు వార్తలను ఈ కమిటీ పర్యవేక్షిస్తుందన్నారు మీడియా ఉల్లంఘనలను కూడా గుర్తించి తగిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. గుర్తింపు పొందిన జాతీయ, రాష్ట్ర రాజకీయ పార్టీలు లేదా వాటి తరఫున ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఎలక్ట్రానిక్‌ మీడియాలో రాజకీయ ప్రచార ప్రకటనలకు అనుమతి పొందటం కోసం నిర్ణీత నమూనాలో ప్రకటన ప్రసారం చేసే మూడు రోజుల ముందుగా దరఖాస్తు చేసుకోవాలని సూచించామన్నారు. కులాలను, మతాలను కించపరుస్తూ గానీ, అశ్లీలం, ఇతరుల పరువుకు నష్టం కలిగిస్తూ, హింసను ప్రేరేపించే విధంగా గానీ ప్రకటనలు ఉండరాదన్నారు. దేశ ఐక్యత, సమగ్రత, సార్వభౌమాధికా రానికి భంగం కలిగించేలా కానీ, న్యాయ వ్యవస్థను కించపరిచే విధంగా గానీ, కోర్టు ధిక్కరణ చేస్తూ గానీ ప్రకటనలు ఇవ్వరాదని స్పష్టం చేశామన్నారు. పేరు పెట్టి వ్యక్తిగత దూషణ చేయరాదని, వ్యక్తిగత జీవితాన్ని కించపరిచేలా ఉండరాదన్నారు. దేవాలయాలు, మసీదులు, చర్చిలు, తదితర మత చిహ్నాలను, పోస్టర్లను, సంబంధిత సంగీతాన్ని వినియోగించరాదని తెలిపారు. నిజ నిర్ధారణ లేకుండా ఇతర పార్టీలపైగానీ, ప్రతినిధులపై గానీ ఆరోపణలు చేస్తూ ప్రకటనలు ఇవ్వరాదని ఇప్పటికే మీడియాకు తెలియజేశామని జిల్లా ఎన్నికల అధికారి స్పష్టం చేశారు.

కలెక్టర్‌ హిమాన్షు శుక్లా

Advertisement
Advertisement