సత్కార్యాలకు సత్కారం | Sakshi
Sakshi News home page

సత్కార్యాలకు సత్కారం

Published Fri, May 19 2023 2:24 AM

ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వ్యక్తికి పింఛన్‌ పంపిణీ చేస్తున్న వలంటీర్‌ - Sakshi

అవార్డుల ప్రదానానికి సర్వం సిద్ధం

అర్హులకు సంక్షేమ పథకాలు సకాలంలో చేరవేయడంలో వలంటీర్లు ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. సచివాలయ వ్యవస్థ ద్వారా జిల్లా యంత్రాంగానికి మానవ వనరులు పెద్ద ఎత్తున అందుబాటులోకి వచ్చాయి. వారు అందిస్తున్న సేవలను గుర్తింపునివ్వాలని రాష్ట్ర ప్రభుత్వం వలంటీర్ల వందనం పేరుతో సన్మానిస్తుంది. జిల్లాలో ఉత్తమ సేవలందించిన వారిని అవార్డులకు ఎంపిక చేశాం. రాజమహేంద్రవరం కార్పొరేషన్‌లో జిలాస్థాయి కార్యక్రమం నిర్వహించనున్నాం. జిల్లా వ్యాప్తంగా 8,704 మందికి రూ.8,89,20,000 పారితోషికం కింద అందజేయ స్తున్నాం. నగదు పారితోషికం నేరుగా వలంటీర్ల ఖాతాలకు జమ చేస్తారు.

–కె.మాధవీలత, జిల్లా కలెక్టర్‌

కొవ్వూరు: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను లబ్ధిదారులకు చేరవేయడంలో వలంటీర్లు వారధిగా నిలుస్తున్నారు. కీలక భూమిక పోషిస్తూ లబ్ధిదారుల మన్ననలందుకుంటున్నారు. తొలినాళ్లలో వినిపించిన విమర్శలకు వీరు తమ పనితీరుతో దీటైన సమాధానమిస్తున్నారు. ప్రజలకు చేదోడు వాదోడుగా ఉంటున్నారు. వీరందిస్తున్న సేవలకు రాష్ట్ర ప్రభుత్వం గుర్తింపునిస్తోంది. ఉత్తమ సేవలందించిన వారికి మూడేళ్ల నుంచి అవార్డులను ప్రదానం చేస్తూ ప్రోత్సహిస్తోంది. గ్రామ, వార్డు సచివాలయాలకు అనుసంధానంగా పనిచేస్తున్న వీరి పనితీరు ఆధారంగా నగదు పారితోషికంతో పాటు సర్టిఫికెట్స్‌,బ్యాడ్జీలు,మెడల్స్‌ అందిస్తోంది. ఈ ఏడాది కూడా ఈ కార్యక్రమం నిర్వహించ తలపెట్టింది. వలంటీర్లకు వందనం పేరుతో రాష్ట్ర ముఖ్య మంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి శుక్రవారం విజయవాడలో రాష్ట్ర స్థాయి అవార్డుల కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.

విస్తృత ఏర్పాట్లు

సీఎం ప్రారంభించాక రాష్ట్ర వ్యాప్తంగా పదిరోజులు పాటు నియోజకవర్గాల్లో అవార్డుల ప్రదాన కార్యక్రమాలు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇందుకు అధికార యంత్రాంగం విస్తృతంగా ఏర్పాట్లు చేసింది. పట్టణం, మండలంలో రోజుకు రెండు గ్రామాలు,రెండు సచివాలయాలకు తగ్గకుండా వలంటీర్ల వందనం కార్యక్రమం నిర్వహించాలని ప్రభుత్వం సూచించింది. ఇప్పటికే జిల్లా యంత్రాంగం వలంటీర్ల పనితీరు ఆధారంగా ఉత్తమ అవార్డులకు ఎంపిక పూర్తి చేసింది. జిల్లా వ్యాప్తంగా 8,927 మంది ఉండగా వీరిలో ఉత్తమ సేవలందించిన 8,704 మంది అవార్డులు అందుకోనున్నారు. అవార్డులు ప్రదానం చేయడానికి అవసరమైన శాలువాలు, బ్యాడ్జీలు, మెడల్స్‌, ప్రశంసాపత్రాలు ఆయా మండలాలకు, పట్టణాలకు చేరవేశారు. నగదు పారితోషికం సొమ్ము నేరుగా వలంటీర్ల ఖాతాల్లోకి జమ చేయనున్నారు.

పనితీరు ఆధారంగా..

ఏడాది పూర్తి చేసుకుని ఏవిధమైన ఫిర్యాదులు లేకుండా పనిచేసిన వలంటీర్లు అవార్డులకు అర్హులు. వారి సేవల ప్రాతిపదికన సేవా అవార్డులు అందజేస్తున్నారు. పనితీరుతో పాటు వలంటీర్ల సేవలపై వారి పరిధిలోని కుటుంబాలు వ్యక్తం చేసే సంతృప్తిని పరిగణనలోకి తీసుకున్నారు. ప్రతి నెల మొదటి రోజు నూరు శాతం పంపిణీ, కుంటుంబ సర్వే, సంక్షేమ పథకాల అమలులో పనితీరు వంటివి కూడా పరిశీలించి ఎంపిక చేశారు. నియోజకవర్గంలో ఐదుగురికి సేవ వజ్ర, మండలం, పట్టణానికి ఐదుగురు సేవ రత్నలను ఎంపిక చేశారు.

వలంటీర్ల సేవలకు గుర్తింపు హర్షణీయం

మాలాంటి వలంటీర్ల సేవలకు ప్రభుత్వం గుర్తింపునివ్వడం చాలా సంతోషం. ఉత్తమ సేవలందించిన కొందరికి రాష్ట్ర స్థాయిలో పురస్కారాలు, నగదు పారితోషికాలు అందించడం ఆనందంగా ఉంది. ఏటా ఇలా అవార్డులు ఇవ్వడం ద్వారా వలంటీర్లలో ఉత్సాహాన్ని నింపుతోంది. మరింత సమర్థంగా పనిచేసేందుకు ఇది దోహదపడుతుంది. ఈ సంవత్సరం నేను సేవారత్న అవార్డుకు ఎంపికయ్యాను.

– జి. ఉదయభాను,వలంటీర్‌, ప్రక్కిలంక,తాళ్లపూడి మండలం

చాలా సంతోషంగా ఉంది

వలంటీర్‌ వ్యవస్థను రాష్ట్రంలో మాత్రమే అమలు చేయడం సంతోషకరం. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలన్నీ పార్టీలకు అతీతంగా అర్హతే ప్రామాణికంగా అందించడం ఎప్పుడూ జరగలేదు. తొలిసారి వలంటీర్ల ద్వారా ప్రభుత్వం ఇలా చేస్తోంది. రెండేళ్లుగా సేవమిత్ర అవార్డుకు ఎంపికవుతున్నాను. ఈసారి సేవా వజ్రకి ఎంపిక కావడం చాలా ఆనందంగా ఉంది

–కందికట్ల శాంతి, వలంటీర్‌, మార్కోండపాడు, చాగల్లు మండలం

జిల్లా వ్యాప్తంగా ఇలా..

జిల్లా వ్యాప్తంగా 4,95,020 ఇళ్లకు సంబంధించి 512 గ్రామ, వార్డు సచివాలయాలున్నాయి. వీటిలో 271 గ్రామాల్లో 393 గ్రామ సచివాలయాలు,పట్టణ ప్రాంతాల్లో 119 వార్డు సచివాలయాలున్నాయి. ప్రతి యాభై కుటుంబాలకు ఒకరు చొప్పున 9,036 మంది వలంటీర్లులు ఉండాలి. ప్రస్తుతం 8,927 మంది వలంటీర్లులు పనిచేస్తున్నారు. మరో 109 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సేవరత్న అవార్డు కింద రూ.10 వేలు,సేవా మిత్ర పురస్కారం కింద రూ.20 వేలు, సేవావజ్రకు రూ.30 వేలు వంతున అందజేయనున్నారు. ఇందుకోసం జిల్లాకు రూ.8,89, 20,000 వెచ్చించనుంది. జిల్లా వ్యాప్తంగా సేవ మిత్ర అవార్డులకు 8,549 మంది,122 మంది సేవ రత్న, 33 మంది సేవ వజ్ర అవార్డులకు ఎంపికయ్యారు. వీరిలో 5,627 మంది మహిళలు అవార్డులు పొందనున్నారు.

సేవలకు గుర్తింపుగా

వలంటీర్లకు అవార్డుల ప్రదానం

జిల్లా వ్యాప్తంగా 8,704 మంది ఎంపిక

నేటి నుంచి

పది రోజుల పాటు కార్యక్రమాలు

నగదు పురస్కారంతో

సత్కరించనున్న ప్రభుత్వం

వలంటీర్లకు అందజేయనున్న నగదు పురస్కారం (రూ.లలో)

నియోజకవర్గం సేవ మిత్ర సేవ రత్న సేవా వజ్ర నగదు పురస్కారం

కొవ్వూరు 932 20 5 98,70,000

గోపాలపురం 866 15 3 90,50,000

నిడదవోలు 1,194 20 5 1,24,90,000

అనపర్తి 1,174 15 3 1,21,30,000

రాజానగరం 1,377 16 5 1,42,40,000

రాజమహేంద్రవరం సిటీ 1,426 15 6 1,47,40,000

రాజమహేంద్రవరం రూరల్‌ 1,311 16 4 1,35,50,000

జగ్గంపేట 269 5 2 28,50,000

(గోకవరం మండలం)

వృద్ధురాలికి పింఛన్‌ అందిస్తున్న వలంటీర్‌
1/4

వృద్ధురాలికి పింఛన్‌ అందిస్తున్న వలంటీర్‌

2/4

3/4

4/4

Advertisement
Advertisement