సీనియర్‌ సిటిజన్లకు సత్కారం | Sakshi
Sakshi News home page

సీనియర్‌ సిటిజన్లకు సత్కారం

Published Mon, Oct 2 2023 12:36 AM

సీనియర్‌ సిటిజన్లను సత్కరిస్తున్న 
కలెక్టర్‌ మాధవీలత తదితరులు - Sakshi

చాగల్లు: జిల్లాలో 85 ఏళ్ల వయసు పైబడిన ఓటర్లను గుర్తించి, సన్మానించడం ద్వారా ఓటు హక్కు వినియోగంపై ప్రజల్లో చైతన్యం తీసుకు వస్తున్నామని కలెక్టర్‌ కె.మాధవీలత అన్నారు. అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం సందర్భంగా చాగల్లు పంచాయతీ కార్యాలయం వద్ద సీనియర్‌ సిటిజన్లను, సీనియర్‌ ఓటర్లను ఆదివారం సత్కరించారు. కొవ్వూరు నియోజకవర్గంలో 103 ఏళ్లు నిండిన దాట్ల పద్మావతిని, 85 ఏళ్లు నిండిన మరో 14 మంది వృద్ధులను గుర్తించి, సన్మానించామని ఈ సందర్భంగా కలెక్టర్‌ చెప్పారు. ఎక్కువసార్లు ఓటు హక్కును వినియోగించుకున్నందుకు అభినందిస్తూ వీరిని సత్కరించామని తెలిపారు. జిల్లాలో 18 సంవత్సరాలు నిండిన యువత తప్పనిసరిగా ఓటు నమోదు చేసుకోవాలని సూచించారు. కొవ్వూరు ఆర్‌డీఓ ఎస్‌.మల్లిబాబు మాట్లాడుతూ, జనవరి 1 నాటికి 18 ఏళ్లు నిండే వారిని గుర్తించేందుకు నియోజకవర్గంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ కె.రాజ్యలక్ష్మి, ఎంపీడీఓ బి.రాంప్రసాద్‌, వైఎస్సార్‌ సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు గండ్రోతు సురేంద్రకుమార్‌, మండల శాఖ గౌరవాధ్యక్షుడు జుట్టా కొండలరావు తదితరులు పాల్గొన్నారు.

జిల్లాలో 4.7 మిల్లీమీటర్ల

వర్షపాతం

కొవ్వూరు: జిల్లావ్యాప్తంగా ఆదివారం ఉదయం 8.30 గంటలతో ముగిసిన 24 గంటల్లో 4.7 మిల్లీమీటర్ల సరాసరి వర్షపాతం నమోదైంది. అనపర్తి, బిక్కవోలు మండలాల్లో గరిష్టంగా 19.6 మిల్లీమీటర్లు రికార్డయ్యింది. గోకవరం 9.2, సీతానగరం 8.6, కడియం 7.2, రాజమహేంద్రవరం అర్బన్‌ 6.4, చాగల్లు 4.6, కొవ్వూరు 4.4, రాజమహేంద్రవరం రూరల్‌ 3.6, ఉండ్రాజవరం 1.8, రాజానగరం 1.4, నిడదవోలు 1.2, కోరుకొండ ఒక్క మిల్లీమీటర్‌ చొప్పున వర్షపాతం నమోదైంది.

కోటసత్తెమ్మ అమ్మవారికి

ప్రత్యేక పూజలు

నిడదవోలు రూరల్‌: తిమ్మరాజుపాలెంలో కోటసత్తెమ్మ అమ్మవారిని ఆదివారం అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మొక్కులు తీర్చుకున్నారు. ప్రధానార్చకుడు అప్పారావు శర్మ పర్యవేక్షణలో అమ్మవారికి ప్రత్యేక పుష్పాలంకరణ చేశారు. దర్శనాలు, ప్రసాదం, పూజా టిక్కెట్లు, ఫొటోల అమ్మకం ద్వారా అమ్మవారికి రూ.1,05,099 ఆదాయం సమకూరిందని ఆలయ ఈఓ బళ్ల నీలకంఠం (శివ) తెలిపారు.

ఉత్సాహంగా

టేబుల్‌ టెన్నిస్‌ ఎంపికలు

ప్రకాశం నగర్‌ (రాజమహేంద్రవరం సిటీ): స్థానిక టౌన్‌ హాల్‌ ఎదుట ఉన్న గౌతమీ టేబుల్‌ టెన్నిస్‌ అకాడమీలో జిల్లా టేబుల్‌ టెన్నిస్‌ జట్ల ఎంపిక పోటీలు ఆదివారం ఉత్సాహంగా జరిగాయి. మహిళల విభాగంలో వై.వైష్ణవీ సూర్య, ఛార్వి ఫల్గుణ్‌, జి.సిరిపావని, పి.శ్రీలక్ష్మి, జి.తాన్యశ్రీ; పురుషుల విభాగంలో టి.ప్రభాత్‌ సాయి, బి.తనుష్‌, ఎస్‌.సూర్యప్రకాష్‌, చరణ్‌ కార్తీక్‌, ఏడీ మణికంఠ, వై.మంజు అవినాష్‌ ఎంపికయ్యారు. అండర్‌–17 బాలబాలికల విభాగాల్లో కె.శరణ్యరెడ్డి, కె.అమృతరెడ్డి, కె.కావ్య, ఎస్‌.తన్వి, ఎస్‌.త్రిషాల్‌ రాజ్‌కుమార్‌, బి.సాయి జోషిత్‌, నమన్‌ జైన్‌, ఎస్‌.లోహిత్‌ సూర్య, ఎస్‌.మోహిత్‌ శ్రీకపీష్‌ ఎంపికయ్యారు. ఎంపికై న క్రీడాకారులు ఈ నెల 13 నుంచి 16వ తేదీ వరకూ అనంతపురంలో జరిగే రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్‌ చాంపియన్‌షిప్‌ పోటీల్లో పాల్గొంటారని అసోసియేషన్‌ అధ్యక్షుడు జేవీవీ అప్పారెడ్డి తెలిపారు. ఎంపికలను కోశాధికారి కె.సత్యనారాయణ, ఉపాధ్యక్షులు పీవీవీ సత్యనారాయణ, కార్యదర్శి వీటీవీ సుబ్బారావు పర్యవేక్షించారు.

పాదగయలో హైకోర్టు

న్యాయమూర్తి పూజలు

పిఠాపురం: హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ గోపాలకృష్ణారావు దంపతులు పిఠాపురం పాదగయ క్షేత్రం, శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానాలను ఆదివారం సందర్శించారు. వారికి ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. పాదగయ విశిష్టతను అర్చకులు వివరించారు. కుక్కుటేశ్వరస్వామి, రాజరాజేశ్వరీదేవి, పురుహూతికా అమ్మవారు, దత్తాత్రేయ స్వామి, శ్రీపాద శ్రీవల్లభుడిని దర్శించుకున్నారు. ఆయన వెంట న్యాయమూర్తులు ఎ.వాసంతి, మాధవి, సుధారాణి తదితరులున్నారు. జస్టిస్‌ గోపాలకృష్ణారావు దంపతులను ఈఓ వడ్డి శ్రీవివాసరావు, చైర్మన్‌ ఆగంటి ప్రభాకరరావు ఆలయ మర్యాదలతో సత్కరించారు.

Advertisement
Advertisement