వైద్యుని ఇంటిపై దాడి | Sakshi
Sakshi News home page

వైద్యుని ఇంటిపై దాడి

Published Tue, Oct 31 2023 11:46 PM

రేణుకను విచారిస్తున్న దిశ పోలీసు - Sakshi

దిశ యాప్‌కు కాల్‌ చేసిన బాధితురాలు

పది నిమిషాల్లో ఘటనా స్థలానికి చేరుకుని ఆసుపత్రికి తరలించిన పోలీసులు

కాజులూరు: తన పెంపుడు మేకను ఢీకొని గాయాలపాలైన వ్యక్తికి చికిత్సనందించాడనే కోపంతో ఇద్దరు వ్యక్తులు వైద్యుని ఇంటిపై రెండుసార్లు దాడి చేశారు. తొలిసారి వైద్యునిపై దాడి చేసినప్పుడు చుట్టుపక్కలవారు సర్ది చెప్పడంతో శాంతించి వెనుతిరిగిన నిందితులు మరోసారి వైద్యుడు ఇంటివద్ద లేని సమయంలో దాడిచేసి అతని కుమార్తెను తీవ్రంగా గాయపరిచారు. బాధితురాలు దిశ యాప్‌కు కాల్‌ చెయ్యగా పది నిమిషాల వ్యవధిలో దిశ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆమెను రామచంద్రపురం ఏరియా ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేశారు. దిశ పోలీసులు తెలిపిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.. ఈ నెల 26వ తేదీన యానాం – ద్వారపూడి రహదారిపై బైక్‌పై వెళుతున్న ఒక వ్యక్తి కాజులూరు మండలం ఉప్పుమిల్లి వద్ద ఒక మేకను ఢీ కొని పల్టీలు కొట్టి తీవ్ర గాయాలపాలయ్యాడు. వైఎస్సార్‌ కడప జిల్లాలో దంతవైద్యుడిగా పనిచేస్తున్న డాక్టర్‌ రాంప్రసాద్‌ దసరా సెలవుల నిమిత్తం తన స్వగ్రామం ఉప్పుమిల్లికి వచ్చారు. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి గాయాలపాలైన సంగతి తెలుసుకుని అతనికి ప్రథమ చికిత్స చేసి పంపించారు. అయితే తన పెంపుడు మేకను ఢీకొట్టి గాయపరచిన వ్యక్తికి చికిత్స చేస్తావా అంటూ అదే గ్రామానికి చెందిన గుత్తుల శ్రీను, గుత్తుల ప్రసాద్‌ వైద్యుడు రాంప్రసాద్‌తో ఘర్షణకు దిగారు. స్థానికులు సర్దిచెప్పటంతో వెనుతిరిగారు. సెలవులు ముగియటంతో వైద్యుడు రాంప్రసాద్‌ విధులకు వెళ్లిపోయారు. సోమవారం నిందితులు మరోమారు వైద్యుని ఇంటికి వెళ్లి అతని కుమార్తె రేణుకపై కర్రలతో దాడి చేశారు. రేణుక, ఆమె భర్త విత్తనాల వెంకటరమణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు గొల్లపాలెం ఎస్సై ఎం.తులసీరామ్‌ తెలిపారు.

Advertisement
Advertisement