Sakshi News home page

ప్రత్యేక అలంకరణలో కోటసత్తెమ్మ అమ్మవారు

Published Mon, Nov 20 2023 2:44 AM

సభలో మాట్లాడుతున్న గ్రంథాలయ సంస్థ 
కార్యదర్శి ప్రసాద్‌  - Sakshi

నిడదవోలు రూరల్‌: తిమ్మరాజుపాలెంలో వేంచేసియున్న కోటసత్తెమ్మ అమ్మవారి ఆలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. అధిక సంఖ్యలో వచ్చిన భక్తులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారని ఆలయ ఈఓ బళ్ల నీలకంఠం (శివ) తెలిపారు. ప్రధానార్చకుడు అప్పారావుశర్మ పర్యవేక్షణలో అమ్మవారికి ప్రత్యేక పుష్పాలంకరణ చేశారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని, మొక్కులు తీర్చుకున్నారు. దర్శనాలు, ప్రసాదం, పూజా టికెట్లు, ఫొటోల విక్రయాల ద్వారా అమ్మవారికి రూ.64,830 ఆదాయం సమకూరిందని ఈఓ తెలిపారు.

పుస్తక పఠనంపై ఆసక్తి పెరగాలి

ఉమ్మడి జిల్లా గ్రంథాలయ సంస్థ

కార్యదర్శి ప్రసాద్‌

అమలాపురం టౌన్‌: పుస్తక పఠనంపై నేటి విద్యార్థులకు మరింత ఆసక్తి పెరగాలని ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి వీఎల్‌ఎన్‌ఎస్‌వీ ప్రసాద్‌ అన్నారు. అందుకు విద్యార్థులు గ్రంథాలయాలను విధిగా వినియోగించుకుని, ఖాళీ దొరికినపుడు పుస్తకాలు చదివేందుకు సమయం కేటాయించాలని సూచించారు. గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా ఆరో రోజైన ఆదివారం అమలాపురం ప్రథమ శ్రేణి శాఖా గ్రంథాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. విద్యార్థులు నాలుగు గోడల తరగతి గదుల్లో కూర్చుని సముపార్జించే విజ్ఞానానికి సార్థకత రావాలంటే పుసక్త పఠనం అలవర్చుకోవాలన్నారు. కాలం ఎంతటి ఆధునికతవైపు వెళ్తున్నా గ్రంథాలయాల విలువ శాశ్వతమైనదని అన్నారు. అనంతరం దేశ తొలి మహిళా ప్రధాని ఇందిరా గాంధీ జయంతి, మహిళా సాధికారతపై జరిగిన సభలో సమాజంలో మహిళలు సాధిస్తున్న విజయాల పరంపరను ప్రసాద్‌ వివరించారు. గ్రంథాలయాధికారి పోలిశెట్టి సత్యనారాయణమూర్తి అధ్యక్షతన జరిగిన ఈ సభలో స్థానిక సాయి సంజీవిని మహిళా వాకర్స్‌ యోగా ఆరోగ్య సంస్థ అధ్యక్షురాలు జల్లి సుజాత, శ్రీశ్రీ కళా వేదిక జిల్లా అధ్యక్షుడు నల్లా నరసింహమూర్తి, సామాజిక కార్యకర్త మొహబూబ్‌ షకీలా తదితరులు ప్రసంగించారు.

నేడు కలెక్టర్‌,

ఎస్పీ సంయుక్త స్పందన

రాజమహేంద్రవరం రూరల్‌: జిల్లా ఎస్పీ పి.జగదీష్‌తో కలసి సోమవారం ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తామని కలెక్టర్‌ కె.మాధవీలత తెలిపారు. డివిజన్‌, మండల, గ్రామ సచివాలయ స్థాయి స్పందన కార్యక్రమం కూడా యథావిధిగా జరుగుతుందన్నారు. డివిజన్‌, మండల స్థాయి అధికారులందరూ ఒకేచోట ప్రజలకు అందుబాటులో ఉండి, అర్జీలు స్వీకరిస్తారని తెలిపారు.

ఆలయాలకు పోటెత్తిన భక్తులు

సఖినేటిపల్లి: అంతర్వేది లక్ష్మీనృసింహుని సన్నిధికి ఆదివారం అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. కార్తిక మాసం, ఆదివారం సెలవు కావడంతో స్వామి దర్శనానికి పిల్లాపాపలతో వచ్చారు. ఆలయంలో నిర్వహించే సుదర్శన హోమంలో అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నిత్యాన్నదాన పథకంలో సుమారు 7 వేల మంది స్వామి వారి ప్రసాదం స్వీకరించినట్టు ఆలయ అసిస్టెంట్‌ కమిషనర్‌ వి.సత్యనారాయణ తెలిపారు.

అయినవిల్లి గణపతి దర్శనానికి భక్తుల బారులు

అయినవిల్లి: విఘ్నేశ్వరుని ఆలయం ఆదివారం భక్తులతో కిక్కిరిసింది. ప్రధానార్చకుడు అయినవిల్లి సూర్యనారాయణమూర్తి ఆధ్వర్యాన స్వామి వారికి మేలుకొలుపు సేవ, అనంతరం విశేష పూజలు నిర్వహించారు. స్వామివారి లఘున్యాస అభిషేకాలు, లక్ష్మీ గణపతి హోమంలోను అధిక సంఖ్యలో భక్త దంపతులు పాల్గొన్నారు. స్వామి వారికి గరిక పూజ నిర్వహించారు. పంచామృత, ప్రత్యేక అభిషేకాల్లో 146 మంది భక్త దంపతులు, ప్రత్యేక దర్శనంలో 1,010 మంది, శ్రీ లక్ష్మీ గణపతి హోమంలో 38 మంది పాల్గొన్నారు. నూతన వాహనాలకు 29 మంది పూజలు చేయించుకున్నారు. చిన్నారులకు నామకరణాలు, అక్షరాభ్యాలు, తులాభారం వంటి ప్రత్యేక కార్యక్రమాలను 30 మంది నిర్వహించారు. స్వామి వారికి వివిధ పూజలు, అన్నదాన విరాళాల ద్వారా రూ.3,56,591 లభించిందని ఆలయ ఈఓ ముదునూరి సత్యనారాయణరాజు తెలిపారు.

Advertisement
Advertisement