రబీకి వరివడిగా.. | Sakshi
Sakshi News home page

రబీకి వరివడిగా..

Published Tue, Nov 21 2023 11:34 PM

వరి సాగుకు దుక్కి దున్నుతున్న రైతు (ఫైల్‌)  - Sakshi

సాక్షి, రాజమహేంద్రవరం: ఖరీఫ్‌ కోతలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇప్పటికే 42 శాతం పూర్తయ్యాయి. ధాన్యం దిగుబడి ఆశాజనకంగా ఉంది. ఎకరానికి 40 బస్తాలు అందివస్తోంది. ధాన్యం కొనుగోలు ప్రక్రియ సైతం వేగవంతంగా జరుగుతోంది. అదే సమయంలో రబీ సాగుకు సన్నాహాలు మొదలయ్యాయి. ఈ సీజనులో నీటి సరఫరాపై స్పష్టత వచ్చింది. దీంతో రైతులు ఉత్సాహంగా పొలాలను చదును, దమ్ము చేసి సిద్ధం చేయడంలో తలమునకలవుతున్నారు. మరికొంత మంది మరో అడుగు ముందుకేసి నారుమడులు వేస్తున్నారు. వీరిని మరింత ప్రోత్సహించేలా వ్యవసాయ శాఖ కార్యాచరణ ప్రణాళిక రూపొందించింది. విత్తనాలు, ఎరువులు రైతు భరోసా కేంద్రాల్లో అందుబాటులో ఉంచింది. సలహాలు, సూచనలు అందిస్తోంది.

సాగు లక్ష్యం 86,496 హెక్టార్లు

జిల్లా వ్యాప్తంగా రబీలో 86,496 హెక్టార్లలో వివిధ రకాల పంటలు సాగుచేయాలని వ్యవసాయ శాఖ లక్ష్యంగా నిర్దేశించుకుంది. సీజన్‌ సాధారణ విస్తీర్ణం 82,450 హెక్టార్లు. అత్యధికంగా 59,348 హెక్టార్లలో వరి సాగవుతుండగా 10,252 హెక్టార్లలో మొక్కజొన్న సాగవుతుంది. అవసరమైన విత్తన ప్రణాళికను వ్యవసాయ శాఖ రూపొందించింది. 59,348 హెక్టార్లకు గాను 28,000 క్వింటాళ్ల విత్తన ఆవస్యకత ఉంది. అందులో 80 శాతం విత్తనం రైతుల వద్దే ఉంది. మిగిలిన విత్తనాన్ని కోఆపరేటీవ్‌, లైసెన్స్‌డ్‌ ప్రైవేట్‌ సప్లయర్స్‌ నుంచి సేకరించనున్నారు. 10,252 హెక్టార్లలో మొక్కజొన్న సాగు చేపట్టనుండగా వీటని కోఆపరేటీవ్‌, లైసెన్స్‌డ్‌ ప్రైవేట్‌ సప్లయర్స్‌ నుంచి సేకరించనున్నారు. పప్పులు, ఉలవలు, పెసలు, మినుము సాగు చేయనున్నారు.

అందుబాటులో ఎరువులు

ఎరువులు అందుబాటులో ఉంచేందుకు ప్రభుత్వ అధికార యంత్రాంగం సన్నద్ధమవుతోంది. సీజన్‌ ఆరంభం కాకముందే ముందస్తుగా సిద్ధం చేయాలని వ్యవసాయ శాఖ అధికారులు భావిస్తున్నారు. తద్వారా సాగు సమయంలో రైతుల వ్యయ ప్రయాసలను దూరం చేయనున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే సింహభాగం గోదాముల్లో నిల్వ ఉంచారు. రబీ సీజన్‌లో లక్ష మెట్రిక్‌ టన్నుల ఎరువులు వవసరమని అంచనా. ఇప్పటికే 22,000 వేల మెట్రిక్‌ టన్నులు అందుబాటులో ఉంచారు. అవి కాకుండా రైతు భరోసా కేంద్రాల్లో మరో 30,000 మెట్రిక్‌ టన్నులు నిల్వ ఉంచారు. ఆర్బీకేల ద్వారా సులభంగా పొందే వెసులుబాటు కల్పించారు.

నీటి కొరత నివారణకు ప్రణాళికలు

ఈ ఏడాది జూన్‌ నుంచి నవంబర్‌ వరకూ లోటు వర్షపాతమే నమోదైంది. జూలైలో తప్ప మిగిలిన నెలల్లో గోదావరి వరద జాడ కనిపించలేదు. ఫలితంగా రబీలో నీటి కొరత ఏర్పడే అవకాశం ఉందని భావిస్తున్నారు. అయినా ప్రత్యామ్నాయ చర్యలతో నీటి కొరతను అధిగమించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. గోదావరి డెల్టా పరిధిలో ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల పరిధిలో 8,96,507 ఎకరాల రబీ ఆయకట్టు ఉంది. వీటిలో పంటల సాగుకు 91.35 టీఎంసీల నీరు అవసరం. 82.49 టీఎంసీలు అందుబాటులో ఉంది. కొరత ఉన్న 8.86 టీఎంసీల నీటిని వివిధ మార్గాల ద్వారా సమకూర్చేందుకు అధికార యంత్రాంగం చర్యలు తీసుకుంటోంది. రైతులు సైతం కొన్ని జాగ్రత్తలు పాటించాలని కోరుతోంది. టర్న్‌ సిస్టం(వారబందీ) ద్వారా నీటిని పొదుపు చేసి 5 టీఎంసీలు, కాలువలపై క్రాస్‌ బండ్ల ఏర్పాటు, డీజిల్‌ పంపుల వినియోగంతో నీటిని ఎత్తి పోయడం లాంటి పద్ధతులతో మరో 3.86 టీఎంసీలు సమకూర్చనుంది.

ముందస్తుతో మేలు

పెరవలి, ఉండ్రాజవరం, నిడదవోలు, బిక్కవోలు, అనపర్తి మినహా మిగిలిన ప్రాంతాల్లో సాగునీటి కొరత తలెత్తే అవకాశం లేదు. చెరువులు, ట్యాంకులు, బోర్ల ద్వారా 60 శాతం నీటిని అందించే అవకాశం ఉంది. నిర్దేశించిన ప్రాంతాల్లో రబీలో నీటి కొరతను అధిగమించేందుకు ప్రత్యామ్నాయ పద్ధతులు పాటించాలని వ్యవసాయ అధికారులు రైతులకు సూచిస్తున్నారు. ఈనెల 30వ తేదీలోగా ఖరీఫ్‌ పంట కోతలు పూర్తి చేయాలి. రబీ నాట్లు ముమ్మరం చేసేలా డిసెంబర్‌ 1 నుంచి 10వ తేదీ వరకు రైతులకు అవగాహన కల్పించడం. డిసెంబర్‌ 31 నాటికి రబీ సీజన్‌ నాట్ల ప్రక్రియ పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. సింహభాగం సన్నరకాలు సాగు చేయాలని సూచిస్తున్నారు. ఎంటీయూ–1121, (శ్రీదృతి), ఆర్‌అన్‌ఆర్‌ 15048 , అనంతరం బీపీటీ తదితర రకాల సాగుకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరుతున్నారు. తద్వారా 120 నుంచి 130 రోజుల్లో పంట పూర్తవుతుందని, నీటి ఎద్దరిని సైతం ఎదుర్కొనే వెసులుబాటు కలుగుతుందని స్పష్టం చేస్తున్నారు.

55 హెక్టార్లలో నారుమడులు

జిల్లాలో ఇప్పటికే రైతులు రబీ సాగుకు అడుగులు వేస్తున్నారు. చాగల్లు, నల్లజర్ల, తాళ్లపూడి, రాజమండ్రి మండలాల్లో 51 హెకా్టార్లలో నారుమళ్లు సిద్ధం చేస్తున్నారు. వెదజల్లు విధానాన్ని అనుసరిస్తే సత్ఫలితాలు వస్తాయని వ్యవసాయ శాఖ స్పష్టం చేస్తోంది. దమ్ము చేసి, విత్తనాలు వేసి, నారు పెంచి, నాట్లు వేసే దశకు 25 నుంచి 28 రోజుల సమయం పడుతుంది. ఎకరం సాగుకు 25 నుంచి 30 కిలోల విత్తనాలు అవసరమవుతాయి. వెదజల్లులో పెట్టుబడి, సమయం కలిసి వస్తాయి. దమ్ము చేసి, చదును చేసిన వెంటనే నేరుగా వెదజల్లితే 14 కేజీల విత్తనాలు సరిపోతాయి. సగం విత్తనంతో పాటు రెండు వారాల సమయం కూడా ఆదా అవుతుంది. ఆకుతీత, నాట్లకు అయ్యే పెట్టుబడి భారం తగ్గుతుంది.

జిల్లాలో రబీ వరి సాగు ఇలా. (హెక్టార్లలో)

పంట గతేడాది ఈసారి

సాగు విస్తీర్ణం లక్ష్యం

వరి 55,092 59,348

మొక్కజొన్న 8,976 10,252

ముతక ధాన్యాలు 9,192 10,542

కందులు 823 6

పెసలు 97 898

మినుములు 348 1335

పప్పు దినుసులు 1,278 3,337

నీటి లభ్యత తక్కువగా ఉన్నా పూర్తి స్థాయిలో అందించేందుకు కసరత్తు

ముందస్తు చర్యలతో

నీటి కొరత నివారణ

జిల్లా వ్యాప్తంగా

86,896 హెక్టార్లలో సాగు లక్ష్యం

అందుకు అనుగుణంగా సర్వం సిద్ధం

ఇప్పటికే 51 హెక్టార్లలో నారుమడులు

అందుబాటులో విత్తనాలు, ఎరువులు

ప్రణాళిక సిద్ధం

రబీ కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేశాం. రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులను అందుబాటులో ఉంచుతున్నాం. పంటల సాగులో సలహాలు, సూచనలు ఇస్తున్నాం. పంటల సాగుతో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివరిస్తున్నాం. నాణ్యమైన విత్తనాలు అందుబాటులో ఉంచాం. ముందస్తుగా పంట సాగుకు ప్రోత్సహిస్తున్నాం. ఈ ఏడాది ఖరీఫ్‌ దిగుబడులు సైతం ఆశాజకంగా ఉన్నాయి. ఎకరానికి 40 బస్తాల దిగుబడి అందుతోంది.

– ఎస్‌.మాధవరావు,

జిల్లా వ్యవసాయ శాఖ అధికారి

Advertisement
Advertisement