రెడ్‌క్రాస్‌ సొసైటీను బలోపేతం చేయాలి | Sakshi
Sakshi News home page

రెడ్‌క్రాస్‌ సొసైటీను బలోపేతం చేయాలి

Published Tue, Nov 21 2023 11:34 PM

తనూజను అభినందిస్తున్న నరసింహారావు - Sakshi

సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): జిల్లా పరిధిలో ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీని బలోపేతం చేసేందుకు విద్యాసంస్థలను, విద్యార్థులను, యువతను సభ్యులుగా చేర్చాలని జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ ఎన్‌.తేజ్‌ భరత్‌ అన్నారు. కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో మంగళవారం సాయంత్రం రెడ్‌ క్రాస్‌ కమిటీ సమావేశం నిర్వహించారు. జేసీ మాట్లాడుతూ విద్యార్థులు రూ.20, విద్యా సంస్థలు రూ.300 చెల్లించి రెడ్‌ క్రాస్‌ సంస్థలో సభ్యత్వం తీసుకోవాలన్నారు. మరిన్ని సేవ, అవగాహన కార్యక్రమాలను నిర్వహించి, సమాజంలో చైతన్యవంతమైన కార్యక్రమాల్లో ప్రజలను భాగస్వాములు చేయాలన్నారు. డీఆర్వో జి.నరసింహులు మాట్లాడుతూ రెడ్‌ క్రాస్‌ ద్వారా ప్రతి నెల కనీసం రెండు కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. సమావేశంలో రెడ్‌ క్రాస్‌ వైస్‌ చైర్మన్‌ డాక్టర్‌.డాల్‌ సింగ్‌, సభ్యులు డాక్టర్‌ మహాలక్ష్మి, లంకా సత్యనారాయణ, జిల్లా విద్యాశాఖాధికారి ఎస్‌.అబ్రహం, డీఎంఅండ్‌హెచ్‌వో డాక్టర్‌ కె.వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.

దరఖాస్తుల ఆహ్వానం

రాజమహేంద్రవరం సిటీ: జిల్లాలో ఉత్తమ పర్యాటక ప్రాంతాల (గ్రామాల) ఎంపికకు గానూ 2024 ఏడాదికి పర్యాటక మంత్రిత్వశాఖ ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా పర్యాటక రీజినల్‌ డైరెక్టర్‌ వి.స్వామి నాయుడు తెలిపారు. ఈ మేరకు మంగళవారం ప్రకటన విడుదల చేశారు. వ్యవసాయం, వారసత్వం, కళాఖండాలు తదితర విశేషాలు ఉన్న గ్రామాల ప్రజలు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఆసక్తి కలవారు 63099 42025 , 9121725757 నంబర్లను సంప్రదించాలన్నారు. బెస్ట్‌ రూరల్‌ టూరిజం విలేజెస్‌గా ఎంపికై న గ్రామాలకు రాష్ట్ర, జాతీయస్థాయిల్లో పురస్కారాలు అందజేస్తామని తెలిపారు.

జాతీయ స్థాయి

పోటీలకు తనూజ ఎంపిక

తుని: జాతీయ స్థాయి హ్యాండ్‌బాల్‌ పోటీలకు శ్రీప్రకాష్‌ జూనియర్‌ కళాశాలకు చెందిన కర్రి తనూజ ఎంపికై నట్టు విద్యాసంస్థల అధినేత సీహెచ్‌వీకే నరసింహారావు మంగళవారం తెలిపారు. స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలో ఈ నెల 16నుంచి 18 వరకు కర్నూలులో జరిగిన రాష్ట్ర స్థాయి అండర్‌–19 బాలికల హ్యాండ్‌ బాల్‌ పోటీలో తనూజ ఉత్తమ ప్రతిభ చూపిందన్నారు. జాతీయ స్థాయికి అర్హత సాధించిందన్నారు. ఆంధ్రప్రదేశ్‌ జట్టు తరఫున వచ్చె నెల హర్యానాలోని సిర్సాలో జరిగే జాతీయ స్థాయి పోటీలో పాల్గొంటుందన్నారు. వరుసగా రెండు సార్లు జాతీయ స్థాయి హ్యాండ్‌ బాల్‌ పోటీలకు ఎంపికకావడం ఆనందంగా ఉందన్నారు. హ్యాండ్‌ బాల్‌ కోచ్‌ సురేష్‌ ఇచ్చిన శిక్షణతో ఈ అవకాశం లభించిందన్నారు. తనూజను ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు అభినందించారు.

Advertisement
Advertisement