చేపలు, రొయ్యల ఉత్పత్తిలో అగ్రస్థానం | Sakshi
Sakshi News home page

చేపలు, రొయ్యల ఉత్పత్తిలో అగ్రస్థానం

Published Tue, Nov 21 2023 11:34 PM

ధవళేశ్వరం వద్ద గోదావరిలో చేప పిల్లలను వదులుతున్న కలెక్టర్‌ మాధవీలత, ఎంపీ భరత్‌ రామ్‌ - Sakshi

ధవళేశ్వరం: చేపలు, రొయ్యల ఉత్పత్తిలో దేశంలోనే మన రాష్ట్రం అగ్రస్థానంలో ఉందని కలెక్టర్‌ డాక్టర్‌ కె.మాధవీలత, ఎంపీ మార్గాని భరత్‌రామ్‌ అన్నారు. ప్రపంచ మత్స్య దినోత్సవం సందర్భంగా మంగళవారం ధవళేశ్వరం కంచర్లలైన్‌ రేవులో కడియం మత్స్య విత్తన క్షేత్రంలో ఉత్పత్తి చేసిన 29.83 లక్షల చేప పిల్లలను, అలాగే బోట్స్‌ మెన్‌, ఫిషర్‌మెన్‌ మత్స్య సహకార సంఘం లిమిటెడ్‌ ఆధ్వర్యంలో తయారు చేసిన ఐదు లక్షల స్కాంపి రొయ్య పిల్లలను గోదావరిలో వదిలారు. కలెక్టర్‌ మాధవీలత మాట్లాడుతూ గోదావరిలో చేపల వేట సాగిస్తూ ఐదువేల కుటుంబాలు ప్రత్యక్షంగా ఉపాధి పొందుతున్నాయని, చేపల మార్కెటింగ్‌ ద్వారా మరో 3,500 కుటుంబాలకు ఉపాధి లభిస్తోందన్నారు. ఆక్వా రైతులకు ఒక యూనిట్‌ విద్యుత్తును రూ.1.50కు ప్రభుత్వం అందజేస్తోందని, దీని ద్వారా ఆక్వా రంగం సుస్థిరత సాధిస్తుందని తెలిపారు. జిల్లాలో 4,500 ఎకరాల విస్తీర్ణంలోని 67 మైనర్‌ ఇరిగేషన్‌ చెరువులను మత్స్య సహకార సంఘాలకు నామమాత్రం లీజుకు ఇవ్వడం ద్వారా వారి జీవన ప్రమాణాలు పెరుగుతున్నాయన్నారు.

ఎంపీ మార్గాని భరత్‌ రామ్‌ మాట్లాడుతూ మత్స్య పరిశ్రమ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వేల కుటుంబాలు ఉపాధి పొందుతున్నాయన్నారు. దీనికి సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకువస్తున్నాయన్నారు. ఇందులో సీ కేజ్‌ కల్చర్‌ ముఖ్యమైందని తెలిపారు. అనంతరం మత్స్య సహకార సంఘం అధ్యక్షులు, ఫీల్డ్‌ సిబ్బందిని సత్కరించారు. కార్యక్రమంలో రుడా చైర్‌ పర్సన్‌ మేడపాటి షర్మిలారెడ్డి, జిల్లా మత్స్యశాఖ అధికారి వి.కృష్ణారావు, అసిస్టెంట్‌ డైరెక్టర్‌ ఆఫ్‌ ఫిషరీస్‌ దిల్షాద్‌, ఫిషరీస్‌ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్లు ఎస్‌బీ గణేశ్వరరావు, డి.గోపాలరావు, మత్స్యశాఖ సహాయ తనిఖీ అధికారులు వి.దేవానందం, కె.హరీష్‌, పి.కృష్ణవేణి పాల్గొన్నారు.

Advertisement
Advertisement