సుడిగాలుల అలజడి | Sakshi
Sakshi News home page

సుడిగాలుల అలజడి

Published Tue, Dec 5 2023 11:46 PM

- - Sakshi

RJY 232b

సిద్ధంగా అధికార

బృందాలు: కలెక్టర్‌

సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): జిల్లాలో తుపాను తీరం దాటినా అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉందని కలెక్టర్‌ మాధవీలత మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. పొలాల్లో ఉన్న ధాన్యాన్ని మిల్లులకు తరలిస్తున్నామన్నారు. ఆఫ్‌లైన్‌లో కొనుగోళ్లు కొనసాగుతున్నాయన్నారు. లారీలు, గన్ని బ్యాగులు అందుబాటులో ఉంచామన్నారు. క్షేత్రస్థాయిలో జాయింట్‌ కలెక్టర్‌, ఇతర ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తున్నారన్నారు. వర్షాలు తగ్గేవరకు కోతలు కోయవద్దని రైతులకు ఆమె సూచించారు. నీరు నిల్వ తొలగించేందుకు చర్యలు చేపడుతున్నారు. ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్‌, విద్యుత్‌, ఫైర్‌ సర్వీస్‌ అధికారులతో 10 టీములుగా ఏర్పాటు చేసి సిద్ధంగా ఉంచామని తెలిపారు. విద్యుత్‌ సమస్యలు ఎత్తకుండా ట్రాన్స్‌పార్మర్లను అందుబాటులో ఉంచామన్నారు. విద్యుత్‌ స్తంభాలు ఒరిగినా.. విరిగిపోయినా వెంటనే పునరుద్ధరించేందుకు 500 స్తంభాలను సిద్ధంగా ఉంచామన్నారు.

సుడిగాలుల అలజడి

తీరం దాటిన తుపానుతో

ఊపిరి పీల్చుకున్న రైతులు

ప్రభుత్వ తక్షణ స్పందనతో

తప్పిన ముప్పు

ఆకస్మికంగా వీచిన

సుడిగాలులతో భయాందోళన

పలుచోట్ల కూలిన చెట్లు..ఇళ్లపైకప్పులు

సాక్షి, రాజమహేంద్రవరం: రెండు రోజులుగా కంటిపై కునుకు లేకుండా చేసిన మిచాంగ్‌ తుపాను ఎట్టకేలకు తీరం దాటింది. దీంతో గండం గట్టెక్కిందని అన్నదాతల మనసు తేలికపర్చుకున్నారు. గుండెల్లో గుబులు రేకెత్తించిన ఈ తుపానుపై మొదటి నుంచి ప్రభుత్వ ఆదేశాలతో అధికార యంత్రాంగం అప్రమత్తంగా వ్యవహరించింది. అయితే మంగళవారం సాయంత్రం వేళ జిల్లాలోని పలు చోట్ల సుడిగాలి ఆకస్మికంగా బీభత్సం సృష్టించింది. భీకలు గాలులు వీస్తూ భయకంపితులను చేసింది. రాజమహేంద్రవరం నగరం, దేవరపల్లి, పెరవలి మండలాల్లో ఈ గాలులకు కొన్ని ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. భారీ చెట్లు నేలకూలాయి. రోడ్డు మీద వాహనాలు సైతం కింద పడిపోయాయి. జనం సుడిగాలి సమయంలో తీవ్ర ఆందోళన చెందారు. కొన్నిచోట్ల వర్షం పడుతూ ఉంది. రాత్రి వేళ విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలిగింది.

క్షేత్రస్థాయికి అధికార యంత్రాంగం

తుపాను పరిస్థితుల నేపథ్యంలో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఆదేశాల మేరకు అధికార యంత్రాంగం నష్ట నివారణ చర్యలకు ఉపక్రమించింది. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో నష్టపోయిన వారికి సలహాలు, సూచనలు, సహాయక చర్యలకు కలెక్టరేట్‌, ఆర్డీఓ కార్యాలయాల్లో కంట్రోల్‌ రూములు ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా తుపాను నష్టాలను, పరిస్థితులను సమీక్షించేందుకు క్షేత్ర స్థాయికి వెళుతోంది. కలెక్టర్‌ కె.మాధవీలత నేరుగా రంగంలోకి దిగారు. మంగళవారం కొవ్వూరు మండలం కాపవరంలో హార్టికల్చర్‌, వరి పంటలను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ధాన్యం కోతలు, మిల్లులకు తరలించారా? లేదా? ఇంకా కోతలు జరగాల్సినవి ఉన్నాయా? అన్న విషయమై రైతులతో ఆరా తీశారు. రెండు మూడు రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ వరి కోతలు కోయకూడదని సూచించారు. కడియం మండలం మురమండ గ్రామంలో ఆర్డీవో కలిసి కలెక్టర్‌ క్షేత్ర స్థాయిలో పర్యటించి రైతుల్లో ధైర్యాన్ని నింపారు. అనపర్తి మండలం దుప్పలపూడి, పాలమూరు గ్రామాల్లో క్షేత్ర స్థాయిలో జాయింట్‌ కలెక్టర్‌ పర్యటించారు . రాశులుగా , కుప్పలుగా ఉన్న ధాన్యం ఉండడాన్ని చూసి రైతులతో ముఖాముఖి సంభాషించారు. ధాన్యం ఎప్పటి కప్పుడు మిల్లులకు, సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు.

సుడిగాలి బీభత్సం

రాజమహేంద్రవరంలో మంగళవారం సాయంత్రం ఒక్కసారిగా సుడిగాలి విధ్వంసం సృష్టించింది. పలుచోట్ల విద్యుత్తు స్తంభాలు, పలు ప్రాంతాల్లో చెట్లు నేలకొరిగాయి. వెరసి కొన్ని వీధుల్లో రాకపోకలు నిలిచిపోయాయి. ట్రాఫిక్‌ స్తంభించింది. లింగంపేట, ఆదెమ్మ దిబ్బ, లలితానగర్‌, కృష్ణానగర్‌, ఆర్యాపురం తదితర ప్రాంతాల్లో విద్యుత్‌ స్తంభాలు నేలకొరిగాయి. లోతట్టు, పల్లపు ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. కొన్నిచోట్ల షెడ్లు కూలిపోయాయి. పార్కింగ్‌ చేసిన కార్లపై చెట్లు కూలిపోయాయి. కాంక్రీట్‌ షెడ్లు శిథిలమయ్యాయి. ముంపు లోతట్టు ప్రాంతాల్లోని కృష్ణానగర్‌ లింగంపేట ఆదిమ్మ దెబ్బ లలిత నగర్‌ బహన్నలపేట మూల గొయ్యి ఆర్యాపురం తదితర ప్రాంతాల్లో తుపాను ప్రభావం తీవ్రంగా కనిపించింది. వీఎల్‌పురం జంక్షన్‌, రాజేంద్రనగర్‌, గణేష్‌ నగర్‌, మోరంపూడి తదితర ప్రాంతాల్లో వర్షం బీభత్సం సృష్టించింది. మోరంపూడి జంక్షన్‌ సమీపంలో భారీ వృక్షాలు నేలకొరిగాయి.

విమాన సర్వీసులు రద్దు:

మధురపూడి విమానాశ్రయం నుంచి ప్రతి రోజూ హైదరాబాద్‌, బెంగళూరు, చైన్నెలకు ఇండిగో విమాన సర్వీసులు నడుస్తున్నాయి. తి రోజూ 10 విమానాలు రాకపోకలు సాగిస్తుంటాయి. భారీ వర్ష సూచన కారణంగా అన్ని విమానాలు రద్దు చేశారు. 20 సర్వీసులు నిలిచిపోయాయి. ఇవన్నీ ఇండిగో సంస్థకు చెందిన విమానాలే.

నిడదవోలులో ఎమ్మెల్యే పర్యటన

● నిడదవోలు మండలం కలవర్లచర్ల గ్రామంలో ఎమ్మెల్యే శ్రీనివాసులు నాయుడు పర్యటించారు. ఈ సందర్భంగా రైతులు, ప్రజలతో మాట్లాడారు. సోమవారం కోతలు పూర్తి చేసిన 1500 మెట్రిక్‌ టన్నుల ధాన్యం మిల్లులకు తరలించడంతో ఎలాంటి నష్టం వాటిల్లలేదు.

● గోపాలపురం నియోజవర్గ వ్యాప్తంగా అంతర్గత రహదారులపై నీళ్లు పారాయి. ప్రస్తుతానికి బాగానే ఉన్న ఈ ప్రభావంతో భవిష్యత్తులో పోగాకు తోటలు దెబ్బతినే అవకాశం ఉందని రైతులు పేర్కొంటున్నారు. కోతలు పూర్తయిన ధాన్యాన్ని రొడ్డుపైన పట్టలు కప్పి తడవకుండా జాగ్రత్త చేస్తున్నారు. కోతలు కోయాల్సిన పొలాలు 30 శాతం ఉన్నా.. వర్షాల కారణంగా వాటిని ఆపేశారు.

● నల్లజర్లలో ఆనంద నిలయం పాఠశాల నీట మునిగింది. దీంతో విద్యార్థులను ఎంపీపీ పాఠశాలకు తరలించారు. ప్రభుత్వ అనాథాశ్రమ హాస్టల్లోకి వర్షపు నీరు చేరడంతో విద్యార్థులను మండల పరిషత్‌ పాఠశాలకు తరలించారు.

జిల్లాలో 34.5 మిల్లీ మీటర్ల వర్షపాతం

తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా మంగళవారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు 34.5 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా నల్లజెర్లలో 111.6 మిల్లీ మీటర్లు, అత్యల్పంగా బిక్కవోలులో 2.6 మిల్లీ మీటర్ల మేర వర్షం కురిసింది. దేవరపల్లిలో 50.0, గోకవరంలో 49.2, తాళ్లపూడిలో 39.0, ఉండ్రాజవరంలో 20.2, రాజమండ్రి అర్బన్‌లో 18.0 మిల్లీ మీటర్ల వర్షం నమోదైంది. మిగిలిన మండలాల్లో సైతం ఓ మోస్తరు వర్ష పాతం నమోదైంది.

నేడు పాఠశాలలకు సెలవు

కంబాలచెరువు(రాజమహేంద్రవరం): తుపాను నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా అన్ని విద్యాసంస్దలకు ప్రభుత్వం బుధవారం సెలవు ప్రకటించింది. ఈ మేరకు జిల్లా విద్యాశాఖాధికారి ఎస్‌.అబ్రహాం మంగళవారం ఒక ప్రకటన వెలువరించారు. జిల్లాలో కురుస్తున్న వర్షాలు కారణంగా గత రెండు రోజులుగా విద్యాశాఖ వరుస సెలవులు ప్రకటించిందన్నారు. తుపాను ప్రభావం ఇంకా ఉంటుందని భావిస్తూ జిల్లాలోని అన్ని యజమాన్యాల విద్యాసంస్దలకు సెలవు ప్రకటించాల్సిందిగా జిల్లా కలెక్టర్‌ మాధవీలత విద్యాశాఖ అధికారులను ఆదేశించారని పేర్కొన్నారు.

రాజమహేంద్రవరంలో 
భారీ గాలులకు నేలకొరిగిన చెట్టు
1/4

రాజమహేంద్రవరంలో భారీ గాలులకు నేలకొరిగిన చెట్టు

2/4

కలవచర్లలో నేలవాలిన వరిపంటను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే జి.శ్రీనివాస్‌నాయుడు
3/4

కలవచర్లలో నేలవాలిన వరిపంటను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే జి.శ్రీనివాస్‌నాయుడు

4/4

Advertisement

తప్పక చదవండి

Advertisement