విజయానికి ఓటమి తొలిమెట్టు | Sakshi
Sakshi News home page

విజయానికి ఓటమి తొలిమెట్టు

Published Sun, Dec 10 2023 2:32 AM

- - Sakshi

‘నన్నయ’లో జాతీయ స్థాయి వెయిట్‌లిప్టింగ్‌ పోటీలను ప్రారంభించిన మంత్రి రోజా

రాజానగరం: ఓటమిని గెలుపునకు తొలిమెట్టుగా చేసుకుని సాధనను కొనసాగిస్తే విజయం తప్పక వరిస్తుందని ఏపీ టూరిజం, సాంస్కృతిక, యువజన, క్రీడా శాఖ మంత్రి రోజా అన్నారు. నన్నయ యూనివర్సిటీలో నాలుగు రోజులపాటు జరిగే వెస్ట్‌ అండ్‌ సౌత్‌ జోన్‌ ఇంటర్‌ యూనివర్సిటీ మెన్‌ అండ్‌ ఉమెన్‌ వెయిట్‌ లిప్టింగ్‌ ఛాంపియన్‌ షిప్‌ పోటీలను శనివారం ఆమె ప్రారంభించారు. వివిధ రాష్ట్రాల క్రీడాకారుల నుంచి మంత్రి గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో రోజా మాట్లాడుతూ దేశానికి మంచి పేరు తీసుకువచ్చేలా పోటీలలో సత్తాను చాటాలని క్రీడాకారులకు హితవు పలికారు. ఎంతో మంది క్రీడాకారులకు సరైన శిక్షణ, వేదిక లేక ప్రతిభ మరుగున పడిపోతుందన్నారు. ఆత్మవిశ్వాసం సడలిపోనివ్వకుండా గెలుపు కోసం ప్రయత్నించాలన్నారు. మంత్రి వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ దివంగతనేత వైఎస్సార్‌ చూపిన బాటలోనే ఆయన తనయుడు జగన్‌మోహన్‌రెడ్డి కూడా పయనిస్తూ పేదలు ఉన్నత విద్యనభ్యసించేలా అవకాశాలు కల్పిస్తున్నారన్నారు. విద్యారంగంలో విన్నూత్న మార్పులు తీసుకువస్తున్నారన్నారు. ఎంపీ మార్గాని భరత్‌రామ్‌ మాట్లాడుతూ నన్నయ వర్సిటీలో క్రీడాపరంగా ఆధునిక మౌలిక సదుపాయాల కల్పనకు ఖేలో ఇండియా ప్రాజెక్టు తరపున రూ.20 కోట్లకు ప్రతిపాదనలు పంపించామన్నారు. మొదటి విడతగా రూ.8.3 కోట్లు విడుదలయ్యాయన్నారు. రాజానగరం ఎమ్మెల్యే, జక్కంపూడి రాజా మాట్లాడుతూ దివాన్‌చెరువు, సీతానగరంలలో మల్టీలెవెల్‌ ఇండోర్‌ స్టేడియంల నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు.

క్రీడాకారులకు శుభాకాంక్షలు

రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ ఆచార్య హేమచంద్రారెడ్డి, వీసీ ఆచార్య కె. పద్మరాజు మాట్లాడుతూ ప్రస్తుతం 90 యూనివర్సిటీల నుంచి 800 మంది క్రీడాకారులు పాల్గొంటున్నారన్నారు. జాయింట్‌ కలెక్టర్‌ తేజ్‌ భరత్‌, జేఎన్‌టీయుకే వీసీ ఆచార్య ప్రసాదరాజు, రిజిస్ట్రార్‌ ఆచార్య సుధాకర్‌, రాష్ట్ర స్పోర్ట్స్‌ అథారిటీ వైస్‌చైర్మన్‌ ధ్యానచంద్ర, సెంచూరియన్‌ యూనివర్సిటీ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ మేనేజ్మెంట్‌ చాన్సలర్‌ ఆచార్య జీఎస్‌ఎన్‌ రాజు పాల్గొన్నారు.

మొదటిరోజు ఫలితాలు

మహిళల విభాగంలో 45 కిలోలు, పురుషుల విభాగంలో 55 కిలోలు కేటగిరీలో జరిగాయి. మహిళల విభాగంలో బి. రాజేశ్వరి (నన్నయ వర్సిటీ – రాజమహేంద్రవరం), దోనే ఆపేక్షదత్తరి (శివాజీ యూనివర్సిటీ – కొల్హాపూర్‌), హర్షద (సావిత్రీభాయ్‌ఫూలే యూనివర్సిటీ – పూణే) ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలను గెల్చుకున్నారు. పురుషుల విభాగంలో ఆకాష్‌ శ్రీనివాస్‌గౌడ్‌ (నాందేడ్‌ యూనివర్సిటీ – మహారాష్ట్ర), కోటేశ్వర్రావు (నన్నయ వర్సిటీ – రాజమహేంద్రవరం), బాలాజీ (తిరువళ్లూర్‌ యూనివర్సిటీ)లు మొదటి మూడు స్థానాలలో నిలిచారు.

పద్మరాజుకు పుష్పగుచ్ఛం ఇస్తున్న ఎమ్మెల్యే రోజా
1/2

పద్మరాజుకు పుష్పగుచ్ఛం ఇస్తున్న ఎమ్మెల్యే రోజా

క్రీడా పోటీల్లో పాల్గొన్న క్రీడాకారిణి
2/2

క్రీడా పోటీల్లో పాల్గొన్న క్రీడాకారిణి

Advertisement
Advertisement