పంట నష్టం అంచనా | Sakshi
Sakshi News home page

పంట నష్టం అంచనా

Published Tue, Dec 12 2023 11:54 PM

- - Sakshi

జిల్లా వ్యాప్తంగా కదిలిన అధికారులు

18వ తేదీ వరకు పరిశీలన

18 నుంచి 22 వరకు సోషల్‌ ఆడిట్‌

26న తుది జాబితా వెల్లడి

కొవ్వూరు: తుపాను ప్రభావంతో భారీ వర్షాలకు ముంపుబారిన పడిన పంట పొలాలు తేరుకుంటున్నాయి. మరోపక్క బాధిత అన్నదాతలకు అండగా నిలిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. క్షేత్ర స్ధాయిలో నష్టం అంచనాల తయారీకి అధికారులను రంగంలోకి దింపింది. ఈనెల 18 నాటికి అంచనాల తయారీ ప్రక్రియ పూర్తి కానుంది. ఈనెల 18 నుంచి 22 వరకు నష్టం అంచనాపై సోషల్‌ ఆడిట్‌ జరుగుతుంది. ఇందుకోసం వివరాల జాబితాను రైతు భరోసా కేంద్రాల వద్ద అందుబాటులో ఉంచనున్నారు. రైతుల నుంచి అభ్యంతరాలు అందితే పరిశీలించి సరిచేస్తారు. అనంతరం ఈనెల 24న జిల్లా కలెక్టరుకు నివేదిక అందజేస్తారు. 26న పంటనష్టం తుది జాబితాను వెల్లడిస్తారు. తుపాను బాధిత రైతులకు 80 శాతం సబ్సిడీపై విత్తనాలు అందజేయనున్నారు. పంట దెబ్బతిన్న ప్రాంతాల్లో 710 క్వింటాళ్లు అవసరమని ప్రతిపాదించారు. 5.40 టన్నులు శనగలు,1.60 టన్నుల వరి విత్తనాలు అవసరమవుతాయని గుర్తించారు. రెండురోజుల్లో విత్తనాలు జిల్లాకు చేరతాయని అధికారులు చెబుతున్నారు.

33 శాతంపైగా నష్టం వాటిల్లితే..

33 శాతానికి పైగా పంట నష్టం వాటిల్లిన రైతులందరికి ప్రభుత్వం పరిహారం అందిస్తుంది. వరి,అరటి,కూరగాయలు,పొగాకు రైతులు తీవ్రంగా నష్టపోయారు. రైతుకు ఐదెకరాలు గరిష్ట లేదా 2 హెక్టార్లు గరిష్ట పరిమితిగా నిర్ణయించి పరిహారం అందిస్తారు. వరి,వేరుశనగ, పత్తి, చెరకు, మిర్చి, పసుపు, కూరగాయలు,ఉల్లి,పూలు,బొప్పాయి వంటి పంటలపై హెక్టారుకు రూ.17 వేలు చొప్పున, మొక్కజొన్నకు రూ.12,500, చిరు ధాన్యాలు,సన్‌ఫ్లవర్‌ వంటి వాటికి రూ.10 వేలు, పొగాకుకు రూ.10వేలు,జొన్నకు రూ.8,500, మామిడి,జీడిమామిడి తోటలకు రూ.22,500, అరటికి రూ.25వేలు వంతున పరిహారం అందజేస్తారు. గతంలో ఎన్నడూ లేని విధంగా వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం వచ్చాక బాధిత రైతులకు నెలరోజుల వ్యవధిలోనే పరిహారం (వైఎస్సార్‌ ఇన్‌పుట్‌ సబ్సిడీ) అందజేస్తోంది.

ముమ్మరంగా అంచనా ప్రక్రియ

రెండు రోజుల నుంచి పంటనష్టం అంచనాల తయారీ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. పారదర్శకంగా లెక్కలు సేకరిస్తున్నాం. ఈనెల 18వ తేదీ నాటికి ఈ ప్రక్రియ ముగుస్తుంది. 33 శాతానికి పైగా పంట దెబ్బతిన్న రైతులందరికి పరిహారం చెల్లిస్తాం. తుపాను ప్రభావంతో పంట దెబ్బతిన్న రైతులకు 80 శాతం రాయితీపై విత్తనాలు అందించేందుకు ప్రతిపాదనలు పంపించాం.

–ఎస్‌.మాధవరావు,

జిల్లా వ్యవసాయ శాఖ అధికారి

ప్రాథమిక అంచనాలు రెడీ

ఇప్పటికే పంట నష్టంపై అధికారులు ప్రాథమిక అంచనాలు తయారు చేశారు. ఈ లెక్కల ప్రకారం 198 గ్రామాల పరిధిలో 2,709 హెక్టార్లలో వరిపంట ముంపు బారిన పడినట్లు గుర్తించారు. మరో 3,962 హెక్టార్లలో కోత దశలోని వరి నేలకు ఒరిగినట్లు తేల్చారు. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో రబీ ప్రారంభం కావడంతో జిల్లా వ్యాప్తంగా 254 హెక్టార్లలో వరి నారు మళ్లకు నష్టం వాటిల్లిందని గుర్తించారు. వేరుశనగ 148.6, పత్తి 14.2, మినుము 456.4 హెక్టార్లలో దెబ్బతిన్నట్లుగా అంచనా. 2,812.6 హెక్టార్లలో మొక్కజొన్న, ఏడు హెక్టార్లలో చెరకు, మిర్చి 72, పొగాకు 2,157, శనగలు 734, పొద్దుతిరుగుడు 190, జొన్న 65 హెక్టార్లలో దెబ్బతిన్నట్లుగా లెక్క వేశారు. అరటి 902 హెక్టార్లు,కూరగాయలు 519,మిర్చి 39.2,పూలు 11.52,బొప్పాయి 26.90 హెక్టార్లలో నష్టం వాటిల్లిందని భావిస్తున్నారు.

1/3

2/3

3/3

Advertisement
Advertisement