వనసమారాధనలతో మానసిక ఉల్లాసం | Sakshi
Sakshi News home page

వనసమారాధనలతో మానసిక ఉల్లాసం

Published Tue, Dec 12 2023 11:56 PM

- - Sakshi

కలెక్టర్‌ మాధవీలత

పుష్కరవనంలో జిల్లా అధికారులు,

ఉద్యోగుల సందడి

రాజానగరం: విధి నిర్వహణలో నిరంతరం ఒత్తిడికి గురయ్యే ఉద్యోగులకు కార్తిక వనసమారాధనలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని కలెక్టర్‌ కె.మాధవీలత అన్నారు. లాలాచెరువులోని గోదావరి మహా పుష్కరవనంలో మంగళవారం జిల్లా అధికారులు కార్తిక వనసమారాధన నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్‌ మాట్లాడుతూ కొత్తగా ఏర్పడిన జిల్లాలో గత 18 నెలలుగా అనేక సవాళ్లను కలిసికట్టుగా ఎదుర్కొన్నామన్నారు. జిల్లాకు ‘ఈస్ట్‌ గోదావరి ఈజ్‌ బెస్‌ ఏ బెస్ట్‌’ అనేలా మంచి పేరు తీసుకురావడంలో అందరి భాగస్వామ్యం ఉందన్నారు. మనమందరం ఒక్కటే అనే భావనను వనసమారాధనలు కలగజేస్తాయన్నారు. ఇదే స్ఫూర్తితో రాబోయే రోజులలో వివిధ శాఖల అధికారులు, సిబ్బందితో కలిసి ఇంటర్‌ డిపార్టుమెంట్‌ క్రీడా పోటీలను నిర్వహిస్తామన్నారు. దీనిపై జాయింట్‌ కలెక్టర్‌ తేజ్‌ భరత్‌ ఆధ్వర్యంలో కోర్‌కమిటీని వేసి ప్రణాళికను రూపొందిస్తామన్నారు. పురుషులు, మహిళలకు వేర్వేరుగా ఈ క్రీడాపోటీలు ఉంటాయన్నారు. వీటిలో పోలీసు శాఖ కూడా పాల్గొనాలన్నారు. తొలుత కలెక్టర్‌ మాధవీలతకు వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం పుష్కరవనంలోని ఉసిరి చెట్టుకు పూజలు చేయించారు. వివిధ శాఖ అధికారులు, ఉద్యోగులు వారి కుటుంబాలతో వచ్చి సందడి చేశారు. కార్యక్రమంలో ఎస్పీ జగదీష్‌, జాయింట్‌ కలెక్టర్‌ తేజ్‌ భరత్‌, కార్పొరేషన్‌ కమిషనర్‌ కె.దినేష్‌ కుమార్‌, ట్రైనీ కలెక్టర్‌ సి.యశ్వంత్‌, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్లు పి.సువర్ణ, ఎం.భానుప్రకాష్‌, జిల్లా రెవెన్యూ అధికారి జి.నరసింహులు, ఆర్డీఓలు చైత్రవర్షిణి, కృష్ణనాయక్‌, పర్యాటక శాఖ ఆర్‌డీ వి.స్వామినాయుడు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement