ఔను.. సేవాలయమే | Sakshi
Sakshi News home page

ఔను.. సేవాలయమే

Published Wed, Dec 20 2023 11:58 PM

నిడదవోలులో సుందరంగా రూపుదిద్దుకున్న సచివాలయం   - Sakshi

 సాక్షి, రాజమహేంద్రవరం: సంక్షేమ పథకాల ఫలాలు ప్రజలకు చేరువ చేయాలనే సదుద్దేశంతో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రవేశపెట్టిన గ్రామ, వార్డు సచివాలయాలు సేవాలయాలుగా గుర్తింపు పొందుతున్నాయి. పారదర్శకతకు పెద్దపీట వేస్తూ ప్రజల్లో ప్రత్యేక ముద్ర వేసుకుంటున్నాయి. పాలన, సంక్షేమ పథకాల అమలులో కీలక భూమిక పోషిస్తున్నాయి. అట్టడుగు వర్గాలకు చేదోడు వాదోడుగా నిలుస్తున్నాయి. ఆదిలో పెదవి విరిచిన విపక్షాల నోళ్లు మూతపడేలా ఈ విప్లవాత్మక వ్యవస్థ ఉపయోగపడుతున్న తీరుపై ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. వేల మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు దక్కడంతో సీఎం రుణం తీర్చుకోలేమని ఉద్యోగులు స్పష్టం చేస్తున్నారు. ఈనేపథ్యంలోనే సీఎం జగన్‌ జన్మదినమైన గురువారం గ్రామ..వార్డు సచివాలయాల దినోత్సవంగా నిర్వహిస్తామని ఈ ఉద్యోగుల సంఘం ప్రకటించింది.

గ్రామ, వార్డు సచివాలయాలు
గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం దిశగా వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం ఏర్పడిన తొలినాళ్లలోనే బీజం వేసింది. ప్రభుత్వ సేవలను ప్రజల చెంతకే తీసుకెళ్లేందుకు ప్రతి గ్రామం, పట్టణాల్లో 512 గ్రామ, వార్డు సచివాలయాలు అందుబాటులోకి తీసుకువచ్చింది. తద్వారా ప్రజలకు అవసరమైన అన్ని రకాలు సేవలు అందిస్తోంది. లంచాలకు తావులేకుండా పథకాల ఫలాలను ప్రజల గుమ్మం వద్దకే చేరేందుకు క్రీయాశీలకంగా పనిచేస్తోంది.

4,452 మంది ఉద్యోగులు
సచివాయాలు ఏర్పాటు చేసి మిన్నకుండిపోకుండా పాలన వ్యవహారాలు, సంక్షేమ ఫలాలు ప్రజలకు అందించేందుకు 4,452 మంది ఉద్యోగులను నియమించింది. తాత్కాలిక ఉద్యోగులు కాకుండా సచివాలయ ఉద్యోగులకు ప్రొబేషన్‌ డిక్లేర్‌ చేస్తూ విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. వారి జీవితాల్లో వెలుగు నింపింది. ఒక్క తూర్పుగోదావరి జిల్లాలోనే 4 వేల మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం కల్పించింది. ప్రజా ప్రయోజనాలే లక్ష్యంగా పనిచేస్తున్న ప్రభుత్వ లక్ష్యం ఈ వ్యవస్థ ద్వారా నెరవేరుతోంది.

రూ.150 కోట్లతో శాశ్వత భవనాలు
సచివాలయాల్లో అన్ని రకాల మౌలిక వసతుల కల్పనకు అడుగులు వేస్తోంది. శాశ్వత భవన నిర్మాణాలకు ప్రాధాన్యం ఇస్తోంది. జిల్లా వ్యాప్తంగా రూ.150 కోట్లతో 390 భవన నిర్మాణాలకు శ్రీకారం చుట్టింది. ఇప్పటికే ప్రారంభమైన పనులు.. ముగింపు దశకు చేరుకున్నాయి. గ్రామ, వార్డు సచివాలయాల నుంచి 523 సేవలు అందుతున్నాయంటే సచివాలయ స్థాయి అర్థం అవుతోంది. కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రం నుంచి మొదలు రైతులు ధాన్యం విక్రయానికి, పంట నష్ట పరిహారం పొందేందుకు, ఎరువులు, పురుగు మందులు అందించడం, ఇళ్లు లేని వారికి ఇంటి స్థలం ఇప్పించడం లాంటి వందలాది సేవలు నామమాత్రపు రుసుముతోనే 72 గంటల్లోనే అందజేస్తున్నారు. ఏ పథకమైనా సచివాలయమే కీలకంగా మారుతోంది.

గతం.. అధ్వానం
గత ప్రభుత్వ హయాంలో కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు పొందాలంటే కాళ్లరిగేలా మండల కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వచ్చేది. వ్యయ ప్రయాసలకు లోనయ్యేవారు. ఎంతో కొంత ముట్టజెప్పందే ఫలితం దక్కని పరిస్థితి. ప్రభుత్వ పథకంలో లబ్ది పొందాలంటే జన్మభూమి కమిటీ సభ్యుల సిఫార్సు ఉండాల్సిందే. టీడీపీ నేతలు చెప్పిన వారికే పథకాలు అందేవి. చేసేది లేక, అర్హత ఉన్నా.. మిన్నకుండిపోవాల్సిన పరిస్థితులు తలెత్తేవి.

పండుగలా జగన్‌ పుట్టినరోజు
తమకు ఉద్యోగం కల్పించిన, ప్రజలకు సంక్షేమ పథకాలు తమ గ్రామంలోనే అందేలా సచివాలయాలు తీసుకువచ్చిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కు సచివాలయ ఉద్యోగులు సలాం చేస్తున్నారు. అందుకు కృతజ్ఞతగా సీఎం జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. కేక్‌ కట్‌ చేయడం, చిత్రపటానికి పాలాభిషేకం, సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టేందుకు శ్రీకారం చుడుతున్నారు.

Advertisement
Advertisement