Sakshi News home page

Boris Johnson:బోరిస్‌ పతనావస్థకు అసలు కారణాలివే!

Published Fri, Jun 16 2023 11:45 PM

Editorial Article About Former Prime Minister of the UK Boris Johnson - Sakshi

‘అదృష్టం అందలం ఎక్కిస్తే బుద్ధి బురదలోకి లాగింద’ని నానుడి. బ్రిటన్‌ మాజీ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌కు ఇది అక్షరాలా సరిపోతుంది. ఒక సాధారణ స్థాయి నుంచి రాజకీయాల్లోకొచ్చి ప్రధాని పీఠం వరకూ వెళ్లిన జాన్సన్‌ నిరుడు జూలైలో ఆ పదవి పోగొట్టుకోవటమే కాదు... గతవారం ఎంపీ పదవికి కూడా రాజీనామా చేయక తప్పలేదు. తాజాగా సభాహక్కుల సంఘంతో అబద్ధాల కోరుగా ముద్రేయించుకున్నారు. ఎంపీగా తప్పుకున్నారు గనుక సరిపోయిందిగానీ, లేకుంటే ఆయన మూణ్ణెల్లపాటు దిగువ సభ నుంచి సస్పెండయ్యేవారు. 

ప్రజాస్వామ్యంలో బాధ్యతాయుత స్థానాల్లో ఉండేవారు నిజాయితీతో మెలగకపోతే, విశ్వసనీయతను ప్రాణప్రదంగా భావించకపోతే ఏ గతి పడుతుందో చెప్పడానికి జాన్సన్‌ ప్రస్థానం ఒక ఉదాహరణ. మనకు జాన్సన్‌ చేసింది పెద్ద తప్పు అనిపించకపోవచ్చు. కానీ బ్రిటన్‌లో అది చెల్లుబాటు కాదు. కరోనా మహమ్మారి తీవ్రంగా విజృంభిస్తున్న కాలంలో జాన్సన్‌ తన మిత్ర బృందాలతో విందుల్లో మునిగారన్నది ప్రధాన ఆరోపణ. ఆ కాలంలో దేశమంతా లాక్‌ డౌన్‌ అమల్లో వుంది. ప్రధానిగా 2020 మార్చి 23న లాక్‌డౌన్‌ విధించింది ఆయనే. మరో నాలుగు రోజులకు కరోనా వాతపడ్డారు కూడా. లాక్‌డౌన్‌ వల్ల దిగజారిన ఆర్థిక పరిస్థి తులతో, కరోనా తీవ్రతతో జనం అల్లాడుతుంటే ఆ సమయంలో ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నదన్న ఆరోపణలు చెలరేగాయి. కనీసం అప్పుడైనా ఆయన మేల్కొనివుంటే వేరేగా ఉండేది. కానీ విందులు జరగడం అబద్ధమని ఒకసారి, జరిగినా నిబంధనలు ఉల్లంఘించలేదని మరోసారి బొంకారు. పైగా పార్టీలోని తన వ్యతిరేకులనూ, దర్యాప్తు చేస్తున్న సభా హక్కుల సంఘాన్నీ భ్రష్టుపట్టించే ప్రయత్నం చేశారు. 

లండన్‌ మేయర్‌గా ఉన్నకాలంలో జాన్సన్‌ ఓసారి అమెరికా వెళ్లారు. ఆయన్ను చూసిన ఒక పౌరుడు జాన్సన్‌ను దేశాధ్యక్ష పదవికి రిపబ్లికన్‌ అభ్యర్థిత్వాన్ని ఆశిస్తూ దూకుడుగా ప్రచారం చేసుకుంటున్న ట్రంప్‌గా పొరబడ్డారట. ఇలా పొరబడిన పౌరుడెవరోగానీ ఇద్దరిలోనూ పోలికలు న్నాయన్నది వాస్తవం. భౌతికమైన పోలికల మాట అటుంచి తమకొచ్చిన అవకాశాన్ని దుర్వినియో గపర్చటంలో ఇద్దరూ ఇద్దరే. తోచినట్టు మాట్లాడటం, ఇష్టానుసారం వ్యవహరించటం ఇద్దరిలోనూ ఉంది. అమెరికాలో ట్రంప్‌ను దించటానికి ఎన్నికల వరకూ జనం వేచిచూడాల్సి వచ్చింది. కానీ పార్టీ గేటు వ్యవహారం గుప్పుమన్నాక జాన్సన్‌ను సొంత పార్టీయే దించేసింది. నిజానికి పార్టీ గేటు వ్యవహారం ప్రధానిగా జాన్సన్‌ వరసబెట్టి చేసిన నిర్వాకాలకు పరాకాష్ట. ఒక చట్ట ఉల్లంఘనలో పోలీసులు తనకు జరిమానా విధించారని నిరుడు ఏప్రిల్‌లో ఆయనే స్వయంగా ప్రకటించారు. 
ప్రధాని స్థాయి నేత జరిమానా చెల్లించవలసి రావటం దేశ చరిత్రలో అదే తొలిసారి. అయినా అందుకుగల కారణమేమిటో ఆయన చెప్పలేదు. ఈలోగా తన అధికారిక నివాసాన్ని విలాసవంతంగా మార్చడానికి చట్టవిరుద్ధంగా భారీ మొత్తం ఖర్చు చేశారన్న ఆరోపణలొచ్చాయి. ఇది చాల దన్నట్టు అత్యాచార ఆరోపణల్లో జాన్సన్‌కు సన్నిహితుడిగా ఉండే ఎంపీ అరెస్టయ్యాడు. ఆయన మిత్రబృందంలోని మరో మాజీ ఎంపీకి బాలుడిపై లైంగిక దాడి చేశారన్న ఆరోపణ రుజువై శిక్షపడింది. ఆ తర్వాత ‘పార్టీ గేట్‌’ గుప్పుమంది. 

పర్యవసానంగా వరస సర్వేల్లో జాన్సన్‌ రేటు పడిపోయింది. ఆయనపై జనం ఆగ్రహావేశాలతో ఉన్నట్టు వెల్లడైంది. దాంతో 40 శాతం మంది పార్టీ ఎంపీలు జాన్సన్‌ను పదవి నుంచి తప్పించాలని నిశ్చయించుకున్నారు. అయినా పార్టీలో అవిశ్వాసం నుంచి గట్టెక్కారు. కానీ మాజీ ఎంపీపై ఉన్న కేసు గురించి తెలిసినా ఆయన్ను నెత్తినబెట్టుకున్నారన్న నిజాన్ని పార్టీ సభ్యులు సహించలేకపోయారు. అది తప్పేనని జాన్సన్‌ అంగీకరించినా లాభం లేక పోయింది. అంతవరకూ మద్దతుదార్లుగా ఉన్న అప్పటి ఆర్థికమంత్రి, ప్రస్తుత ప్రధాని రిషి సునాక్, ఆరోగ్యమంత్రి సాజిద్‌ జావేద్‌ వంటివారు నిరుడు జూలైలో తమ పదవులకు రాజీనామా చేశారు. పలువురు మంత్రులు సైతం వారి బాట పట్టడంతో జాన్సన్‌ రాజీనామా చేయాల్సి వచ్చింది. 

తాజాగా సభాసంఘం అభిశంసన కన్సర్వేటివ్‌ పార్టీలో ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందన్నది వేచిచూడాలి. వచ్చే సోమవారం ఆ నివేదికపై జరిగే చర్చ సందర్భంగా పార్టీలో లుకలుకలు బయటపడక తప్పదు. నివేదికకు వ్యతిరేకంగా ఓటేయొద్దని పార్టీ ఎంపీలను బోరిస్‌ జాన్సన్‌ కోరు తున్నా, తన తప్పులకు మాత్రం పశ్చాత్తాపం ప్రకటించడం లేదు. సరిగదా ఇదంతా ప్రతీకార రాజకీ యాల పర్యవసానమని చెప్పుకొస్తున్నారు. కనీసం ఈ క్షణంలోనైనా పశ్చాత్తాప పడని నేతను ఎవ రైనా క్షమించగలరా? కన్సర్వేటివ్‌ పార్టీలో జాన్సన్‌ ఎదిగిన క్రమం అసాధారణమైనది. పాత్రికే యుడిగా ఉంటూ పార్టీలోకొచ్చిన జాన్సన్‌  2008 నుంచి 2016 వరకూ రెండుసార్లు లండన్‌ మేయర్‌గా ఉన్నారు. పరిస్థితులు కలిసొచ్చి థెరిస్సా మే ప్రధాని పదవి నుంచి తప్పుకున్నాక 2019లో ఆ పదవి చేజిక్కించుకున్నారు. అదే సంవత్సరం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పార్టీకి అఖండ విజయాన్నందించారు. 

1987 తర్వాత అంత పెద్ద మెజారిటీతో కన్సర్వేటివ్‌లు నెగ్గటం అదే తొలిసారి. ఒంటరి తల్లుల సమస్య మొదలుకొని స్వలింగ సంపర్కం, బ్రిటన్‌ వలసవాదం, బ్రెగ్జిట్‌ వరకూ సమయానుకూలంగా అభిప్రాయాలు మార్చుకుంటూ వచ్చిన జాన్సన్‌ వంటివారిని కన్స ర్వేటివ్‌ పార్టీ నెత్తినపెట్టుకోవటం మొదటినుంచీ విశ్లేషకుల్ని ఆశ్చర్యపరుస్తూనే ఉంది. పోతూ పోతూ జాన్సన్‌ అంటించిన బురద నుంచి ఆ పార్టీ ఏనాటికైనా బయటపడగలదా అన్నది సందేహమే. 


 

Advertisement

తప్పక చదవండి

Advertisement