‘కరోనా’ రాష్ట్రాలకు సుప్రీం తాఖీదు

24 Nov, 2020 00:34 IST|Sakshi

కరోనా వైరస్‌ నియంత్రణ విషయంలో కొన్ని రాష్ట్రాల్లో కనబడుతున్న నిర్లిప్త ధోరణిపై వ్యక్తమవుతున్న ఆందోళన సుప్రీంకోర్టును కూడా తాకిన వైనం పరిస్థితి తీవ్రతను తెలియజెబుతుంది. దేశ రాజధాని నగరంలో ఈమధ్య కరోనా కేసుల సంఖ్య రోజురోజుకూ పెరగడం, ఆసుపత్రులు సైతం కిక్కిరిసి సమస్యలు తలెత్తడం అందరినీ హడలెత్తిస్తోంది. ఒక్క ఢిల్లీ అనే కాదు... ఇంతవరకూ తక్కువ స్థాయిలో కేసులు రికార్డయిన ఉత్తరప్రదేశ్, పంజాబ్, హిమాచల్‌ ప్రదేశ్‌లలో కూడా గత పక్షం రోజులుగా వ్యాధిగ్రస్తుల సంఖ్య పెరుగుతోంది.

ఇంతక్రితం ముమ్మరంగా కరోనా కేసులు నమోదైన మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌లలో అవి తగ్గుముఖం పడుతున్న సమయంలోనే ఈ కొత్త పరిణామం సహజంగానే ఆందోళన కలిగిస్తుంది. కనుకనే కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ కొత్తగా కేసులు పెరుగుతున్న రాష్ట్రాలకు ప్రత్యేక బృందాలను పంపింది. తాజా పరిణామాలు చూసిఢిల్లీ, మహారాష్ట్ర, అస్సాం, గుజరాత్‌లనుంచి సుప్రీంకోర్టు నివేదికలు కోరింది. నియంత్రణ చర్యలు కొరవడితే వచ్చేనెలకు కేసుల సంఖ్య భారీగా పెరిగే ప్రమాదమున్నదని కూడా హెచ్చరించింది. దేశవ్యాప్తంగా  కరోనా కేసులు బాగా తగ్గాయి.

సెప్టెంబర్‌లో రోజుకు సగటున 97,000కు మించి కేసులు నమోదు కాగా అవి ఇప్పుడు 45,000 వరకూ వున్నాయి. ఢిల్లీలో ధోరణి దీనికి భిన్నంగా వుంది. అక్టోబర్‌ నెలాఖరుకు అక్కడ కేసులు తగ్గుముఖం పట్టాయి. నవంబర్‌ 3నాటికి 6,725గా వున్న కేసులు కేవలం మూడు రోజుల వ్యవధిలో పెరగడం మొదలుపెట్టి పదకొండో తేదీకల్లా 8,593కి చేరుకున్నాయి. ఆ తర్వాత కూడా రోజుకు 7,000కన్నా ఎక్కువగానే కేసులు బయట పడుతున్నాయి. 

కరోనా మహమ్మారి పంజా విసరడం మొదలుపెట్టాక మన దేశంతోసహా అంతటా పరిస్థితులు తారుమారయ్యాయి. అంతక్రితం కొంచెం దగ్గు, జ్వరంతో వైద్యుడి దగ్గరకెళ్తే మందులు రాసిచ్చి, విశ్రాంతి తీసుకోమని చెప్పేవారు. ఆ మందుల్లో కూడా యాంటీబయాటిక్స్‌ దాదాపు వుండేవి కాదు. ఇప్పుడంతా మారింది. జ్వరంతోపాటు దగ్గు వుందంటే చాలు... మాస్క్‌ వుందా లేదా అనే దగ్గరనుంచి మొదలుపెట్టి అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నారు. ఊపిరి తీసుకోవడం ఎలావుందో చూస్తున్నారు.

కరోనా వ్యాధి పరీక్ష చేయించుకోమని సలహా ఇస్తున్నారు. దాని ఫలితాలు వచ్చేవరకూ ఇంట్లో అందరికీ దూరంగా విడిగా వుండటం తప్పనిసరవుతోంది. కొన్ని సందర్భాల్లో ఆ రోగికి కరోనా సోకిందని నిర్ధారణవుతోంది కూడా. పరిస్థితులు ఒక్కసారి ఇలా మారిపోగా జనంలో మాత్రం పెద్దగా మార్పు రాలేదు. చాలాచోట్ల భౌతిక దూరం పాటించడం కనబడటం లేదు.

మాస్క్‌ ధరించేవారూ తగ్గిపోతున్నారు. అదేమని ప్రశ్నించేవారూ కనబడటం లేదు. ఇలాంటి నిర్లిప్త వైఖరి సమస్య తీవ్రతను మరింత పెంచుతోంది. ఇందుకు ముందుగా ప్రభుత్వాలను నిందించాలి. కేసులు తగ్గుతున్నాయన్న సంతోషమే తప్ప ఈ సమయంలో తాము చేయా ల్సిందేమిటన్నది పట్టించుకోవడం లేదు. ముఖ్యంగా వైద్య రంగ మౌలిక సదుపాయాలను మెరు గుపరచవలసివుండగా ఎక్కడా దాని జాడ కనబడదు. అదే జరిగుంటే కేసుల సంఖ్య పెరిగేసరికల్లా ఢిల్లీలో ఇంత తత్తరపాటుకు గురికావలసి వచ్చేదికాదు. వెల్లువలా వచ్చి పడుతున్న రోగులకు సదుపాయాలు కల్పించలేక ఆసుపత్రులు వెయిటింగ్‌ లిస్టులు నిర్వహిస్తున్న తీరు ఆందోళన కలిగిస్తుంది. 

కరోనా వైరస్‌ సోకిన కుటుంబాల దయనీయ పరిస్థితులెలావుంటాయో మొన్న కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖకు చెందిన పార్లమెంటరీ స్థాయీ సంఘం నివేదిక కళ్లకు కట్టింది. కరోనా వ్యాపించడం మొదలయ్యాక ప్రభుత్వ ఆసుపత్రులన్నీ రోగులతో కిటకిటలాడటం, కొత్తగా వచ్చే రోగుల్ని తిప్పిపంపడం, చేరినవారికి తగిన సదుపాయాలు కల్పించలేక అవి చేతులెత్తేయడం చాలాచోట్ల కనబడిందని నివేదిక వివరించింది. ఔట్‌ పేషెంట్‌ సర్వీసులు నిలిపేయడంతో దీర్ఘకాలిక వ్యాధు లున్నవారు, ముఖ్యంగా మహిళా రోగులు ఎన్ని ఇబ్బందులు పడవలసివచ్చిందో తెలిపింది.

దేశంలో ప్రజారోగ్య రంగం మొత్తంగా పడకేసిన తీరును అది పట్టిచూపింది. ఇందువల్ల సాధారణ ప్రజలకు జరిగిన నష్టం సామాన్యమైంది కాదు. అసలు కరోనా రోగులకు చేసే చికిత్స విధానం ఎలా వుండాలన్న అంశంపైనే నిర్దిష్టమైన మార్గదర్శకాలు లేవు. కనుకనే తమను ఆశ్రయించిన రోగుల దగ్గర ప్రైవేటు ఆసుపత్రులు అందినకాడికి దండుకున్నాయి. ఒక దశలో న్యాయస్థానాలు కూడా జోక్యం చేసుకోవాల్సివచ్చింది. చికిత్సకు సంబంధించి నిర్దిష్టమైన మార్గదర్శకాలు జారీచేసి, అందుకు గరిష్టంగా ఎంత ఖర్చవుతుందో ప్రభుత్వాలు ప్రకటించి వుంటే ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయించే రోగులకు ఒక అవగాహన వుండేది.

ఇష్టానుసారం వసూలు చేస్తే వారు వెనువెంటనే ఫిర్యాదు చేయడానికి వీలుండేది. ఇదేమీ లేకపోవడం వల్ల ఆసుపత్రుల దోపిడీ నిరాటంకంగా సాగింది. వాటిని తప్పనిసరి పరిస్థితుల్లో ఆశ్రయించినవారు ఆర్థికంగా తీవ్రంగా దెబ్బతిన్నారు. అటు ప్రభు త్వాసుపత్రుల్లో చోటు దొరక్క, ఇటు ప్రైవేటు జోలికి పోయే స్థోమతలేక వుండిపోయిన రోగులు ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఇప్పుడు కరోనా వైరస్‌ తిరిగి విజృంభిస్తున్న సూచనలు కనిపిస్తున్న వేళ ఇలాంటి విషాద పరిస్థితులు పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై వుంది.

ఢిల్లీలో కేసులు పెరుగుతున్నాయి గనుక ఆ మహా నగరానికి రైళ్లు, విమానాల రాకపోకలను నిలిపేసే ఆలోచన చేస్తున్నట్టు మహారాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. అది సరైంది కాదు. అందుకుబదులు ఎక్కే చోట, దిగేచోట ప్రయాణికులకు ఉష్ణోగ్రతలు చూడటం, అనుమానాస్పద కేసుగా తేలితే ఆర్‌టీ పీసీఆర్‌ పరీక్ష చేయడం తప్పనిసరి చేయాలి. కరోనాపై రాష్ట్రాలను నివేదికలు కోరిన సుప్రీంకోర్టు ఈ విషయంలో అవి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నాయో కూడా ఆరా తీయాలి.

Read latest Editorial News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు