చేతులు కాలకముందే...

20 Oct, 2023 00:02 IST|Sakshi

ఆగ్రహం ఉండొచ్చు, ఆవేశం ఉండొచ్చు. కానీ సంయమనం మరిచి ఆగ్రహకారకుల్ని నిర్మూలించాలనుకోవటం ఉన్మాదమవుతుంది. చివరికది స్వీయ విధ్వంసానికి దారి తీస్తుంది. ఈ విషయంలో అమెరికాకు చాలా అనుభవం ఉంది. అందుకే కావొచ్చు ఇజ్రాయెల్‌కు సంఘీభావంగా పర్యటించిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్  ఆ దేశ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహూకు ఇచ్చిన సలహా ఎంతో విలువైనది.

ఆగ్రహాగ్నిని సకాలంలో చల్లార్చుకోనట్టయితే అది మిమ్మల్నే దహిస్తుందని చెప్పటమే కాదు... ఉగ్రదాడి తర్వాత అమెరికా తీసుకున్న చర్యలు ఎలా పరిణమించాయో గుర్తు చేశారు. ఈనెల 7న హమాస్‌ మిలిటెంట్లు ఇజ్రాయెల్‌లోకి ప్రవేశించి విచక్షణారహితంగా వందలమందిని హతమార్చటాన్ని ఎవరూ సమర్థించలేదు. అదే సమయంలో దాడి కార కులపై అంతర్జాతీయ నిబంధనలకు అనుగుణంగా చర్య తీసుకోవాలని ఇజ్రాయెల్‌ను కోరారు.

మిలిటెంట్లు రెచ్చిపోయి నప్పుడో, దేశంలో ఎన్నికలు సమీపిస్తున్నప్పుడో ఇజ్రాయెల్‌ అతిగా వ్యవహరించి పాలస్తీనా పౌరుల ప్రాణాలు తీస్తుండటం దశాబ్దాలుగా రివాజైంది. వెస్ట్‌బ్యాంక్, గాజా, లెబనాన్‌లపై అపాచే హెలి కాప్టర్లు, ఎఫ్‌–16 యుద్ధ విమానాలతో క్షిపణుల వర్షం కురిపిస్తూ ఆసుపత్రులు, స్కూళ్లు, జనావా సాలు నేలమట్టం చేసిన ఉదంతాలు ఎన్నో వున్నాయి. ఇలాంటి సమయాల్లో క్షతగాత్రుల్ని ఆదుకోవ టానికీ, ఇతరత్రా సాయం అందించటానికీ ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో పనిచేసే సంస్థలకు కూడా అనుమతులు లభించవు. ఇప్పుడు జరుగుతున్నదీ అదే.

మందులు, ఆహారపదార్థాలు అందించ టానికి ఈజిప్టువైపునున్న సరిహద్దుల్లో వందలాది ట్రక్కులు రెండురోజులుగా నిలిచిపోయాయి. మరోపక్క ఇజ్రాయెల్‌ భీకర దాడులు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. ఒక ఆసుపత్రిపై జరిగిన రాకెట్‌ దాడిలో 500 మంది చనిపోయారు. ఇప్పటికే దాదాపు అయిదువేల మంది పాలస్తీనా పౌరులు చనిపోగా, పదివేలమంది గాయాలపాలయ్యారు.

హమాస్‌ ప్రయోగించిన రాకెట్‌ గురి తప్పి ఆసుపత్రిపై పడిందని ఇజ్రాయెల్, అది ఇజ్రాయెల్‌ దళాల పనేనని హమాస్‌ అంటున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో బైడెన్  హితవచనం కీలకమైనది. కానీ ఆసుపత్రిపై జరిగిన దాడి విషయంలో ఇజ్రాయెల్‌ను వెనకేసుకు రావటం సరైందేనా? యుద్ధమంటూ మొదలయ్యాక కారకులు ఎవరో వెంటనే గుర్తించలేకపోవటం సర్వసాధారణం.

కనీసం ఆ సంగతి తేలేవరకూ కూడా ఆగకుండా ఇజ్రాయెల్‌ వాదనను సమర్థించటం న్యాయమేనా? వేలాదిమంది క్షతగాత్రులకు వైద్య సాయం నిలువరించి, పదిలక్షల మందిని ఆకలిదప్పుల్లో ఉంచటం సమస్యను చక్కదిద్దగలదని ఆయన విశ్వసిస్తున్నారా? ఈ విషయంలో ఇజ్రాయెల్‌ తీరును తప్పుబట్టాల్సిన అవసరం లేదా?  హమాస్‌ చెరలో బందీలుగా వున్న 200 మందినీ విడుదల చేసేవరకూ గాజాకు ఏ రకమైన మానవతా సాయం అందనీయబోమని నెతన్యాహూ చేసిన ప్రతిన ఏ నాగరిక ప్రమాణాలతో చూసినా నిర సించదగ్గది.

ఇజ్రాయెల్‌ రక్షణకు కావాల్సిన ‘అసాధారణ ప్యాకేజీ’ కోసం అమెరికన్‌ కాంగ్రెస్‌లో ప్రతి పాదిస్తానని చెబుతున్న బైడెన్‌కు సాధారణ ప్రజానీకం గోడు పట్టిన దాఖలాలు లేవు. 2001లో అమె రికాపై ఉగ్రదాడి తర్వాత తీసుకున్న చర్యలతో తమకు న్యాయం దక్కిందని, ఆ క్రమంలో తప్పులు కూడా జరిగాయని ఆయన అంగీకరించటం మంచిదే.

ఆనాడు ఇరాక్‌పై దురాక్రమణ యుద్ధానికి సెనెటర్‌గా ఆయన కూడా మద్దతునిచ్చారు. అది ఇరాక్‌ వినాశనానికే కాక, అమెరికా ఆర్థిక పతనానికి సైతం కారణమైంది. ఈ చేదు అనుభవాలను బైడెన్‌ పరోక్షంగా ప్రస్తావించటంకాక కుండబద్దలు కొట్టినట్టు చెప్పివుంటే బాగుండేది. ఎందుకంటే ఇప్పుడు ఇజ్రాయెల్‌ అక్షరాలా ఉగ్రరూపం దాల్చింది. గతంలో కేవలం ఒకే ఒక సైనికుడి కోసం వేయిమంది పాలస్తీనా పౌరులను విడిచిపెట్టిన ఆ దేశం... హమాస్‌ చెరలో 200 మంది ఇజ్రాయెల్‌ పౌరులుండగా ఇష్టానుసారం ప్రవర్తిస్తున్నది.

అది ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో బందీగా ఉన్న యువతి షెమ్‌ వీడియో తెలియజేస్తోంది. బాంబుల మోతలతో తాము చావుబతుకుల్లో బిక్కుబిక్కుమంటూ వున్నామని, తమను రక్షించటానికి పూనుకోవాలని ఆమె వేడుకుంటోంది. వాస్తవానికి ఇంకా సైన్యం భూతల దాడులకు దిగ లేదు. అది మొదలైతే ఇంకెన్ని వైపరీత్యాలు చూడాల్సి వస్తుందో అనూహ్యం. ఇజ్రాయెల్‌ జైళ్లలో ఉన్న 6 వేల మంది పాలస్తీనా పౌరుల విడుదల, భూతల దాడుల ప్రయత్నాలకు స్వస్తి హమాస్‌ డిమాండ్లు.  

పాలస్తీనాలో శాంతి స్థాపన ఇజ్రాయెల్, హమాస్‌లకు లేదా పశ్చిమాసియాకు మాత్రమే కాదు... అమెరికాకు కూడా అత్యవసరం. ఇజ్రాయెల్‌ తన మతిమాలిన చర్యల ద్వారా ఇప్పటికే సంక్షోభాన్ని మరింత పెంచింది. ఇజ్రాయెల్‌కు అండగా ఉన్నట్టు కనబడకపోతే వచ్చే అధ్యక్ష ఎన్నికల్లో ఇంటిదారి పట్టాల్సివస్తుందని బైడెన్‌ భయపడుతూ ఉండొచ్చు. కానీ ఆ పని చేస్తే అరబ్‌ దేశాలతో ఇజ్రాయెల్‌కు పీటముడి వేయాలన్న అమెరికా లక్ష్యం గల్లంతవుతుంది. గాజా ఆసుపత్రిపై మారణకాండ తర్వాత ఆ ఛాయలు కనబడుతూనే వున్నాయి.

సౌదీ అరేబియా–ఇజ్రాయెల్‌ మైత్రికి సంబంధించిన యత్నాలు కొన్ని వారాల క్రితమే ఫలించగా, అవి కాస్తా నిలిచి పోయాయి. ఇరాన్‌తోనూ ఒప్పందం కుదర్చాలని అమెరికా తహతహలాడింది. దానికి కూడా గండి పడింది. బైడెన్‌తో జరగాల్సిన సమావేశాన్ని పాలస్తీనా నాయకుడు మహమ్మద్‌ అబ్బాస్‌ రద్దు చేసుకున్నారు. జోర్డాన్, ఈజిప్టు దేశాల్లో బైడెన్‌ రెండో దశ పర్యటన వాయిదా పడింది. భూతల దాడులు మొదలైతే అరబ్‌ దేశాల్లో ఊహకందని పరిణామాలు చోటు చేసుకుని, ప్రపంచానికే పెనుముప్పుగా మారుతుంది. దాన్ని నివారించటమే అమెరికాకైనా, మరొక దేశానికైనా అంతిమ లక్ష్యం కావాలి. 

మరిన్ని వార్తలు