‘మహా’ జనానిదే తుది తీర్పు | Sakshi
Sakshi News home page

‘మహా’ జనానిదే తుది తీర్పు

Published Fri, Jan 12 2024 12:09 AM

Sakshi Editorial On Maharashtra Shiv Sena

సుప్రీంకోర్టు తుది గడువు దగ్గరపడుతున్న వేళ మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్‌ రాహుల్‌ నార్వేకర్‌ బుధవారం తన నిర్ణయాన్ని ప్రకటించారు. ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండే నేతృత్వంలోని శివసేన వర్గానికే పార్టీ ఎమ్మెల్యేల్లో అత్యధికుల మద్దతుందనీ, అదే ‘నిజమైన శివసేన’ అనీ తేల్చారు. అలాగని ఉద్ధవ్‌ ఠాక్రే వెంటనున్న ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయలేదు. పార్లమెంటు నుంచి అసెంబ్లీల వరకూ మన చట్టసభల్లో ఫిరాయింపులు, ఇతరేతర సమస్యలు తలెత్తినప్పుడు అధికార పక్షాల ప్రయోజనాల పరిధిని మించి స్వతంత్రంగా నిర్ణయం తీసుకోవటానికి సభాధ్యక్షులు సిద్ధపడరని తరచు రుజువవుతూనేవుంది. మహారాష్ట్ర కూడా దానికి మినహాయింపు కాదు.

అందువల్లే రెండుగా చీలిన శివసేన వర్గాల్లో ఏది నిజమైందో, ఏది కాదో తేల్చడానికి స్పీకర్‌ నార్వేకర్‌కు ఏడాదిన్నర కాలం పట్టిందంటే ఆశ్చర్యం లేదు. జనవరి 10 తుది గడువని సుప్రీంకోర్టు గట్టిగా చెప్పకపోయివుంటే మరెన్ని నెలలు పట్టేదో అనూహ్యం. లెక్కలు తేల్చడానికి శివసేనకు భారీ సంఖ్యలో ఎమ్మెల్యేలు లేరు. అయినా నార్వేకర్‌ గరిష్ట వ్యవధిని తీసుకుని తుది నిర్ణయం ప్రకటించారు. 2019లో ఆ పార్టీ నేతృత్వంలో ఉద్ధవ్‌ ఠాక్రే ముఖ్యమంత్రిగా మహావికాస్‌ అఘాదీ (ఎంవీఏ) ప్రభుత్వం ఏర్పడిననాటికి శివసేన ఎమ్మెల్యేలు 55 మంది.

2022 జూన్‌ 21న 34 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీలో సభానాయకుడిగావున్న ఏక్‌నాథ్‌ షిండే నాయకత్వంలో తిరగబడటంతో పార్టీ నిలువునా చీలింది. వెంటనే ఉద్ధవ్‌ మేల్కొని షిండే స్థానంలో సభానాయకుడిగా అజయ్‌ చౌధరిని నియమించటంతోపాటు, విప్‌గా వున్న షిండే వర్గం నేతను తొలగించి, తన వర్గంలోని సునీల్‌ ప్రభును ప్రకటించారు. ఎన్ని చేసినా ప్రయోజనం లేదని గ్రహించాక జూన్‌ 29న ఉద్ధవ్‌ ఠాక్రే రాజీనామా చేశారు. 

మరికొన్ని నెలల్లో సాధారణ ఎన్నికలు రాబోతుండగా వెలువడిన నార్వేకర్‌ నిర్ణయం... ఈ చీలికను ప్రోత్సహించి షిండే సర్కారులో చేరిన బీజేపీకి సహజంగానే ఊరటనిచ్చే అంశం. భావోద్వేగాల ప్రభావం ఎక్కువుండే మహారాష్ట్రలో ఉద్ధవ్‌ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడివుంటే లోక్‌సభ ఎన్నికల్లో ఆ పార్టీకి సానుభూతి వెల్లువెత్తేది. ఇప్పటికే ఉద్ధవ్‌ శివసేన పేరును, గుర్తును కూడా కోల్పోయారు. ఆ అంశంలో ఎన్నికల సంఘం షిండే వర్గానికి అనుకూలంగా నిర్ణయం తీసుకుంది.

సొంత మనిషిగా భావించిన షిండేయే బీజేపీ ప్రోద్బలంతో శివసేనలో చిచ్చు రగిల్చి ఉద్ధవ్‌కు అన్యాయం చేశారని జనం భావిస్తున్నట్టు పలు సర్వేలు చెబుతున్నాయి. ఇది షిండే వర్గంతోపాటు బీజేపీని కూడా దెబ్బతీసేలా వున్నదని ఆ సర్వేల సారాంశం. అందుకే అనర్హత అంశం జోలికి  వెళ్లకపోవటమే మంచిదని షిండే వర్గం భావించినట్టు కనబడుతోంది. అయితే ఉద్ధవ్‌ వర్గం మౌనంగా ఏమీవుండదు.

స్పీకర్‌ నిర్ణయాన్ని సుప్రీంకోర్టులో సవాలు చేయటంతోపాటు ప్రజాక్షేత్రంలోకెళ్తానని ఇప్పటికే ప్రకటించింది. కనుక ‘నిజమైన శివసేన’ షిండేదేనన్న స్పీకర్‌ నిర్ణయంపై అది కావలసినంత రచ్చ చేస్తుంది. అటు కొందరు ఎమ్మెల్యేలతో నిష్క్రమించిన అజిత్‌ పవార్‌ వర్గంపైనా ఇలాంటి పిటిషనే పెండింగ్‌లో వుంది. ఈనెల 31లోగా వెలువడే ఆ నిర్ణయం కూడా ప్రకంపనలు రేపడం ఖాయం.

మన రాజ్యాంగం సభాధ్యక్షులకు ఎన్నో అధికారాలిచ్చింది. అనేక సందర్భాల్లో న్యాయస్థానాలు సైతం ప్రభుత్వాల బలాబలాలు తేలాల్సింది చట్టసభల్లోనేనని తేల్చిచెప్పాయి. కానీ తాము ఎమ్మెల్యేగా ఎన్నికైన పార్టీల ప్రయోజనాల పరిధిని మించి స్పీకర్లు వ్యవహరించలేకపోతున్నారు. మహారాష్ట్ర విషయానికే వస్తే ఉద్ధవ్‌ వర్గం సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసి, స్పీకర్‌పై ఒత్తిడి తెస్తే తప్ప నిర్ణయం వెలువడలేదు. తమ నిర్ణయాలను ప్రశ్నించే అధికారం న్యాయస్థానాలకు లేదని స్పీకర్‌లు చెబుతూ వుంటారు. వాటి ఆదేశాలను బేఖాతరు చేస్తుంటారు.

అయితే నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించినంతవరకూ అటువంటి స్వతంత్రతను అందరూ హర్షిస్తారు. అందుకు భిన్నంగాపోయి న్యాయస్థానాలతో అక్షింతలు వేయించుకునే పరిస్థితి తెచ్చుకుంటే అది స్పీకర్ల వ్యవస్థను బలహీనపరుస్తుంది. సాధారణంగా ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ లేని సందర్భాల్లో ప్రభుత్వాలు ఏర్పడేటపుడూ... ఆ ప్రభుత్వాలు అస్థిరతలో పడినప్పుడూ ప్రత్యర్థి పక్షాలు ఖరీదైన విలాసవంతమైన హోటళ్లలో శిబిరాలు నిర్వహించటం, అవసరాన్నిబట్టి విమానాల్లో వేరే రాష్ట్రాలకు ఎమ్మెల్యేలను తరలించటం తరచు మన దేశంలో కనబడుతూనేవుంటుంది.

ఈ తంతుమన ప్రజాస్వామ్యానికి తలవంపులు తెస్తున్నది కూడా. దానికితోడు సభాధ్యక్షులుగా వున్నవారు సైతం ఏదో ఒక వర్గం చేతిలో కీలుబొమ్మలై తటస్థతకు తూట్లుపొడిచి నిర్ణయాలు తీసుకోవటం లేదా నిర్ణయ ప్రకటనలో విపరీతమైన జాప్యం చేయటం తరచు కనబడుతుంది. భారీ మెజారిటీతో నెగ్గిన తెలుగుదేశం అధినేత స్వర్గీయ ఎన్‌టీఆర్‌ సర్కారును ఆయనకు స్వయానా అల్లుడైన చంద్రబాబు నాయుడు 1995 ఆగస్టులో కూల్చి, అధికారాన్ని హస్తగతం చేసుకున్నప్పుడు జరిగిన పరిణామాలను ఎవరూ మరిచిపోరు.

అంతకుముందూ, ఆ తర్వాతా కూడా పదే పదే అలాంటి ఉదంతాలే దేశంలో పునరావృతమయ్యాయి. స్పీకర్‌ తాజా నిర్ణయంపై ఉద్ధవ్‌ వర్గం న్యాయస్థానంలోనూ, వెలుపలా పోరాడుతుంది. ఇప్పటికైతే షిండే ప్రభుత్వం నిశ్చింతగా వుండొచ్చు. కానీ ఈ చీలికలపైనా, ప్రభుత్వాలను కూల్చటంపైనా జనం స్పందన ఎలావుండబోతున్నదో రాబోయే ఎన్నికల్లో తేలుతుంది. ఆ తర్వాతైనా రాజకీయ పక్షాలు పరిణతితో వ్యవహరించటం నేర్చుకుంటాయని ఆశించాలి.  

Advertisement

తప్పక చదవండి

Advertisement