సకల జన సాధికారత! | Sakshi
Sakshi News home page

సకల జన సాధికారత!

Published Sun, Jul 10 2022 12:41 AM

Vardelli Murali Editorial About ChandraBabu Naidu And TDP - Sakshi

రాజకీయ పార్టీలు మహాసభలు జరుపుకోవడం సర్వ సాధారణ విషయం. వాటి నియమావళిని బట్టి, వెసులు బాటును బట్టి రెండేళ్లకో మూడేళ్లకో ఈ సభలు జరుగు తుంటాయి. మహాసభలు కొన్ని తీర్మానాలను ఆమోదిస్తాయి. వాటిలో చాలావరకు మొక్కుబడి తీర్మానాలే ఉంటాయి. ఆ తీర్మానంలో పేర్కొన్న అంశాలపై ప్రత్యేకంగా కార్యాచరణ అంటూ ఏమీ ఉండదు. పడికట్టు మాటల తీర్మానాలుగానే అవి మిగిలిపోతాయి. సభకు హాజరైన వాళ్లకు కూడా అవి గుర్తుండవు. కొన్ని మాత్రం భవితకు బాటలు వేసే తీర్మానా లవుతాయి. కొన్నికొన్ని చారిత్రక సందర్భాల్లో కొన్ని రాజకీయ పార్టీల సభలు చేసిన ఇటువంటి తీర్మానాలు చరితార్థమైనాయి.

మాటల తీర్మానాల్లో ఈ దేశంలోనే మేటి పార్టీ తెలుగుదేశం పార్టీ. మాటలు కోటలు దాటును.. అడుగు మాత్రం గడప దాటదు అనడానికి రుజువులు ఆ పార్టీ తీర్మానాలు, నేతల ఉపన్యాసాలు. ఎన్టీ రామారావుకు ‘భారతరత్న’ ఇవ్వాలని ప్రతి మహాసభలో తీర్మానం చేస్తారు. కేంద్రంలో మూడు సందర్భాల్లో అధికార కూటమిలో ఉండి కూడా అందుకోసం కనీస ప్రయత్నం కూడా చేయలేదు. అదీ... తీర్మానాలపై ఆ పార్టీ చిత్తశుద్ధి! మొన్నటి మహానాడులో ఆ తీర్మానం కూడా చేయలేదు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వాన్ని, దాని అధినేత జగన్‌ మోహన్‌రెడ్డిని తిట్టడానికే సమయం సరిపోకపోవడంతో ఇతర తీర్మానాలను పక్కనబెట్టేశారు. వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని కార్యక్రమాలనూ విమర్శించడమే పనిగా 15 తీర్మానాలు చేశారు. కానీ తాము అధికారంలోకి వస్తే ఏం చేయ గలమో చెప్పుకోలేని మేథోనిస్తేజం ఆ పార్టీని అలుముకున్నట్టు స్పష్టమయింది. ఇంచుమించు బ్రెయిన్‌ డెడ్‌తో ఇది సమానం.

కొన్ని తీర్మానాలు చరిత్ర గతులను మార్చాయి. 1978 నాటి ‘ఆనంద్‌పూర్‌ సాహెబ్‌ తీర్మానం’ అకాలీదళ్‌ రాజకీయ గమనా నికి దిక్సూచిగా మారింది. సిక్కుల ప్రత్యేక ప్రతిపత్తికి దారి తీసింది. జస్టిస్‌ పార్టీ 1944 మహాసభల్లో అన్నాదొరై ప్రవేశ పెట్టిన తీర్మానాలు ఆ పార్టీలో చీలికకు దారితీశాయి. పెరియార్‌ నాయకత్వంలో ‘ద్రవిడ కళగం’ పుట్టుకకు అన్నాదొరై తీర్మానాలు దోహదం చేశాయి. తర్వాత కాలంలో డీకే నుంచి డిఎమ్‌కే వేరుపడడం, తమిళనాడు చరిత్ర మారడం మనకు తెలిసిందే! లాహోర్‌ కాంగ్రెస్‌లో ‘పూర్ణస్వరాజ్‌’ తీర్మానం తర్వాతనే స్వాతంత్య్రోద్యమంలో వేగం పెరిగింది. బొంబాయి కాంగ్రెస్‌ చేసిన ‘క్విట్‌ ఇండియా’ తీర్మానం తర్వాతనే స్వాతంత్య్ర ప్రకటన అనివార్య పరిణామంగా మారింది. ఇలా చెప్పుకుంటూ పోతే ముఖ్య రాజకీయ పార్టీల్లో ఇటువంటి ‘బాటలు వేసే’ తీర్మానాలు చాలా గుర్తుకురావచ్చు.

రివల్యూషన్‌ రెక్క విప్పుతున్నప్పుడే దాని విశ్వరూపాన్ని గుర్తించగలగడం దూరదృష్టికి ఒక కొండగుర్తు. నిన్న, మొన్న మంగళగిరిలో జరిగిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్లీనరీలో చేసిన తీర్మానాలను జాగ్రత్తగా గమనించండి. వికసించనున్న విప్లవ కుసుమ పరాగం కనబడుతుంది. రెండు రోజుల్లోనూ ప్రవేశ పెట్టిన తీర్మానాల్లో అంతస్సూత్రంగా ‘సకలజన సాధికారత’ అనే మంత్రం ప్రవహించింది. పేదవర్గాల సాధికారతకు బాటలువేసే ఈ అంశాల అమలు ఇప్పటికే ప్రారంభమైంది. మరింత పట్టుదలతో విజయవంతంగా ఈ కార్యక్రమాలను పూర్తి చేయబోతున్నామని తీర్మానాలు స్పష్టం చేశాయి. 

నిరుపేదలకు ‘రోటీ, కపడా ఔర్‌ మకాన్‌’ కోసం జరిగిన పోరాటాలు గత చరిత్రగా మిగిలిపోతున్నాయి. కేవలం బతకడం మాత్రమే కాదు... మనిషిగా బతకడం, తెలివితేటలు అలవర్చు కోవడం, ఉన్నతమైన విద్యను అందుకోవడం, సౌకర్యవంతమైన ఇంటిలో నివాసం ఉండడం... ఒక్కమాటలో తన జీవన గమ నాన్ని తానే నిర్ణయించుకోగలగడం సాధికారత! ‘నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం’ అన్నాడు మహాకవి శ్రీశ్రీ. దోపిడీ – పీడన పునాదిగా ఏర్పడిన గడచిన పాలనా వ్యవస్థల్లో సాధికారత అనేది పాలకవర్గంలోని పురుషులకు మాత్రమే పరిమితం. 

వైవిధ్యభరితమైన మనదేశంలో, మన నిచ్చెనమెట్ల సామా జిక దొంతరల్లో అత్యధిక జనాభా కలిగిన బీసీ, ఎస్సీ, ఎస్టీలతో పాటు మైనారిటీ మతస్థులు కూడా సాధికారతకు బహుదూరంగా మిగిలిపోయారు. అగ్రకులాలుగా చెప్పుకునే వారి లోని పేద ప్రజల్లో కూడా సాధికారత మృగ్యం. అన్ని వర్గాల్లోనూ నిట్టనిలువునా మహిళలందరూ సాధికారతకు నోచుకోనివారే!

శతాబ్దాల పాటు బానిసత్వంలో మగ్గిన ఈ దేశంలో... బహుజనులందరూ నిరక్షరాస్యులుగా, పేదలుగా కునారిల్లిన ఈ దేశంలో... ప్రజాస్వామ్య వ్యవస్థ శోభిల్లాలంటే ప్రజలందరినీ సాధికారత వైపు మళ్లించవలసిన అవసరముందని అప్పటి మన జాతీయ నేతలు, రాజ్యాంగ నిర్మాతలు గుర్తించారు. అప్పుడు రాజ్యాంగ సభలో డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ కూడా ఉండడం, ఆయనే రచనా సంఘానికి అధ్యక్షుడిగా ఉండడం ఈ దేశ బహుజనులు చేసుకున్న పుణ్యఫలితం.

దేశ శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థలకు దిశా నిర్దేశం చేస్తూ అందుకు అవసరమైన నిబంధనలను ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాల పేరుతో రాజ్యాంగంలో చేర్చారు. వాటిని అమలుచేయమని ఆదేశిం చారు. రాజ్యాంగ స్ఫూర్తినీ, సందేశాన్నీ క్లుప్తంగా గుదిగుచ్చి, రాజ్యాంగానికి ఆత్మ వంటి ఒక పీఠికను రూపొందించారు. సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం, సాధికారత సాధనే రాజ్యాంగ పీఠిక సందేశం. ఆనాటి నుంచీ నేటివరకూ కేంద్ర, రాష్ట్రాలను పాలించిన ప్రభుత్వాలు ఓట్ల కోసం మాత్రమే సంక్షేమ మంత్రం జపించాయి తప్ప రాజ్యాంగ స్ఫూర్తిని అర్థం చేసుకొని సాధికారత సాధన కోసం కృషి చేయలేదు. 

2019 సాధారణ ఎన్నికల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. తన మంత్రివర్గ కూర్పుతోనే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ రాజకీయ పండితులను షాక్‌కు గురిచేశారు. ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలన్నిటికీ కలిపి యాభై శాతం కంటే కొంచెం తక్కువగానే కేబినెట్‌ బెర్తులు దొరికేవి. అన్ని రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి. ఈ సంఖ్యను ఎకాయెకిన 70 శాతానికి తీసుకొనిపోయిన జగన్‌ సాహసానికి రాజకీయ పక్షాలు నివ్వెరపోయాయి. బలమైన వర్గాలను ఎలా సంతృప్తిపరచగలడు? ఎలా సర్కార్‌ను నిలబెట్టుకోగలడని సందేహించిన వారు కూడా ఉన్నారు. ఎవరి సందేహాలనూ ఆయన ఖాతరు చేయలేదు. ఐదు ఉపముఖ్యమంత్రి పదవుల్ని సృష్టించి, అందులో నాలుగు ఈ వర్గాలకే కేటాయించారు. మంత్రి పదవులివ్వడమే కాదు... విద్య, హోం వంటి కీలక శాఖల్ని సైతం బలహీనవర్గాలకే కేటాయించారు. మహిళలకు ముఖ్య శాఖల్ని కట్టబెట్టారు. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో సైతం ఇదే తూకాన్ని పాటించారు.

స్థానిక సంస్థల్లోనూ పాత ఫార్ములాను తిరగరాశారు. 70 శాతానికి పైగా బలహీనవర్గాలకు కేటాయించారు. తిరిగి వాటిలో యాభై శాతానికి పైగా మహిళలకే కట్టబెట్టారు. శాసనసభ స్పీకర్, శాసన మండలి ఛైర్మన్‌ పదవులు రెండూ ఏకకాలంలో ఈ వర్గాలకే ఇవ్వడమనేది గతంలో ఊహకైనా అందని విషయం. నామినేషన్‌ పదవుల్లోనూ, నామినేషన్‌ పనుల్లోనూ యాభై శాతం ఈ వర్గాలకే కేటాయించడాన్ని చట్టబద్ధం చేశారు. అందులోనూ మళ్లీ సగభాగం ముఖ్యమంత్రి మాటల్లో ‘అక్కాచెల్లెమ్మలకే’! ఈ చర్యలు రాజకీయంగా, సాంఘికంగా కూడా బలహీనవర్గాల ప్రజల ఆత్మవిశ్వాసాన్ని వందరెట్లు ఇనుమడింపజేశాయి. అయితే ఈ నియామకాల దగ్గరే జగన్‌మోహన్‌రెడ్డి ఆగిపోలేదు. విధానాల రూపకల్పనలో, పరిపాలనా పద్ధతుల్లో ఆయన ప్రవేశపెట్టిన మార్పులను నిశితంగా గమనిస్తే – ఒక విప్లవాత్మకమైన ఆలోచన వీటి వెనుక కనిపిస్తుంది. మహాశిల్పి ఉలితో ఒక శిల్పాన్ని చెక్కడానికి సిద్ధమైనప్పుడు ఎంత కచ్చితమైన లెక్కలు వేసుకుంటాడో అంత కచ్చితమైన అంచనాలతో ‘సకల జనుల సాధికారతా’ శిల్పాన్ని మలచడానికి వైఎస్‌ జగన్‌ సిద్ధపడ్డారు.

విద్యారంగం, వైద్య – ఆరోగ్య రంగం, వ్యవసాయ రంగా లను సంస్కరించడం ద్వారానూ, పరిపాలనా వికేంద్రీకరణ – పారదర్శకతల తోడుతోనూ ఆరోగ్యకరమైన సమాజాన్ని రూపొందించవచ్చనీ, రాజ్యాంగ విహిత లక్ష్యాలను నెరవేర్చ వచ్చనీ ఏపీ ముఖ్యమంత్రి వేసిన అడుగులు రుజువు చేశాయి. పేద పిల్లలకు కూడా పెద్దవారి పిల్లలతో సమానంగా నాణ్యమైన చదువును ఉచితంగా చెప్పించినట్లయితే, వారికి మాదిరిగానే ఇంగ్లిషు మీడియంలో నేర్పించినట్లయితే, ఆత్మన్యూనత తలెత్తకుండా వారికి మల్లేనే కొత్త బూట్లు, యూనిఫామ్, బెల్ట్, బ్యాగ్‌లు సమకూర్చినట్లయితే, ప్రైవేట్‌ స్కూళ్లకు తీసిపోకుండా ప్రభుత్వ పాఠశాలలు కూడా సౌకర్యాలతో మురిసిపోయి నట్లయితే... పేదింటి పిల్లలు కూడా జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీ పరీక్షలు ఎదుర్కోగలరని భావించిన ముఖ్యమంత్రి ఆ ఏర్పాట్లన్నీ చేశారు. పిల్లల్ని కచ్చితంగా బడికి పంపించడానికి ప్రోత్సాహకంగా ‘అమ్మ ఒడి’ అనే వినూత్న కార్యక్రమాన్ని అమలు చేశారు. ఈ సంస్కరణల అడుగులు ఇప్పుడిప్పుడే పడుతున్నాయి. ఓ పదేళ్లు గడిస్తే మన సమాజంపై ఈ సంస్కరణ పెను ప్రభావం చూపనుంది. నేటి పేదిళ్లను పెద్దిళ్లుగా మార్చబోతున్న దివ్యాస్త్రం ఇది!

రాష్ట్రాన్ని సంపూర్ణ ఆరోగ్య సమాజంగా మార్చే కృషిని చాలా పెద్దయెత్తున వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం చేపట్టింది. ఈ ఒక్క రంగంలోనే 40 వేల నియామకాలను ప్రభుత్వం చేపట్టింది. ప్రతి మండలానికీ రెండేసి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను పెట్టి, ఇద్దరేసి డాక్టర్ల చొప్పున నియమించి పటిష్ఠం చేశారు. ప్రతి గ్రామంలోనూ వెల్‌నెస్‌ సెంటర్లు ఏర్పాటుచేశారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఆధ్వర్యంలోనే 16 కొత్త మెడికల్‌ కాలేజీల ఏర్పాటుకు నడుం కట్టారు. అంతిమంగా ప్రతి కుటుంబం ఒక డాక్టర్‌తో, అతని ద్వారా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంతో, అక్కడి నుంచి కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌తో, ఏరియా ఆస్పత్రితో, జిల్లా ఆస్పత్రితో, చివరగా ప్రభుత్వ జనరల్‌ హాస్పి టల్‌తో అనుసంధానమయ్యే ఒక వినూత్న పద్ధతిని ముఖ్య మంత్రి డిజైన్‌ చేశారు. ప్రతి కుటుంబాన్నీ నెలకు రెండుమార్లు పరామర్శించనున్న ఫ్యామిలీ డాక్టర్‌ వెనుక ఇంత పటిష్ఠమైన ఆరోగ్య వ్యవస్థ రూపుదిద్దుకోబోతున్నది. ఆ వ్యవస్థలో ప్రతి పౌరుడి ఆరోగ్య ప్రొఫైల్‌ నిక్షిప్తమై ఉంటుంది. ఈ వ్యవస్థకు పునాదులు ఇప్పుడే పడ్డాయి. పేద – ధనిక తేడా లేకుండా ఆరోగ్య సమాజం అందరికీ ఒకే రకమైన ధీమానిస్తుంది.

ఆర్‌బీకె సెంటర్లను ఇప్పటికే ఎన్ని బృందాలు దర్శించి, హర్షించి వెళ్లాయో లెక్కేలేదు. దీన్ని దేశవ్యాప్తం చేయాలని ఇప్పుడు కేంద్ర వ్యవసాయ శాఖ కూడా ఆలోచిస్తున్నది. రైతుకు కావలసిన నాణ్యమైన ఎరువులు, విత్తనాలను అదనులోనే అందజేస్తూ, పంటల మార్కెటింగ్‌లోనూ తోడ్పడే విధంగా ఈ వ్యవస్థను ప్లాన్‌ చేశారు. వ్యవసాయ సంక్షోభానికి ముఖ్య కారణాలైన పెట్టుబడి వ్యయం – గిట్టుబాటు కాని ధర అనే రెండు సమస్యలకూ ఆర్‌బీకె సెంటర్లు, ఆర్‌బీకె సెంటర్ల మధ్యవర్తిత్వం వలన పరిష్కారం లభించబోతున్నది.
పరిపాలనా వికేంద్రీకరణలో చిట్టచివరి స్థాయికి – ఇంటి గడప వద్దకు ఈ ప్రభుత్వం వెళ్లగలిగింది.

వలంటీర్ల వ్యవస్థకు దేశవ్యాప్తంగా ప్రశంసలు లభిస్తున్నాయి. విలేజ్‌ సెక్రటేరియట్‌ ఒక విప్లవాత్మక ఆలోచన. కుల, మత, రాజకీయ విభేదాలకు అతీతంగా అర్హత గల ప్రతి ఒక్కరూ ప్రభుత్వ పథకాల లబ్ధి పొందడానికి ఈ సెక్రటేరియట్‌ల ద్వారా అవకాశం చిక్కింది. ఎవరి దయాదాక్షిణ్యం అవసరం లేకుండానే, వారికిది అందు తున్నది. పారదర్శకత పెరిగింది. ప్రత్యక్ష నగదు బదిలీ స్కీమ్‌ల ద్వారా ఒక్క పైసా కూడా దుర్వినియోగం కాని పరిస్థితి ఏర్పడింది. ఒక్క పైసా లంచం ఇవ్వాల్సిన అవసరం లేని పరిస్థితులు ఏర్పడ్డాయి. మౌలికమైన ఈ మార్పుల ఫలితంగా సకలజన సాధికారతలో ఇప్పుడిప్పుడే ముందడుగులు పడు తున్నాయి. ప్రభుత్వం అమలుచేస్తున్న ఈ కార్యక్రమాలకు జేజేలు పలుకుతూ వైఎస్సార్‌సీపీ ప్లీనరీ సమావేశాలు తీర్మానా లను ఆమోదించాయి. 

విప్లవాత్మకమైన ఈ సంస్కరణలకు విపక్షాలు వ్యతిరేక వైఖరి తీసుకోవడం వింతల్లోకెల్ల వింత. ఒక రకంగా ఆత్మహత్యా సదృశం. ఏ గొప్ప పథకమైనా... దాని ప్రస్థానంలో అక్కడక్కడా చిన్నచిన్న తప్పులు దొర్లవచ్చు. తప్పటడుగులు పడవచ్చు. అలాంటి వాటిని వెతికి పట్టుకొని, ప్రయాణాన్నే వ్యతిరేకించడం వెర్రితనమే అవుతుంది. ఇంగ్లిషు మీడియాన్ని వ్యతిరేకించి చివాట్లు తిన్నట్టే... ఈ వ్యతిరేక వైఖరితో కూడా విపక్షాలకు చీవాట్లు తప్పకపోవచ్చు. ఎందుకంటే ప్రజలు ఈ గొప్ప సాధి కారతా యజ్ఞానికి సానుకూలంగా ఉన్నారు. తమ తలరాతలు మార్చే ఈ ప్రయత్నాలకు అండగా ఉన్నారు.

పార్టీ అధ్యక్షుడిగా మరోసారి ఎన్నికైన అనంతరం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్లీనరీలో ముగింపు ప్రసంగం చేశారు. ‘‘మన రాష్ట్రంలో ఒక యుద్ధం జరుగుతోంది. రెండు సిద్ధాంతాల మధ్య, భావాల మధ్య యుద్ధం జరుగుతోంది. ఈ యుద్ధంలో పేదలు, దిగువ మధ్య తరగతి వర్గాలకు న్యాయం చేయాలనీ, అండగా నిలవాలనీ మనం... ఆ పేదలకు, దిగువ మధ్య తరగతి వర్గాలకు న్యాయం చేయడానికి వీల్లేదని టీడీపీ, ఆ పార్టీకి తోడుగా దుష్టచతుష్టయం ఎలా వాదిస్తున్నాయో.. ఎంత నిస్సిగ్గుగా ప్రయత్నం చేస్తు న్నాయో చూడండి... ఈ యుద్ధంలో అర్జునుడి పాత్ర మీరే’’ అని కార్యకర్తలను ఉద్దేశించి అన్నారు. అర్జునుడి మరో పేరు విజయుడు. జగన్నాథుడు సారథిగా ఉండగా, అర్జునుడు ఓడిందెన్నడు? ఫలితం స్పష్టం. 2019 ఎన్నికల విజయాన్ని అదే స్థాయిలో యథాతథంగా వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ పునరావృతం చేయబోతున్నది. 
మార్జిన్‌ ఆఫ్‌ ఎర్రర్‌... ప్లస్‌/ మైనస్‌ 1%. 

- వర్ధెల్లి మురళి 
vardhelli1959@gmail.com

Advertisement
Advertisement