రాగి జావతో మెరుగైన పోషకాలు | Sakshi
Sakshi News home page

రాగి జావతో మెరుగైన పోషకాలు

Published Wed, Mar 22 2023 2:28 AM

విద్యార్థులకు రాగి జావ అందిస్తున్న కలెక్టర్‌ వె.ప్రసన్న వెంకటేష్‌  - Sakshi

ఏలూరు(మెట్రో): రాగి జావతో పిల్లలకు ఐరన్‌, కాల్షియం, మెగ్నీషియం వంటి పోషకాలు అందుతాయని కలెక్టర్‌ వె.ప్రసన్న వెంకటేష్‌ తెలిపారు. మంగళవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి వర్చువల్‌గా రాగిజావ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమానికి ఏలూరు కలెక్టరేట్‌ వీడియో కాన్ఫరెన్స్‌ హాలు నుంచి విద్యాశాఖ అధికారులు, వివిధ పాఠశాలల విద్యార్థినులతో కలిసి కలెక్టర్‌ ప్రసన్న వెంకటేష్‌ హాజరయ్యారు. ముఖ్యమంత్రి కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం విద్యాశాఖ అధికారులతో కలిసి విద్యార్థులకు రాగి జావ అందించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ విద్యార్థుల ఆరోగ్యానికి రాగిజావ ఎంతో ప్రయోజనకరమని అన్నారు. జగనన్న గోరుముద్ద పథకంలో భాగంగా ఏలూరు జిల్లాలో 1815 పాఠశాలల్లోని 1,49,387 మంది విద్యార్థులకు రాగిజావ ద్వారా పౌష్టికాహారాన్ని అందిస్తున్నట్లు కలెక్టర్‌ వివరించారు. ప్రతి మంగళ, గురు, శనివారాల్లో విద్యార్థులకు రాగిజావ అందిస్తున్నట్లు తెలిపారు. రాగిజావతో పిల్లలకు ఐరన్‌, కాల్షియం, మెగ్నీషియం వంటి పోషకాలు అందుతాయని, జ్ఞాపకశక్తి పెరుగుదలతో పాటు రక్తహీనత లోపం లేకుండా, రోగనిరోధక శక్తిని పెంచేందుకు రాగిజావ ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. కార్యక్రమంలో డీఈఓ ఎన్‌వీ రవిసాగర్‌, అసిస్టెంట్‌ డైరెక్టర్‌ స్కీమ్స్‌ ఎండీఎం షరీఫ్‌, ఎంఈఓ నరసింహమూర్తి తదితరులు పాల్గొన్నారు.

కలెక్టర్‌ ప్రసన్న వెంకటేష్‌

Advertisement
Advertisement