మామిడి ముంచేసింది! | Sakshi
Sakshi News home page

మామిడి ముంచేసింది!

Published Wed, May 17 2023 12:00 PM

నూజివీడు మండలం దిగవల్లిలో వడదెబ్బకు రాలిన మామిడి కాయలు   - Sakshi

ఏలూరు(మెట్రో): ఈ ఏడాది మామిడిపై ఎన్నో ఆశలు పెట్టుకున్న రైతులకు నిరాశే మిగిలింది. అకాల వర్షాలు, అధిక ఉష్ణోగ్రతలతో మామిడి పంట దిగుబడి బాగా పడిపోయింది. వచ్చిన పంట కూడా నాణ్యంగా లేకపోవడంతో రైతుకు గిట్టుబాటు ధర దక్కడం లేదు. దీంతో ఈ ఏడాది బాగా నష్టపోయామని రైతు ఆవేదన చెందుతున్నారు.

గతంలో ఎన్నడూ లేని విధంగా మామిడి రైతు ఈ ఏడాది నష్టపోయాడు. ఇతర రాష్ట్రాలకు ఎగుమతయ్యే మామిడికి ప్రస్తుతం సొంత రాష్ట్రంలోనూ సరైన ధర దక్కని పరిస్థితి. అసలే కాపు తక్కువగా రావడం, మూడు దఫాలుగా వచ్చిన గాలి దుమ్ములు, అకాల వర్షాలకు, ఎండ వేడిమికి పూత పిందె, కాయ ఇలా అన్ని దశల్లోనూ రాలిపోయింది. అక్కడక్కడా కొన్ని కాయలు ఉన్నా, ఆ కాయలకు మంగు మచ్చ ఆశించడంతో కనీసం ఎకరాకు రూ.30 వేలు కూడా దక్కని పరిస్థితి.

కూలీ ఖర్చులు కూడా రాని పరిస్థితి
జిల్లాలో బంగినపల్లి, రసాలు అధికంగా ఉత్పత్తి అయ్యేవి. రైతుకు ఈ రకాలే అధిక ఆదాయాన్ని తెచ్చి పెట్టేవి. ఇతర రాష్ట్రాలకు సైతం ఎగుమతి చేసేవారు. ప్రస్తుతం ఇటీవల కురిసిన వర్షాలతో పాటు, ఏప్రిల్‌ నెలలో విపరీతమైన ఎండల వల్ల పంట దెబ్బతింది. దీంతో కనీసం కూలీ ఖర్చులు కూడా రాక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. అకాల వర్షాలకు, అధిక ఉష్ణోగ్రతలకు మామిడి నాణ్యత లేకుండా రైతును ముంచేసింది.

ఇతర రాష్ట్రాలకు తగ్గిన ఎగుమతులు
కాయపై మచ్చ ఏర్పడటంతో మధ్యప్రదేశ్‌, ఉత్తర ప్రదేశ్‌, పంజాబ్‌, ఢిల్లీ వంటి రాష్ట్రాలకు ఎగుమతి కావాల్సిన మామిడి స్థానికంగానే ఉండిపోతోంది. గతంలో నూజివీడు రసాలు అంటే ఇతర రాష్ట్రాలకు ఎంతో ప్రసిద్ధి. అలాంటి నూజివీడు ప్రాంతంలో రైతులు తీవ్ర నష్టాలను మూటగట్టుకున్నారు. ఆగిరిపల్లి, నూజివీడు, చాట్రాయి, ముసునూరు, చింతలపూడి మండలాల్లో 14 వేల హెక్టార్లలో మామిడి విస్తరించింది. ప్రస్తుతం ఈ ప్రాంతంలో రైతులంతా నష్టపోయారు. ఇతర రాష్ట్రాలకు ఎగుమతి మాట పక్కన పెడితే స్థానికంగా ఉన్న నున్న మార్కెట్‌లోనూ రైతు ఆశించిన ధర లభించడం లేదు.

మొగల్తూరులోనూ అదే పరిస్థితి
గతంలో మంచి రంగు, మచ్చలేని మామిడి కాయలను టన్ను రూ.40 వేలకు విక్రయించే వారు. ప్రస్తుతం స్థానిక నున్న మార్కెట్‌లో మచ్చలున్నవి కనీసం రూ.10 వేలకు కూడా కొనడం లేదు. గతంలో 20 వేల టన్నుల దిగుబడి ఉన్న మామిడి ఈ ఏడాది 3 నుంచి 5 టన్నుల కూడా ఉత్పత్తి రాలేదు. వచ్చిన కాయ సైతం మంగు, మచ్చలతో ఉండటంతో కనీసం కొనే నాథుడే కరవువయ్యాడు. ఇదిలా ఉండగా, ఆలస్యంగా వచ్చే నరసాపురం, మొగల్తూరు మండలాల్లో 2 వేల హెక్టార్లలో విస్తరించి ఉన్న మామిడి కాపు ప్రస్తుతం ఆశాజనకంగా లేదని రైతులు చెబుతున్నారు. మామిడికి ప్రసిద్ధి చెందిన ఉమ్మడి జిల్లాలో రైతు ఢీలా పడ్డాడు. ఇప్పటికే మెట్ట ప్రాంతంలో పూర్తిగా రైతులు మామిడి పంటను తొలగించేశారు. గతంలో బుట్టాయగూడెం, జంగారెడ్డిగూడెం, లింగపాలెం మండలాల్లో మామిడి పంట ఉన్నప్పటికీ గత రెండు సంవత్సరాలుగా ఉన్న అరకొర చెట్లను సైతం పెకిలించేశారు. రానున్న రోజుల్లో ప్రస్తుత వాతావరణ పరిస్థితులే కొనసాగితే జిల్లాలో మామిడి పంట అంతరించిపోయే పరిస్థితి ఏర్పడనుంది.

కొనేందుకు ముందుకు రావడం లేదు

గతంలో ఎకరాకు రూ. 40 వేలు కౌలు వచ్చేది. అకాల వర్షాలతో వాతావరణ మార్పులతో ప్రస్తుతం పేనుబంక, మంగు మచ్చలు రావడంతో మామిడి కాయ పూర్తి నాణ్యత కోల్పోయింది. ఆశించిన ధర లేదు సరికదా, స్థానికంగా కూడా కొనుగోలు చేయడానికి ముందుకు రావడం లేదు.
– శీలపురెడ్డి నాగిరెడ్డి, మామిడి రైతు

Advertisement

తప్పక చదవండి

Advertisement