ఇంటింటా లబ్ధిని వివరిస్తూ.. | Sakshi
Sakshi News home page

ఇంటింటా లబ్ధిని వివరిస్తూ..

Published Sat, Nov 11 2023 12:54 AM

-

భీమవరం (ప్రకాశంచౌక్‌): ఓ వైపు సంక్షేమం.. మరోవైపు అభివృద్ధి.. ప్రజల జీవన ప్రమాణాల్లో వచ్చిన మార్పులు.. గ్రామ స్వరాజ్యమే లక్ష్యంగా పాలన.. అర్హతే ప్రామాణికంగా పారదర్శకంగా అందిస్తున్న పథకాలు.. వాగ్దానాలను నూరు శాతం అమలుచేయడంతో పాటు ఇవ్వని హామీలను కూడా అమలు చేసి దేశంలోనే ఆదర్శ ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఘనత సాధించారు. రాష్ట్రంలో వైఎస్సార్‌ సీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల వల్ల సామాన్యులు, పేదలు, మధ్యతరగతి వర్గాలకు ఎన్నో ప్రయోజనాలు కలుగుతున్నాయి. వీటిని లబ్ధిదారులకు, ప్రజలకు వివరించడం, అవగాహన కల్పించడం, చేసిన మేలు చెప్పడం, చేసే మంచి వివరించేందుకు ప్రభుత్వం ‘వై ఏపీ నీడ్స్‌ జగన్‌’ (ఆంధ్రప్రదేశ్‌కు జగనే ఎందుకు కావాలంటే..) కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. తొలిరోజు గురువారం జిల్లావ్యాప్తంగా 25 సచివాలయాల్లో, శుక్రవారం మరో 25 సచివాలయాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. 23వ తేదీ వరకు వై ఏపీ నీడ్స్‌ జగన్‌ కార్యక్రమాన్ని అన్ని సచివాలయాల్లో నిర్వహించేలా అధికారులు షెడ్యూల్‌ ఖరారు చేశారు. ఆయా సచివాలయాల వద్ద జరుగుతున్న సభల్లో ప్రజలకు జరిగిన మేలును పార్టీ నాయకులు తెలియజేస్తున్నారు. పార్టీ నాయకులు, సచివాలయ సిబ్బంది ఇంటింటికీ వెళ్లి లబ్ధిదారులను కలిసి సంక్షేమ పథకాలు అందుతున్న తీరును తెలుసుకుని ఆంధ్రప్రదేశ్‌కు జగన్‌ ఎందుకు కావాలనేది వివరిస్తున్నారు.

ఇంటింటా లబ్ధిని వివరిస్తూ..

కలెక్టర్‌ వై ఏపీ నీడ్స్‌ జగన్‌ కార్యక్రమం పర్యవేక్షణకు ప్రత్యేక నోడల్‌ అధికారులను నియమించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఈఓపీఆర్డీలు, పట్టణ ప్రాంతంలో అదనపు కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లు, గెజిటెడ్‌ అధికారులు నోడల్‌ ఆఫీసర్లుగా వ్యవహరిస్తారు. వీరి పర్యవేక్షణలో సచివాలయ ఉద్యోగులు, వలంటీర్లు ఇంటింటికీ వెళ్లి నాలుగున్నరేళ్లలో అందించిన లబ్ధిని వివరిస్తూ సచివాలయాల వద్ద జరిగే కార్యక్రమంలో పాల్గొనేలా చూస్తారు. సంక్షేమ పథకాలకు సంబంధించి సచివాలయాల వద్ద హోర్డింగ్‌లు, ఫ్లెక్సీలు ఏర్పాటుచేస్తారు.

యలమంచిలి సచివాలయం వద్ద పథకాల బోర్డును ఆవిష్కరిస్తున్న అధికారులు

Advertisement

తప్పక చదవండి

Advertisement