తేజ ఆత్మహత్య కేసులో భార్య, అత్తమామల అరెస్టు | Sakshi
Sakshi News home page

తేజ ఆత్మహత్య కేసులో భార్య, అత్తమామల అరెస్టు

Published Wed, Nov 22 2023 1:48 AM

-

దెందులూరు: దెందులూరుకు చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ తేజోమూర్తి ఆత్మహత్య కేసులో ఆయన భార్య నాగప్రియాంక, మామ సత్యనారాయణ, అత్త సూర్యకుమారిలను అరెస్టు చేసినట్టు డీఎస్పీ అశోక్‌కుమార్‌ గౌడ్‌ తెలిపారు. మంగళవారం ఆయన దెందులూరు పోలీస్‌స్టేషన్‌లో విలేకర్లతో మాట్లాడారు. చెక్కా తేజో మూర్తి, ఏలూరుకు చెందిన రవ్వా నాగప్రియాంక గతేడాది అక్టోబర్‌లో హైదరాబాద్‌లో ప్రేమ వివాహం చేసుకున్నారని చెప్పారు. దీంతో నాగప్రియాంక తండ్రి సత్యనారాయణ, అత్త సూర్యకుమారిలు తేజోమూర్తిని అల్లుడుగా అంగీకరించలేదన్నారు. ఈ ఏడాది ఆగస్టులో వరలక్ష్మి వ్రతం నాగప్రియాంక పుట్టింటి వద్ద చెద్దామని తేజోమూర్తికి చెప్పగా వద్దనడంతో వివాదం తలెత్తిందని చెప్పారు. దీనికితోడు తేజోమూర్తికి ఉద్యోగరీత్యా వేరే సీ్త్రలతో ఫోన్‌లో మాట్లాడటంతో భార్య అక్రమసంబంధం అంటగట్టడంతో మనస్పర్ధలు పెరిగాయన్నారు. ఈ నేపథ్యంలో నాగప్రియాంక ఏలూరు వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిందని చెప్పారు. దీంతో తేజోమూర్తి ఇష్టపడి పెళ్లి చేసుకుంటే ప్రియాంక తల్లిదండ్రులతో పాటు బంధువులు సౌజన్య, సురేష్‌కుమార్‌ల ప్రోత్సాహంతో తనపై అక్రమంగా కేసు పెట్టి వేధింపులకు గురిచేసిందని, తన చావుకు భార్య ప్రియాంక, మామ సత్యనారాయణ, అత్త సూర్యకుమారిలే కారణమని సూసైడ్‌ నోట్‌ రాసి సెప్టెంబర్‌ 4న రైలు కింద పడి మృతి చెందాడని వివరించారు. సమావేశంలో సీఐ శ్రీనివాస్‌, ఎస్సై కృష్ణ పాల్గొన్నారు.

Advertisement
Advertisement