గురుకుల విద్యార్థి ఆత్మహత్య | Sakshi
Sakshi News home page

గురుకుల విద్యార్థి ఆత్మహత్య

Published Wed, Nov 22 2023 1:48 AM

పెదవేగి గురుకుల విద్యాలయంలో
విద్యార్థులను విచారణ చేస్తున్న అధికారులు  - Sakshi

పెదవేగి : గురుకుల విద్యాలయం విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పెదవేగిలోని ఆంధ్రప్రదేశ్‌ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయంలో భీమడోలు మండల శివారు అజ్జావారిగూడెంకు చెందిన దోసె కమలేశ్‌ (15) పదో తరగతి చదువుతున్నాడు. అతని తల్లిదండ్రులు వెంకటేశ్వరరావు (తంబి), రూతు మనస్పర్థలతో ఏడేళ్ల కితం పెద్దల సమక్షంలో విడిపోయారు. తల్లి రూతు చిన్న కుమారుడిని తీసుకొని చింతలపూడిలో నివాసం ఉంటోంది. తండ్రి వద్ద ఉన్న పెద్ద కుమారుడు కమలేశ్‌ గురుకులు విద్యాలయంలో సోమవారం రాత్రి వసతి గృహం పక్కనే అవరణలో ఉన్న చెట్టుకు ఉరివేసుకున్నాడు. సిబ్బందికి సమాచారం అందించడంతో అర్థరాత్రి కమలేశ్‌ను ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అప్పటికే కమలేశ్‌ మృతిచెందినట్లు వైద్యులు నిర్థారించారు. పెదవేగి తహసీల్దార్‌ నాగరాజు సమక్షంలో ఎస్సై ఎం లక్ష్మణ్‌ శవపంచనామా నిర్వహించారు. అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ప్రభుత్వాసుపత్రిలో ఉన్న కమలేశ్‌ మృతదేహాన్ని దళిత సంఘాల నాయకులు సందర్శించారు. గురుకుల విద్యాలయంలో పరిస్థితులను పరిశీలించారు. కమలేశ్‌ మృతదేహాన్ని పరిశీలించిన ఆర్టీఓ ఎన్‌ఎస్కే ఖాజావలి, జిల్లా విద్యాశాఖాధికారి శ్యామ సుందర్‌, గురుకుల విద్యాలయాల కన్వీనర్‌ నోముల సంజీవరావు విద్యాలయంలో విద్యార్థులతో మాట్లాడారు. పరీక్షలు దగ్గర పడుతుండడంతో ఉత్తీర్ణత సాధించలేనని కమలేశ్‌ ఆందోళనకు గురైనట్టు తోటి విద్యార్థులు చెప్పారని ఆర్డీఓ తెలిపారు. కమలేశ్‌ మృతిపై అన్ని కోణాల్లోనూ విచారణ చేస్తున్నామని, కమలేశ్‌ కుటుంబాన్ని ఆదుకుంటామని చెప్పారు. ఇదిలా ఉండగా జూలై నెలలో సెలవులకు ఇంటికెళ్లిన కమలేశ్‌ తిరిగి వచ్చేటప్పుడు మద్యం సీసా తీసుకొచ్చాడని, అది తెలిసిన ప్రిన్సిపాల్‌ తండ్రిని పిలిపించి కమలేశ్‌ను మందలించడం, కమలేశ్‌ తల్లిప్రేమకు నోచుకోకపోవడం తదితర కారణాలతో ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని పలువురు పేర్కొంటున్నారు.

దోసె కమలేశ్‌ (ఫైల్‌)
1/1

దోసె కమలేశ్‌ (ఫైల్‌)

Advertisement
Advertisement