బాధితులకు సత్వర న్యాయం చేయాలి | Sakshi
Sakshi News home page

బాధితులకు సత్వర న్యాయం చేయాలి

Published Tue, Dec 12 2023 1:04 AM

స్పందనలో ఓ మహిళ సమస్య వింటున్న
ఎస్పీ మేరీ ప్రశాంతి - Sakshi

ఏలూరు టౌన్‌: ఏలూరు జిల్లాలో ఆయా సమస్యలపై స్పందనలో ఫిర్యాదులు, వినతులు సమర్పించిన బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చర్యలు చేపట్టాలని ఏలూరు ఎస్పీ డీ.మేరిప్రశాంతి ఆదేశించారు. ఏలూరు జిల్లా పోలీస్‌ ప్రధాన కార్యాలయంలో సోమవారం ఆమె స్పందనలో ప్రజల నుంచి వినతులను స్వీకరించి సంబంధిత పోలీస్‌ అధికారులకు సమస్యల పరిష్కారానికి ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల పలు ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ చేసిన నేపధ్యంలో ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పే మోసగాళ్ల మాటలు నమ్మవద్దని కోరారు. ప్రతిభ ప్రామాణికంగా ఉద్యోగాలు సాధించాలని, అడ్డదారుల్లో వెళితే ఇబ్బందులు తప్పవని సూచించారు. ప్రతిభ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధిస్తేనే ఉద్యోగావకాశాలు ఉంటాయని స్పష్టం చేశారు.

వినతుల్లో కొన్ని..

తన భర్త ముందే వేరొక మహిళతో వివాహం అయిందని, తనను మోసం చేసి పెళ్లి చేసుకున్నాడని, తనను తరచూ వేధింపులకు గురిచేస్తున్నాడని కలిదిండి నుంచి వచ్చిన ఓ మహిళ ఎస్పీకి మొరపెట్టుకుంది.

ఇళ్ళ స్ధలాలు ఇప్పిస్తానని చెప్పి గ్రామ సర్పంచ్‌ ఒక్కొక్కరు నుంచి రూ.20 వేలు తీసుకుని మోసం చేశారని, అతనిపై చర్యలు తీసుకోవాలని పెదనిండ్రకొలను మహిళలు ఎస్పీని కోరారు. కళాశాలకు వెళ్లి చదువుకుంటున్న తన కుమార్తెకు ఓ వ్యక్తి మత్తు పదార్థాలు, మద్యం అలవాటు చేసి సన్నిహితంగా ఉన్న సమయంలో ఫొటోలు తీసి సోషల్‌ మీడియా ప్రచారం చేస్తూ వేధిస్తున్నాడని, అతనిపై చర్యలు తీసుకోవాలని ఉంగుటూరు మండలానికి చెందిన ఓ తల్లి అర్జీ అందించింది. తనకుమారుడు మరణించడంతో తన కోడలు ఇంటిని ఆక్రమించుకోవాలనే ఉద్దేశంతో తనను ఇబ్బందులకు గురిచేస్తోందని, విచారణ చేసి న్యాయం చేయాలని జీలుగుమిల్లి మండలం ములగలంపల్లికి చెందిన ఓ వృద్ధుడు అర్జీ అందించారు.

ముగిసిన వాలీబాల్‌ ఇన్విటేషన్‌ టోర్నీ

విజయవాడ స్పోర్ట్స్‌: సూరెడ్డి సత్యనారాయణ (నల్లబాబు) మెమోరియల్‌ వాలీబాల్‌ ఇన్విటేషన్‌ టోర్నమెంట్‌ సోమవారం ముగిసింది. టోర్నమెంట్‌ విజేతగా విశాఖపట్నం జట్టు నిలిచింది. మహాత్మ కల్చరల్‌ ఫ్రెండ్స్‌ (ఎంసీఎఫ్‌) అసోసియేషన్‌ ఆధ్వర్యాన విజయవాడ పటమటలోని చెన్నుపాటి రామకోటయ్య ఇండోర్‌ స్టేడియంలో ఈ నెల 8వ తేదీన ప్రారంభమైన ఈ పోటీలకు విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా (ఎంసీఎఫ్‌), ప్రకాశం జిల్లాల జట్లు ప్రాతినిధ్యం వహించాయి. విజేత జట్టు విశాఖపట్నం టోర్నీ ఆరంభం నుంచే ఆధిపత్యం ప్రదర్శించింది. ఆదివారం రాత్రి హోరాహోరీగా జరిగిన ఫైనల్స్‌లో కృష్ణా (ఎంసీఎఫ్‌) జట్టును ఓడించి ట్రోఫీని కై వసం చేసుకుంది. ద్వితీయ స్థానంలో కృష్ణా జట్టు నిలిచింది. ప్రకాశం జట్టు మూడో స్థానాన్ని, తూర్పు గోదావరి జట్టు నాలుగో స్థానాన్ని దక్కించుకున్నాయి. అర్జున, ద్రోణాచార్య అవార్డుల గ్రహీత ఎ.రమణరావు, ఉయ్యూరు మునిసిపల్‌ చైర్మన్‌ వల్లభనేని సత్యనారాయణ (నాని), సిద్ధార్థ అకాడమి కోశాధికారి సూరెడ్డి సత్యనారాయణ విజేతలకు ట్రోఫీలు అందజేశారు. వాలీబాల్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు ఎన్‌.బ్రహ్మాజి, దయాకరరావు టోర్నీని పర్యవేక్షించారు.

స్పందనలో ఎస్పీ మేరీ ప్రశాంతి

Advertisement

తప్పక చదవండి

Advertisement