పంచారామం.. భక్తి పరవశం | Sakshi
Sakshi News home page

పంచారామం.. భక్తి పరవశం

Published Tue, Dec 12 2023 1:04 AM

పట్టిసంలో ఇసుకతిన్నెలపై క్యూ కట్టిన భక్తులు    - Sakshi

పాలకొల్లు సెంట్రల్‌/భీమవరం(ప్రకాశం చౌక్‌): జిల్లాలోని పంచారామక్షేత్రాలు శివనామస్మరణలతో మార్మోగాయి. కార్తీకమాసం ఆఖరి సోమవారం కావడంతో పాలకొల్లులోని క్షీరారామలింగేశ్వరస్వామి ఆలయం (క్షీరారామం), భీమవరం గునుపూడిలోని ఉమాసోమేశ్వర జనార్దన స్వామి ఆలయం (సోమారామం)కు భక్తులు పోటెత్తారు. పాలకొల్లులో మహన్యాస పూర్వక అభిషేకాలు చేయించుకునే భక్తులతో ఆలయ వెనుక భాగం, అభిషేకాల మండపం నిండిపోయాయి. గోశాల వద్ద భక్తులు కార్తీక దీపాలు వెలిగించారు. మధ్యా హ్నం 11 గంటల నుంచి పంచారామ యాత్రికులతో ఆలయం మరింత కిటకిటలాడింది. సుమారు 40 వేల మంది భక్తులు స్వామిని దర్శించినట్టు అంచనా. స్థానిక రేపాక వారి సత్రంలో దేవస్థానం ఆధ్వర్యంలో దాతల సహకారంతో అన్నదానం ఏర్పాటుచేశారు. క్షీరారామలింగేశ్వస్వామి సేవా సమితి సభ్యులు ఉచిత పాలు, ప్రసాదం పంపిణీ చేశారు. ట్రస్ట్‌బోర్డు చైర్మన్‌ కోరాడ శ్రీనివాసరావు, ఈఓ యాళ్ల సూర్యనారాయణ, పట్టణ సీఐ డి.రాంబాబు, ఎస్సైలు ఎస్‌.ముత్యాలరావు, బి.శ్రీనివాసరావు ఏర్పాట్లను పర్యవేక్షించారు.

సోమారామంలో ప్రత్యేక అభిషేకాలు

భీమవరం గునుపూడిలోని ఉమాసోమేశ్వర జనార్దన స్వామి దేవస్థానానికి వేకువజాము నుంచి భక్తుల రాక మొదలైంది. స్వామివారికి నిర్విరామంగా ప్రత్యేక అభిషేకాలు చేశారు. ప్రధాన అర్చకులు కందుకూరి సొంబాబు, చేకూరి రామకృష్ణ, అర్చకుల బృందం ఆధ్వర్యంలో మహన్యాసపూర్వక రుద్రాభిషేకాలు, పంచమృతాభిషేకాలు జరిగాయి. అనంతరం స్వామిని ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజలు చేశారు. ఆలయ ప్రాంగణంలో మహిళలు కార్తీక నోములు నోచుకున్నారు. అన్నదాన కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం చేశారు. దేవస్థానం ఈఓ డి.రామకృష్ణరాజు, ధర్మకర్తలు, ఆల య సిబ్బంది ఏర్పాట్లను పర్యవేక్షించారు.

పట్టిసం.. భక్తజన సంద్రం

పోలవరం రూరల్‌: పట్టిసం శివక్షేత్రంలో భద్రకాళీ సమేత వీరేశ్వరస్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు. వేకువజాము నుంచి భక్తుల రద్దీ కనిపించింది. ఆలయంలో విశేష పూజలు, అభిషేకాలు జరిగాయి. శివకేశవులకు నిలయమైన ఈ క్షేత్రంలోని భావన నారాయణస్వామిని దర్శించుకుని పూజలు చేశారు. క్షేత్రానికి వచ్చిన భక్తులు గోదావరి దాటేందుకు లాంచీలు ఎక్కి, దిగేందుకు వీలుగా క్యూలైన్ల వద్ద పోలవరం ఎస్సై పవన్‌కుమార్‌ ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు ఏర్పాటుచేశారు. మాసశివరాత్రి సందర్భంగా హుకుంపేట జమీందారు హోతా కుటుంబీకుల ఆధ్వర్యంలో లక్షపత్రి పూజ చేశారు. ఆలయ ఈఓ ఎస్‌.సంగమేశ్వరశర్మ భక్తులకు అన్నప్రసాదం అందజేశారు. శివక్షేత్రం రేవులో భక్తులకు సొసైటీ అధ్యక్షుడు పాదం రాజబాబు, వైఎస్సాసీపీ నాయకుడు తెలగంశెట్టి సూర్యచంద్రం మజ్జిగ పంపిణీ చేశారు.

పాలకొల్లు క్షీరారామంలో క్యూలైన్లలో భక్తులు
1/4

పాలకొల్లు క్షీరారామంలో క్యూలైన్లలో భక్తులు

భీమవరంలో ఉమాసోమేశ్వరస్వామికి అభిషేకాలు
2/4

భీమవరంలో ఉమాసోమేశ్వరస్వామికి అభిషేకాలు

పాలకొల్లులో క్షీరారామలింగేశ్వరునికి అభిషేకాలు
3/4

పాలకొల్లులో క్షీరారామలింగేశ్వరునికి అభిషేకాలు

పట్టిసం వీరేశ్వరస్వామికి పూజలు
4/4

పట్టిసం వీరేశ్వరస్వామికి పూజలు

Advertisement

తప్పక చదవండి

Advertisement