‘జగనన్నకు చెబుదాం’తో సంతృప్తికర పరిష్కారం | Sakshi
Sakshi News home page

‘జగనన్నకు చెబుదాం’తో సంతృప్తికర పరిష్కారం

Published Tue, Dec 12 2023 1:04 AM

నూజివీడులో అర్జీలు స్వీకరిస్తున్న జేసీ లావణ్యవేణి, అధికారులు   - Sakshi

జేసీ లావణ్యవేణి

నూజివీడు: జగనన్నకు చెబుదాం (స్పందన) కార్యక్రమంలో అందిన అర్జీలకు సంతృప్తికర పరిష్కారం చూపాలని జాయింట్‌ కలెక్టర్‌ బి.లావణ్యవేణి అన్నారు. సబ్‌కలెక్టర్‌ కార్యాలయంలో సోమవారం జిల్లాస్థాయి జగనన్నకు చెబుదాం కార్యక్రమం నిర్వహించారు. డీఆర్వో ఎం.వెంకటేశ్వర్లు, సబ్‌ కలెక్టర్‌ ఆదర్శ్‌ రాజీంద్రన్‌, అసిస్టెంట్‌ కలెక్టర్‌ శ్రీపూజ, డీపీఓ తూతిక శ్రీనివాస్‌ విశ్వనాథ్‌తో కలిసి ఆమె ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి వాటి పరిష్కారానికి ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అర్జీలు రీఓపెన్‌ కానీ రీతిలో పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్ప వని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో 248 దర ఖాస్తులు అందాయన్నారు. దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ జనసేన నాయకులతో కలిసి వరి కంకులు తీసుకువచ్చి ధాన్యాన్ని కొ నుగోలు చేయాలని కోరగా, ప్రతి గింజనూ కొనుగోలు చేస్తామని రైతులు ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని జేసీ స్పష్టం చేశారు.

అర్జీల్లో కొన్ని..

● తమ గ్రామంలో పేదలకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని, డొంక పోరంబోకు స్థలం ఆక్రమణలు తొలగించాలని, శ్మశానానికి దారి కల్పించాలని నూజివీడు మండలం మొర్సపూడి సర్పంచ్‌ శెట్టిపల్లి హరిరామకృష్ణప్రసాద్‌ దరఖాస్తు అందజేశారు.

● నూజివీడు మండలం మిట్టగూడెంను రెవెన్యూ గ్రామంగా గుర్తించి సచివాలయం ఏర్పాటుచేయాలని కోరుతూ గ్రామస్తులు అర్జీ అందజేశారు.

● తన అసైన్డ్‌ భూమికి బీ ఫారం పట్టా మంజూరు చేయాలని ఆగిరిపల్లి మండలం నరసింగపాలెంకు చెందిన మందపాటి లక్ష్మి కోరారు.

● తనకు రైతుభరోసా–పీఎం కిసాన్‌ లబ్ధి మంజూరు కావడం లేదని–చింతలపూడి మండలం మల్లేశ్వరానికి చెందిన కొక్కుల సరస్వతి ఫిర్యాదు చేశారు.

● తన భూమి ఆక్రమణలకు గురైందని, న్యాయం చేయాలని ఆగిరిపల్లి మండలం నరసింగపాలెం చెందిన కోలాంటి ఏసేబు అభ్యర్థించారు.

● నూజివీడు నుంచి రాత్రి 7 గంటల తర్వాత విజయవాడకు నాన్‌స్టాప్‌ బస్సు సర్వీసులు ఏర్పాటుచేయాలని నూజివీడులోని ఎమ్మార్‌ అప్పారావు కాలనీకి చెందిన దాకా సోమేశ్వరరావు కోరారు.

హౌసింగ్‌ పీడీ కె.రవికుమార్‌, ఇరిగేషన్‌, ట్రాన్స్‌కో ఎస్‌ఈలు శ్రీనివాసరావు, సాల్మన్‌రాజు, జిల్లా వ్యవసాయ శాఖాధికారి వై.రామకృష్ణ, డ్వామా పీడీ రాము, డీఈఓ శ్యాంసుందర్‌, పశుసంవర్ధక శాఖ జేడీ నెహ్రూబాబు, డీఎంహెచ్‌ఓ శర్మిష్ట, తహసీల్దార్‌ యల్లారావు పాల్గొన్నారు.

Advertisement
Advertisement