ఓటరుగా నమోదు చేసుకోవాలి | Sakshi
Sakshi News home page

ఓటరుగా నమోదు చేసుకోవాలి

Published Wed, Dec 13 2023 5:00 AM

ఆచంట పెదపేటలో నష్టపరిహారం చెక్కును అందిస్తున్న మాజీ మంత్రి శ్రీరంగనాథరాజు 
 - Sakshi

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): పటిష్ట ప్రజాస్వామ్య నిర్మాణానికి ఓటరుగా నమోదు కావడంతో పాటు ఓటు హక్కు తప్పనిసరిగా వినియోగించుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ వె.ప్రసన్న వెంకటేష్‌ పిలుపు నిచ్చారు. మంగళవారం స్వీప్‌ కార్యక్రమంలో భాగంగా స్థానిక కోటదిబ్బలోని ప్రభుత్వ జూనియర్‌, డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన ఓటరు చైతన్య కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు ఎంతో విలువైందని, ఓటు హక్కును ప్రతి ఒక్కరూ వినియోగించుకుని దేశ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలన్నారు. 18 ఏళ్ళు నిండిన వారితో పాటు 17 ఏళ్ల వయస్సు కలిగిన వారు కూడా ప్రోగ్రెసివ్‌ ఓటర్లుగా నమోదు కావచ్చన్నారు. ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మెషీన్‌ ద్వారా ఓటు హక్కు వినియోగించుకోవడంపై కోటదిబ్బ జూనియర్‌ కాలేజి అవరణలో ఏర్పాటు చేసిన ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్ర ప్రదర్శనను ప్రారంభించారు. ఈ సందర్భంగా పోలింగ్‌ కేంద్రంలో ఓటు వేసే విధానాన్ని స్వయంగా డెమో ద్వారా విద్యార్థులకు వివరించారు. తొలుత ఓటరు ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం మానవహారం చేపట్టారు. ఈ సందర్భంగా కోటదిబ్బ నుంచి పేరయ్య కోనేరు వరకు ఓటరు అవగాహన ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈవో కేఎస్‌ఎస్‌ సుబ్బారావు, నగరపాలక సంస్థ కమిషనర్‌ ఎస్‌.వెంకట కృష్ణ, తహసీల్దార్‌ బీ సోమశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

సత్వర నష్ట పరిహారం

పెనుగొండ: తుపాన్‌తో ఇళ్లు దెబ్బతిన్న వారికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సత్వర నష్టపరిహారం అందిస్తున్నారని మాజీ మంత్రి, వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు చెరుకువాడ శ్రీరంగనాథరాజు అన్నారు. తుపానుతో తాటాకిల్లు పూర్తిగా ధ్వంసమైన ఆచంట పెదపేటకు చెందిన మట్టా శాస్త్రికి రూ.10వేలు చెక్కును మంగళవారం తూర్పుపాలెంలో అందజేశారు. వీటితో పాటు నిత్యావసరాలు అందించారు. గతంలో నష్టపరిహారం రావడానికి రోజులు తరబడి వేచి ఉండాల్సి వచ్చేదన్నారు. నేడు ఆ పరిస్థితి లేదన్నారు. సీఎం జగన్‌ పాలనలో సత్వరం పరిహారం అందిస్తున్నారన్నారు. రైతులకు త్వరలోనే నష్ట పరిహారం అందించడానికి ఇప్పటికే అంచనాలు ప్రారంభించారన్నారు.

వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కమిటీల్లో చోటు

ఏలూరు టౌన్‌: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర మహిళా విభాగం నూతన కమిటీని నియమించారు. రాష్ట్ర మహిళా విభాగంలో ఏలూరు జిల్లాకు చెందిన కూసంపూడి కనక దుర్గారాణి సెక్రటరీగా, ఉన్నమట్ల ఝాన్సీని జాయింట్‌ సెక్రటరీగా నియమించారు. రాష్ట్ర యువజన విభాగం నూతన కమిటీలో ఏలూరు జిల్లాకు చెందిన కందుల దినేష్‌ రెడ్డిని జనరల్‌ సెక్రటరీగా, కోటగిరి సందీప్‌ను సెక్రటరీగా, సంకా నాగశేషును జాయింట్‌ సెక్రటరీగా నియమించారు. మహిళా విభాగంలో పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన దాసరి వరలక్ష్మి, మద్దా చంద్రకళను సెక్రటరీలుగా, సోమరాజు దుర్గాభవాని, కర్రా జయ సరితను జాయింట్‌ సెక్రటరీలుగా నియమించారు. యువజన విభాగం కమిటీలో పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన కొవ్వూరు వేణుమాధవ్‌రెడ్డిని సెక్రటరీగా, నామన మహేష్‌ను జాయింట్‌ సెక్రటరీగా నియమిస్తూ కేంద్ర పార్టీ కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ–క్రాప్‌లోనే బీమా చెల్లింపు

ఆకివీడు: ఈ–క్రాప్‌ నమోదు ప్రక్రియతోనే పంటల బీమాకు ప్రీమియం చెల్లింపు జరుగుతుందని వ్యవసాయ శాఖ జేడీ జెడ్‌.వెంకటేశ్వర్లు చెప్పారు. మండలంలోని చెరుకుమిల్లి, చినకాపవరం, ఆకివీడు తదితర ప్రాంతాల్లో నీట మునిగిన వరి చేలను మంగళవారం ఆయన పరిశీలించారు. తుపాను ప్రభావానికి నష్టపోయిన ప్రాంతాల్లో ఎన్యూమరేషన్‌ ప్రారంభిస్తున్నామని చెప్పారు. బీమా కోసం ప్రభుత్వం ప్రీమియం చెల్లిస్తుందని జేడీ చెప్పారు. గ్రామ, మండల టీంలు ఆయా ప్రాంతాల్లో పర్యటించి నష్టం అంచనా వేస్తాయన్నారు. గ్రామం యూనిట్‌గా బీమా ఉంటుందన్నారు.

Advertisement
Advertisement