ఉపాధ్యాయ ఉద్యమంలో చెరగని ముద్ర | Sakshi
Sakshi News home page

ఉపాధ్యాయ ఉద్యమంలో చెరగని ముద్ర

Published Sat, Dec 16 2023 1:20 AM

- - Sakshi

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట)/భీమవరం (ప్రకాశంచౌక్‌)/ ఉండి: ఉండి మండలం చెరుకువాడ వద్ద శుక్రవా రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఉభయగోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ షేక్‌ సాబ్జీ (60) అక్కడికక్కడే మృతిచెందారు. భీమవరం ప్రభుత్వాస్పత్రిలో ఆయన భౌతికకాయానికి పోస్టుమార్టం అనంతరం కుటుంబసభ్యులకు అప్పగించారు. భీమవరం ప్రభుత్వాస్పత్రి వద్ద సాబ్జీ పార్ధీవదేహానికి శాసనమండలి చైర్మన్‌ కొయ్యే మోషేన్‌ రాజు, పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్‌ పి.ప్రశాంతి, జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌.రామసుందర్‌రెడ్డి, భీమవరం ఆర్డీఓ శ్రీనివాసులరాజు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు, ఉపాధ్యాయులు నివాళులర్పించారు. ఆయనకు భార్య సుభానీ, కుమారుడు, కుమార్తె ఉన్నారు. దేవరపల్లి మండలం ధుమంతునిగూడెంలో షేక్‌ కబీర్‌, సైదా బీబీ దంపతులకు మూడో సంతానంగా 1966 జనవరి 5న ఆయన జన్మించారు. 1989లో స్పెషల్‌ టీచర్‌గా ఉపాధ్యాయ వృత్తిలోకి ప్రవేశించిన ఆయన జిల్లాలోని పలు ప్రాంతాల్లో పనిచేశారు. మూడు దశాబ్దాలుగా ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతూ ఉత్తమ బోధన, పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు కృషిచేశారు.

యూటీఎఫ్‌ ద్వారా ఉద్యమ పథంలోకి..
ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్‌ (యూటీఎఫ్‌)లో జిల్లా కార్యదర్శి, జిల్లా అధ్యక్షుడు, జిల్లా ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర కార్యదర్శి, రాష్ట్ర గౌరవాధ్యక్షుడు, రాష్ట్ర అధ్యక్షుడిగా ఆయన వ్యవహరించారు. 2021లో ఉభయగోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా గెలుపొంది శాసనమండలిలో అడుగుపెట్టారు. 1990 నుంచి ఉపాధ్యాయ సమస్యలపై ఆయన పలు పోరాటాలు చేశారు. 2008లో 13 రోజుల సమ్మెకు జిల్లాలో నాయకత్వం వహించారు. 30 గంటల నిరవధిక నిరాహార దీక్షలో పాల్గొన్నారు.

డిప్యూటీ సీఎం కొట్టు సంతాపం

తాడేపల్లిగూడెం (టీఓసీ): ఎమ్మెల్సీ సాబ్జీ ఉపాధ్యాయ ఉద్యమ నిర్మాణంలో అత్యంత క్రియాశీలక పాత్ర పోషించారని డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ అన్నారు. ఉపాధ్యాయ ఉద్యమంలో చెర గని ముద్రవేశారని, టీచర్ల సమస్యలు పరిష్కారానికి కృషి చేశారని కొనియాడారు. సాబ్జీ మరణం ఉపాధ్యాయ లోకానికి తీరనిలోటన్నారు.

సమస్యలపై పోరాడే వ్యక్తి
ఏలూరు(మెట్రో):
ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా నిరంతరం సమస్యలపై పోరాడే వ్యక్తి షేక్‌ సాబ్జ్జీ అని, ఆయన మృతి తీరని లోటని ఏలూరు జిల్లా కలెక్టర్‌ వె.ప్రసన్న వెంకటేష్‌ అన్నారు. ఢిల్లీలో ఉన్న ఆయన సాబ్జీ మృతి విషయం తెలిసి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. సాబ్జీ మృతికి ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా జేఏసీ చైర్మన్‌ చోడగిరి శ్రీనివాస్‌, కన్వీనర్‌ నెరుసు వెంకట రామారావు, రాష్ట్ర గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం, రాష్ట్ర అధ్యక్షుడు భూ పతిరాజు రవీంద్రరాజు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.అప్పలనాయుడు, ఉపాధ్యాయ సంఘాల నేతలు సంతాపం తెలిపారు.

ఇద్దరిపై కేసు నమోదు
ఉండి:
ఎమ్మెల్సీ సాబ్జీ మృతికి కారకులైన వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆకివీడు మండలం సిద్దాపురం గ్రామానికి చెందిన డ్రైవర్‌ బోణం స్వామిదినేష్‌ అనే యువకుడు అతి వేగంగా, నిర్లక్ష్యంగా కారు నడిపి ప్రమాదానికి కారకుడయ్యాడని గుర్తించారు. అలాగే కారు యజమాని దుంపగడపకి చెందిన డోకుబత్తి రమేష్‌పైనా కేసు నమోదు చేశారు. మైనర్‌కు వాహనాన్ని ఇచ్చి వ్యక్తి మృతికి కారకుడైన కారు యజమాని రమేష్‌, యువకుడు స్వామిదినేష్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఏఎస్సై ఎ.సూర్యనారాయణ చెప్పారు.

1/1

Advertisement
Advertisement