పీడీ యాక్ట్‌ కింద నలుగురి అరెస్టు | Sakshi
Sakshi News home page

పీడీ యాక్ట్‌ కింద నలుగురి అరెస్టు

Published Thu, Apr 18 2024 10:35 AM

- - Sakshi

జంగారెడ్డిగూడెం: పదే పదే నేరాలకు పాల్పడుతున్న పట్టణానికి చెందిన నలుగురు నిందితులపై పోలీసులు పీడీ యాక్ట్‌ అమలు చేశారు. వీరిపై కేసు నమోదు చేసి అరెస్టు చేసి రాజమండ్రి సెంట్రల్‌ జైలుకు తరలించారు. డీఎస్పీ యు.రవిచంద్ర బుధవారం పట్టణంలోని సర్కిల్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. జంగారెడ్డిగూడెం పట్టణం, పరిసర గ్రామాల్లో చట్టంపై గౌరవం లేకుండా పదే పదే నేరాలకు పాల్పడుతూ నేరప్రవృత్తిని కలిగి, తీరు మార్చుకోకుండా మళ్లీ నేరాలకు పాల్పడుతున్న నలుగురు వ్యక్తులను గుర్తించామన్నారు. కలెక్టర్‌, ఎస్పీ ఆదేశాల మేరకు వీరిని ఆంధ్రప్రదేశ్‌ అక్రమ సారాదారులు, బందిపోట్లు, మాదకద్రవ్యాల నేరస్తులు, గూండాలు, భూఆక్రమణదారులు, డబ్లింగ్‌ కరెన్సీ తదితర అపాయకర కార్యకలాపాల నిరోధక చట్టం (పీడీ యాక్ట్‌) కింద వీరిని అరెస్టు చేసినట్లు చెప్పారు. అరైస్టెన వారిలో పట్టణానికి చెందిన కోడూరి రవితేజ (ద్వారకాతిరుమల మండలం లక్ష్మీపురం), కోన శ్రీనివాస్‌ అలియాస్‌ పెప్పీ నాని, మద్దిపాటి కల్యాణ్‌, షేక్‌ నాగూర్‌ మీరావల్లీ అలియాస్‌ బబ్లూ ఉన్నారు. కోడూరి రవితేజపై ఏలూరు, తడికలపూడి, నల్లజర్ల, కొయ్యలగూడెం పోలీస్‌స్టేషన్‌లలో మొత్తం 13 కేసులు, కోన శ్రీనివాస్‌పై జంగారెడ్డిగూడెం, ద్వారకాతిరుమల, ఏలూరు, తడికలపూడి, నల్లజర్ల, కొయ్యలగూడెం పోలీస్‌స్టేషన్‌లలో మొత్తం 9 కేసులు, మద్దిపాటి కల్యాణ్‌పై జంగారెడ్డిగూడెం, తడికలపూడి, నల్లజర్ల, కొయ్యలగూడెం పోలీస్‌స్టేషన్‌లలో మొత్తం 10 కేసులు, షేక్‌ నాగూర్‌ మీరావల్లీపై జంగారెడ్డిగూడెం, లక్కవరం, నల్లజర్ల పోలీస్‌స్టేషన్‌లలో మొత్తం 4 కేసులు ఉన్నట్లు డీఎస్పీ తెలిపారు. ఈ నలుగురితో పాటు మరికొంతమంది కలిసి ఈ ఏడాది ఫిబ్రవరి 21న నల్లజర్ల పోలీస్‌స్టేషన్‌ పరిధిలో 3.5 కేజీల బంగారు ఆభరణాలు, కొంత నగదును ఒక బంగారు వ్యాపారిని అడ్డగించి దోచుకున్నారని డీఎస్పీ వివరించారు. ఈ కేసులో ప్రస్తుతం వీరు ఏలూరు జైలులో రిమాండ్‌లో ఉన్నట్లు తెలిపారు. అయితే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వీరిపై పీడీ యాక్ట్‌ కింద కేసు నమోదు చేసి అరెస్టు చేసి రాజమండ్రి సెంట్రల్‌ జైలుకు తరలించినట్లు చెప్పారు. సమావేశంలో సీఐ పి.రాజేష్‌, ఎస్సై పి.జ్యోతిబాస్‌ పాల్గొన్నారు.

రాజమండ్రి సెంట్రల్‌ జైలుకు తరలింపు

డీఎస్పీ యు.రవిచంద్ర వెల్లడి

Advertisement
Advertisement