అత్యాచారయత్నం కేసులో నిందితుడికి ఐదేళ్ల జైలు | Sakshi
Sakshi News home page

అత్యాచారయత్నం కేసులో నిందితుడికి ఐదేళ్ల జైలు

Published Tue, Apr 23 2024 8:25 AM

-

ఏలూరు (టూటౌన్‌)/కామవరపుకోట: అత్యాచారయత్నం కేసులో నేరం రుజువు కావడంతో నిందితుడికి ఐదేళ్ల జైలు శిక్ష, రూ.వెయ్యి జరిమానా విధిస్తూ ఏలూరు ఐదో అదనపు జిల్లా జడ్జి, మహిళా కోర్టు న్యాయమూర్తి జి.రాజేశ్వరి సోమవారం తీర్పు వెలువరించారు. ఈ కేసుకు సంబంధించి ఏపీపీ డీవీ రామాంజనేయులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కామవరపుకోట మండలం వీరిశెట్టిగూడెం గ్రామానికి చెందిన నిందితుడు నిజవరపు సత్యనారాయణ అలియాస్‌ సత్తియ్య 2015 డిసెంబర్‌ 17న సాయంత్రం 4 గంటల సమయంలో ఆ గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో మేకలు మేపుకోవటానికి వెళ్ళిన ఓ మహిళపై వెనుక వైపు దాడి చేసి, పట్టుకుని అత్యాచారం చేసేందుకు ప్రయత్నించాడు. ఆ సమయంలో బాధితురాలు కేకలు వేయడంతో సమీపంలో ఉన్న బాధితురాలి తండ్రి, మరికొందరు స్థానికులు రావడంతో నిందితుడు ఆమెను వదిలేసి పరారయ్యాడు. దీనిపై బాధితులు గ్రామంలోని పెద్దలకు మొరపెట్టుకున్నారు. నిందితుడు పెద్దల వద్దకు రాకపోవడంతో బాధితురాలు తడికలపూడి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీనిపై అప్పటి ఎస్సై జీజే విష్ణువర్దన్‌ కేసు నమోదు చేశారు. ఈ కేసు విచారణ చేసి నిందితుడు నిజవరపు సత్యనారాయణను అరెస్టు చేశారు. దర్యాప్తు అనంతరం కోర్టులో చార్జీషీట్‌ ఫైల్‌ చేశారు. కేసు విచారణలో ఏపీపీ డీవీ రామాంజనేయులు వాదనలు వినిపించారు. ఈ కేసులో నేరం రుజువు కావడంతో జడ్జి జి.రాజేశ్వరి నిందితుడికి ఐదేళ్ల జైలు శిక్షను విధిస్తూ తీర్పును వెలువరించారు. తడికలపూడి ఎస్సై ఎం.జైబాబు, కోర్టు కానిస్టేబుల్‌ కొండలరావు ప్రాసిక్యూషన్‌కు సహకరించారు.

‘పది’లో ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తమ ఫలితాలు

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట) : పదో తరగతి పరీక్షల ఫలితాల్లో ఏలూరు జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు ఉత్తమ ఫలితాలు నమోదు చేయడం అభినందనీయమని పీఆర్‌టీయూ జిల్లా అధ్యక్షుడు పువ్వుల ఆంజనేయులు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో సైతం 100 శాతం ఉత్తీర్ణత సాధించడం, అత్యధిక మంది విద్యార్థులు అధిక శాతం మార్కులతో ఉత్తీర్ణులు కావడం వంటి ఫలితాలు విద్యాశాఖ పనితీరును సూచిస్తోందన్నారు. ఉత్తమ ఫలితాలు సాధించిన ప్రభుత్వ, జిల్లా పరిషత్‌, మున్సిపల్‌, కేజీబీవీ, ట్రైబల్‌ వెల్ఫేర్‌, మోడల్‌ స్కూల్స్‌ ప్రధానోపాధ్యాయులకు, ఉపాధ్యాయులకు వీరందరికీ దిశానిర్దేశనం చేసిన జిల్లా విద్యాశాఖాధికారి ఎస్‌.అబ్రహం, ప్రభుత్వ పరీక్షల అసిస్టెంట్‌ కమిషనర్‌ ఎల్‌.శ్రీకాంత్‌, 10వ తరగతి విద్యార్థులకు ఉచితంగా విజయ కేతనం పుస్తకాలు అందించిన జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ ఘంటా పద్మశ్రీ, ఆ పుస్తకాన్ని రూపొందించిన జిల్లా ఉమ్మడి పరీక్షల బోర్డు కార్యదర్శి అంగుటూరి సర్వేశ్వర రావులకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు.

ఉద్యోగులకు ఓటు వేసే అవకాశం కల్పించాలని వినతి

ఏలూరు (మెట్రో): ఎన్నికల్లో ప్రభుత్వ ఉద్యోగులు ఓటు హక్కు వినియోగించుకునేలా అవకాశం కల్పించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌ కుమార్‌ మీనాను రాష్ట్ర వీఆర్వోల సంఘం రాష్ట్ర అధ్యక్షులు భూపతిరాజు రవీంద్రరాజు కోరారు. సోమవారం ఈ మేరకు ఈ–మెయిల్‌ ద్వారా ఎన్నికల అధికారికి వినతిపత్రం అందజేశారు. రాష్ట్రంలోని ఉద్యోగులందరికీ మే 1వ తేదీ నుండి 5వ తేదీ వరకు నియోజకవర్గస్థాయిలో పోస్టల్‌ బ్యాలెట్‌తో సంబంధం లేకుండా ఓటు హక్కు వినియోగించుటకు అవకాశం కల్పించాలని కోరారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement