Rennie Joyy: జీవితాన్ని దిద్దుకుంది... పేదల పక్షాన నిలిచింది | Sakshi
Sakshi News home page

Rennie Joyy: జీవితాన్ని దిద్దుకుంది... పేదల పక్షాన నిలిచింది

Published Thu, Jan 25 2024 12:21 AM

Aalekh Foundation: Inspiring Story Of Rennie Joyy - Sakshi

రెనీ జాయ్‌ ఢిల్లోలో కార్పోరేట్‌ అడ్వకేట్‌. రాయల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ స్కాట్‌లాండ్‌కు వైస్‌ప్రెసిడెంట్‌. జీవితం నేర్పిన పాఠాలతో అలేఖ్‌ ఫౌండేషన్‌ పేరుతో  పేద మహిళలు, పిల్లలకు ఉచితంగా వృత్తి విద్యాకోర్సులు నేర్పించి, వారి కాళ్లపై వారు నిలబడేలా సహాయం చేస్తోంది. అవసరమైనప్పుడు వారి కోసం న్యాయపోరాటాలు చేస్తుంది. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రచారం చేస్తోంది. ఈ ప్రయాణంలో ఏదీ సవ్యంగా లేదని, ఒడిదొడుకులతో నడిచిన తన జీవితాన్ని, తిరిగి దిద్దుకున్న విధానాన్ని పరిచయం చేస్తోంది.

‘‘మా తాతగారు ఆర్మీ ఉద్యోగి. దేశంలో వివిధ ప్రాంతాల్లో ఉద్యోగాలు చేసి, చివరకు ఢిల్లీలో స్థిరపడ్డారు. మా అమ్మనాన్నలకు నేను ఒక్కదాన్నే సంతానం. నా చిన్నతనంలో మా అమ్మనాన్నలు విడివిడిగా ఉండేవారు. దీంతో నాన్న నుంచి ఎలాంటి సపోర్ట్, సాయం లభించలేదు. మా అమ్మనాన్నలు అంటే అమ్మమ్మ తాతయ్యలే. దీంతో కుటుంబం అసంపూర్తిగా ఉందని ఎప్పుడూ భావించలేదు. మా అమ్మనాన్నలు విడి  విడిగా ఉన్న విషయం ఎవరికీ తెలియలేదు.

ఆ రోజుల్లో విడాకులు తీసుకోవడం అనేది సమాజం దృష్ట్యా మంచిది కాదు అనే అభిప్రాయం ఉండేది. అందుకే వాళ్లు చాలా ఏళ్లు విడాకులు తీసుకోలేదు. నేను కాలేజీకి వెళ్లిన తర్వాత వారు చట్టబద్ధంగా విడిపోయారు. సమాజం ఇలా ఆలోచించడం వల్ల ఆ సమయంలో నా తల్లిదండ్రులు విడిపోయారని ఎవరికీ చెప్పుకోలేకపోయాను. ఎందుకంటే ఈ విషయం తెలిస్తే వెంటనే నా పట్ల వారి దృక్పథం మారిపోతుందనే భయం ఉండేది.

చిన్న వయసులోనే..
నా తల్లిదండ్రులు విడిపోవడానికి గల కారణాలన్నీ చూసిన తర్వాత, ఆడపిల్లలు తమ కాళ్లపై తాము నిలబడాలని నాకు చాలా చిన్న వయసులోనే అర్ధమైంది. మా అమ్మమ్మ ఎప్పుడూ ‘ఎంత సంపాదించినా, ఏ పని చేసినా ఫర్వాలేదు. కానీ, నీ కాళ్ల మీద నువ్వు నిలబడటమే ముఖ్యం’ అనేది.  కుటుంబంలో ఏ సమస్య వచ్చినా దానిని నివారించే ఉపాయాలను కనుక్కోమనేది. అలాంటి వాతావరణంలో పెరగడం వల్ల పెద్దయ్యాక మహిళల హక్కుల కోసం పోరాడాలని అనుకునేదాన్ని. చదువు తర్వాత బ్యాంకింగ్‌ రంగంలో సేల్స్‌ అండ్‌ మార్కెటింగ్‌ టీమ్‌లో చేరి, నా కెరీర్‌ను ప్రారంభించాను.

నష్టం తెచ్చిన కష్టాలు..
మా అమ్మ జాతీయ బ్యాంకులో పనిచేసేది. ఆ ఉద్యోగంలో ఒత్తిడి ఎక్కువ కాబట్టి బ్యాంకులో చేరవద్దని ఎప్పుడూ చెబుతుండేది. కానీ, మార్కెటింగ్‌ రంగంలో ఏదైనా చేయాలనుకున్నాను కాబట్టి బ్యాంకులో అవకాశం రాగానే వదలలేదు. ప్రతి పనినీ నేర్చుకున్నాను. పదకొండేళ్లపాటు బ్యాంకులో పనిచేశాను. అక్కడ పనితీరుతో అతి పిన్నవయసులో బ్యాంక్‌ వైస్‌ ప్రెసిడెంట్‌గా పదోన్నతి పొందాను.

ఒకానొక సమయంలో ఉద్యోగంపై విసుగు అనిపించి స్టాక్‌ మార్కెట్‌లో కన్సల్టింగ్‌ పనిని ప్రారంభించాను. స్టాక్‌ మార్కెట్‌ క్రాష్‌ అయ్యి, తీవ్ర నష్టం చవిచూశాను. వ్యాపార భాగస్వాములు మోసం చేశారు. ఉద్యోగం మానేసిన ఏడాదిన్నర కాలం చాలా దారుణంగా గడిచింది. తిరిగి తక్కువ జీతం, ఎక్కువ పనిగంటలు చేసేలా బ్యాంక్‌ ఉద్యోగంలో చేరాల్సి వచ్చింది. అయితే, బ్యాంకింగ్‌ అనుభవాన్ని సద్వినియోగం చేసుకోవడానికి సీనియర్ల సలహాతో ‘లా’ చదివాను. అప్పటికి నా కూతురికి నాలుగేళ్లు. ఓ వైపు ఉద్యోగం, మరో వైపు చదువు, ఇంటి పని.. అంత తేలికయ్యేది కాదు.

స్త్రీల పనికి సమాజంలో అంత త్వరగా అంగీకారం లభించదు. ఎందుకంటే స్త్రీ సామర్థ్యాల పట్ల ప్రజల వైపు ఎప్పుడూ చిన్నచూపే ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో క్లయింట్స్‌ను ఒప్పించడానికి, వారిలో విశ్వాసం కలిగించడానికి నేను రెండు రెట్లు ఎక్కువ కష్టపడాల్సి వచ్చింది. నా దృక్పథాన్ని, పని విధానాన్ని మార్చుకున్నాను. నన్ను నేను ఉత్సాహపరచుకుంటూనే ఉన్నాను. మెల్లగా నా గమ్యం వైపు కదిలి ఈ రోజు ఈ స్థితికి చేరుకున్నాను.

అభిప్రాయ భేదాలు తలెత్తినా..
నా భర్తకు నాకు మధ్య అనేక విషయాల్లో అభిప్రాయ భేదాలు తలెత్తడంతో మేమిద్దరం విడిపోవాలనుకున్నాం. భార్యాభర్తలుగా కాకుండా స్నేహితులుగా మారడం ద్వారా మా సంబంధాన్ని మరింత మెరుగ్గా కొనసాగించవచ్చని భావించాను. నా కూతురికి మంచి పెంపకాన్ని అందించడానికి అన్ని ముఖ్యమైన నిర్ణయాలు కలిసి తీసుకుంటాం. కానీ, మేం విడిగానే ఉంటాం. మా కుటుంబంలో ‘లా’ చదివినవారు ఎవరూ లేరు.

నేను చాలా కేసుల్లో మహిళల తరపున నిలబడి న్యాయం చేశాను. ఈ రంగంలో లీగల్‌ అడ్వైజర్‌గా నాదైన ముద్ర వేయగలిగాను. 2015లో అలేఖ్‌ ఫౌండేషన్‌ను ప్రారంభించి మహిళల జీవితాలను మెరుగుపరిచే పనిని చేపట్టాను. లైంగిక వేధింపులకు గురైన పిల్లలు, మహిళలకు ఉచిత న్యాయ సహాయం అందిస్తాను. ఫౌండేషన్‌ ద్వారా బాలికా విద్య, వృత్తి విద్యలలో నైపుణ్యాలకు సంబంధించిన కోర్సులు ఇవ్వడంలో కృషి చేస్తున్నారు. రొమ్ము క్యాన్సర్, పీరియడ్స్, శానిటేషన్‌ వంటి ఆరోగ్య సమస్యలపై మహిళలకు అవగాహన కల్పిస్తున్నాను.

పర్యావరణ పరిరక్షణ..
నిరుపేద బాలికల చదువుకు బాధ్యత తీసుకున్నాను. ఇటీవల నాగాలాండ్‌లో సౌండ్‌ ఇంజనీరింగ్‌ లో శిక్షణ ఇవ్వడానికి ఒక కాలేజీతో టై అప్‌ అయ్యాం. దీనికి అయ్యే ఖర్చులను ఫౌండేషన్‌ భరిస్తుంది. పర్యావరణానికి మేలు కలిగేలా అవగాహన, ప్రచారం నిర్వహిస్తున్నాను. వాతావరణ మార్పుల నుండి చెట్లను ర క్షించడం, ప్లాస్టిక్‌ వాడకాన్ని నిరోధించడం, పేపర్‌లెస్‌ జీవనశైలిని ప్రోత్సహించడం చేస్తుంటాను’’ అని తన ప్రస్థానాన్ని వివరించింది రెనీ.

Advertisement

తప్పక చదవండి

Advertisement