Alina Alam: అద్భుతదీపం

17 Jan, 2023 05:46 IST|Sakshi
దివ్యాంగులతో అలీన అలమ్‌

దొరికితే అద్భుతాలు సృష్టించవచ్చు. అది కథల్లో తప్ప బయట దొరకదని మనకు తెలుసు! అయితే అలీన అలమ్‌కు ‘పవర్‌ ఆఫ్‌ పాజిటివ్‌ యాక్షన్‌’ రూపంలో అద్భుతదీపం దొరికింది. ఆ అద్భుతదీపంతో వ్యాపారంలో ఓనమాలు తెలియని అలీన సక్సెస్‌ఫుల్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌గా రాణిస్తోంది. నిస్సహాయత తప్ప ఏమీ లేని వారికి అండగా ఉండి ముందుకు నడిపిస్తోంది...

అలీన అద్భుతదీపం
కోల్‌కత్తాకు చెందిన అలీన అలమ్‌కు హైస్కూల్‌ రోజుల్లో బాగా నచ్చిన మాట... పవర్‌ ఆఫ్‌ పాజిటివ్‌ యాక్షన్‌. రోడ్డు దాటుతున్న వృద్ధురాలికి సహాయపడినప్పుడు, ఆకలి తో అలమటిస్తూ దీనస్థితిలో పడి ఉన్న వ్యక్తికి తన పాకెట్‌మనీతో కడుపు నిండా భోజనం పెట్టించినప్పుడు, పిల్లాడికి స్కూల్‌ ఫీజు కట్టలేక సతమతమవుతున్న ఆటోడ్రైవరుకు తన వంతుగా సహాయం చేసినప్పుడు..

‘పవర్‌ ఆఫ్‌ పాజిటివ్‌ యాక్షన్‌’ అనేది తన అనుభవంలోకి వచ్చింది.
‘ఒక మంచి పని చేస్తే అది ఊరకే పోదు. సానుకూల శక్తిగా మారి మనల్ని ముందుకు నడిపిస్తుంది’ అనే మాట ఎంత నిజమో తెలిసి వచ్చింది. అలీన తల్లి గృహిణి. తండ్రి ఒక కార్పొరేట్‌ కంపెనీలో ఉద్యోగి. ‘డబ్బే ప్రధానం’ అనే ధోరణిలో వారు పిల్లల్ని పెంచలేదు.

బెంగళూరులోని అజిమ్‌ ప్రేమ్‌జీ యూనివర్శిటీలో మాస్టర్స్‌ చేసింది అలమ్‌. అక్కడ చదుకునే రోజుల్లో ఎన్నో డాక్యుమెంటరీలను చూసింది. తన ఆలోచనలు విశాలం కావడానికి, కొత్తగా ఆలోచించడానికి, కొత్తమార్గాన్ని అన్వేషించడానికి అవి కారణం అయ్యాయి.
‘రోమన్‌ చక్రవర్తి నీరోపై తీసిన ఒక డాక్యుమెంటరీ చూసి చలించిపోయాను. యుద్ధఖైదీల పట్ల అతడు క్రూరంగా వ్యవహరిస్తాడు. అయితే ఆ క్రూరత్వం అనేది ఆ చక్రవర్తికి మాత్రమే పరిమితమై లేదు. అతడితో అంతం కాలేదు. రకరకాల రూపాల్లో అది కొనసాగుతూనే ఉంది. క్రూరత్వంపై మానవత్వం విజయం సాధించాలి’ అంటుంది అలీన.

23 సంవత్సరాల వయసులో ‘మిట్టీ’ పేరుతో కేఫ్‌ ప్రారంభించింది అలీన.‘ఏదైనా మంచి ఉద్యోగం చేయకుండా ఇదెందుకమ్మా’ అని తల్లిదండ్రులు నిట్టూర్చలేదు. ఆశీర్వదించారు తప్ప అభ్యంతర పెట్టలేదు. ఇది లాభాల కోసం ఏర్పాటు చేసిన కేఫ్‌ కాదు. మానసిక వికలాంగులు, దివ్యాంగులకు ధైర్యం ఇచ్చే కేఫ్‌.

 ‘మిట్టీ’ అనే పేరును ఎంచుకోవడానికి కారణం అలమ్‌ మాటల్లో...
‘మనం ఈ నేల మీదే పుట్టాం. చనిపోయిన తరువాత ఈ నేలలోనే కలుస్తాం. నేలకు ప్రతి ఒక్కరూ సమానమే’
నిజానికి ‘మిట్టీ’ మొదలు పెట్టడానికి ముందు తన దగ్గర పెద్దగా డబ్బులు లేవు. దీంతో ఒక ఆలోచన చేసింది. ‘దివ్యాంగులకు మిట్టీ కేఫ్‌ ద్వారా సహాయ పడాలనుకుంటున్నాను. నాకు అండగా నిలవండి’ అంటూ కరపత్రాలు అచ్చువేసి కర్నాటకలోని కొన్ని పట్టణాల్లో పంచింది.  అయితే పెద్దగా స్పందన లభించలేదు.

ఒక అమ్మాయి మాత్రం అలీనకు సహాయం గా నిలవడానికి ముందుకు వచ్చింది.
‘ఒక్కరేనా! అనుకోలేదు. ఈ ఒక్కరు చాలు అనుకొని ప్రయాణం మొదలుపెట్టాను’ అని గతాన్ని గుర్తుకు తెచ్చుకుంది అలీన.
కొందరు ఆత్మీయుల ఆర్థిక సహకారంతో హుబ్లీ(కర్నాటక)లోని బీవిబీ కాలేజ్‌ ఆఫ్‌ ఇంజనీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ కాం్యపస్‌లో ‘మిట్టీ’ తొలి బ్రాంచ్‌ ప్రారంభించింది.
ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఏర్పడలేదు.

నాలుగు సంవత్సరాలలో బెంగళూరు, కర్నాటకాలలో 17 బ్రాంచ్‌లను ఏర్పాటు చేసింది. దివ్యాంగులు, మానసిక సమస్యలతో సతమతమవుతున్న వారికి ధైర్యం ఇచ్చి, తగిన శిక్షణ ఇచ్చి ఈ కేఫ్‌లలో ఉపాధి కల్పించడం ప్రారంభించింది అలీన.
‘మిట్టీ’ సక్సెస్‌ఫుల్‌ కేఫ్‌గానే కాదు దివ్యాంగుల హక్కులకు సంబంధించి అవగాహన కేంద్రంగా కూడా ఎదిగింది.
‘మిట్టీ కేఫ్‌లోకి అడుగుపెడితే చాలు చెప్పలేనంత ధైర్యం వస్తుంది’ అంటుంది కోల్‌కతాకు చెందిన 22 సంవత్సరాల కీర్తి.
దివ్యాంగురాలిగా కీర్తి అడుగడుగునా ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంది. అయితే మిట్టీ కేఫ్‌ తనలో ఎంతో ధైర్యాన్ని నింపింది.
ఇలాంటి ‘కీర్తి’లు ఎంతో మందికి అండగా నిలుస్తోంది మిట్టీ కేఫ్‌.

మరిన్ని వార్తలు