Asian Games 2023: కూలి పనులు చేసిన ఈ చేతులు కాంస్య పతకం అందుకున్నాయి | Sakshi
Sakshi News home page

Asian Games 2023: కూలి పనులు చేసిన ఈ చేతులు కాంస్య పతకం అందుకున్నాయి

Published Sun, Oct 8 2023 12:22 AM

Asian Games 2023: Labour Worker Ram Babu clinches bronze in 35km mixed relay race walk - Sakshi

మనం కనే కలలకు మన ఆర్థికస్థాయి, హోదాతో పనిలేదు. సంకల్పబలం గట్టిగా ఉంటే మనల్ని విజేతలను చేస్తాయి. అందరిచేతా ‘శబ్భాష్‌’ అనిపించేలా చేస్తాయి. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన రాంబాబు కూలి పనులు చేసేవాడు. ఆటల్లో తన కంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోవాలని కలలు కనేవాడు.

నిజానికి అతడి  కలలకు, అతడు చేసే కూలిపనులకు పొంతన కుదరదు. అయితే లక్ష్యం గట్టిగా ఉంటే విజయం మనవైపే చూస్తుంది. కూలిపనులు చేస్తూనే కష్టపడి తన కలను నిజం చేసుకున్నాడు. ఆసియా గేమ్స్‌లో 35 కిలోమీటర్‌ల రేస్‌వాక్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ ఈవెంట్‌లో కాంస్య పతకాన్ని గెలుచుకొని ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచాడు.

‘మాది పేదకుటుంబం. చాలా కష్టాలు పడ్డాను. మా అమ్మ నన్ను మంచి స్థాయిలో చూడాలనుకునేది. కాంస్య పతకం గెలచుకోవడంతో మా తలిదండ్రులు సంతోషంగా ఉన్నారు’ అంటున్నాడు రాంబాబు. రాంబాబు కూలిపనులు చేస్తున్న ఒకప్పటి వీడియోను ఇండియన్‌ ఫారెస్ట్‌ ఆఫీసర్‌ పర్వీన్‌ కాశ్వాన్‌ ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. ‘అదృష్టం కష్టపడే వారి వైపే మొగ్గు చూపుతుంది అంటారు. అయితే రాంబాబుది అదృష్టం కాదు. కష్టానికి తగిన ఫలితం. లక్ష్య సాధనకు సంబంధించి సాకులు వెదుక్కునేవారికి ఈ వీడియో కనువిప్పు కలిగిస్తుంది’ అంటూ నెటిజనులు స్పందించారు.
 

Advertisement
Advertisement