పథం దృక్పథం | Sakshi
Sakshi News home page

పథం దృక్పథం

Published Mon, Aug 7 2023 4:56 AM

Attitudes toward quality of survival of humanity - Sakshi

దృక్పథం... ప్రతి వ్యక్తికి తప్పనిసరిగా ఉండేది దృక్పథం. మనస్థితి, పరిస్థితి వీటిని బట్టి ఎవరికైనా దృక్పథం అన్నది ఉంటూనే ఉంటుంది. దృక్పథం ఉండని మనిషి ఉండడు. మనిషి అన్నాక దృక్పథం ఉండకుండా ఉండదు. దృక్పథం మనిషి మనుగడ స్థాయిని, తీరును, నిర్ణయిస్తుంది. దృక్పథం మనిషి ప్రగతికి, పతనానికి మూలం ఔతుంది. సరైన దృక్పథం లేకపోతే మనుగడ సరిగ్గా లేనట్టే; మేలైన దృక్పథం ఉంటే మనుగడ మేలుగా ఉన్నట్టే.

చంద్రుడిపై కాలు మోపిన తొలి మనిషి నీల్‌ ఆర్‌మ్‌స్ట్రాంగ్‌ అన్నది మనకు తెలిసిందే. కానీ ప్రణాళిక ప్రకారం ఎడ్విన్‌ ఆల్‌డ్రిన్‌ ముందుగా చంద్రుడిపై దిగాలి. ఆల్‌డ్రిన్‌ చంద్రుడిపై కాలు పెట్టబోయే తొలి మానవుడుగా నిర్ణయం అయిపోయింది. అయితే చంద్రుడిపై రాకెట్‌ దిగి తలుపులు తెరుచుకున్నాక ఆల్‌డ్రిన్‌ కదల్లేదు. అతడికి దిగమని ఆదేశాలు అందినా అతడు కదల్లేదు. ముందుగా చంద్రుడిపై దిగితే తనకు ఏం జరుగుతుందో అన్న దృక్పథం ఎడ్విన్‌ ఆల్‌డ్రి¯Œ ను కదలనివ్వలేదు. ఆల్‌డ్రిన్‌ కదలకపోవడంతో ఆర్‌మ్‌స్ట్రాంగ్‌కు దిగమని ఆదేశాలు అందాయి. ఏమైనా పరవాలేదు అన్న దృక్పథంతో ఆర్‌మ్‌స్ట్రాంగ్‌ రాకెట్‌ నుంచి చంద్రుడిపై దిగాడు; చంద్రుడిపై కాలు మోపిన తొలి మానవుడుగా చరిత్రలో నమోదు అయ్యాడు. ఆల్‌డ్రిన్‌ ఆ అవకాశాన్ని తన దృక్పథం కారణంగా జారవిడుచుకున్నాడు; చారిత్రిక ప్రాశస్త్యాన్ని కోల్పోయాడు.

‘మనం మన దృక్పథానికి అంటిపెట్టుకుని ఉంటాం అన్నీ దాని ఆధారంగానే ఉంటాయి అని. అయినా మన అభిప్రాయాలకు శాశ్వతత్వం లేదు. వసంతం, హేమంతాలలాగా అవి తొలగిపోతూంటాయి’ ఆని ప్రఖ్యాత చైనీస్‌ తత్త్వవేత్త జువాంగ్‌ చి ఒక సందర్భంలో అన్నారు. తన దృక్పథం సరైంది అనుకుంటూ దాన్నే అంటిపెట్టుకుని ఉండడం మనిషి బలహీనతల్లో బలమైంది. దృఢమైన దృక్పథం అన్నది మనిషికి బరువైన అవరోధం ఔతుంది. కదలని నీరు కాలక్రమంలో బురద అయిపోయినట్టుగా మారని దృక్పథం మనిషిని పాడుచేస్తుంది. మనిషి తన దృక్పథాన్ని మార్చుకోవడానికి సిద్ధంగా ఉండాలి. పరిణామాలను బట్టి దృక్పథం ఉండాలి. దృక్పథం ప్రయోజనాల్ని సాధించగలిగేదై ఉండాలి.

కొందరు నేతల దృక్పథ దోషాలవల్ల ప్రపంచానికి ఎంతో హాని జరిగింది, జరుగుతోంది. ఇవాళ్టి రోజున రష్యా, ఉక్రెయిన్‌ యుద్ధం విషయాన్ని పరిగణనలోకి తీసుకుంటే ఉక్రెయి¯Œ పై రష్యా దృక్పథం, రష్యాపై ఉక్రెయిన్‌ దృక్పథం వల్లే యుద్ధం సాగుతూ పెనువినాశనం జరుగుతోంది. ఆ దృక్పథ వైరుద్ధ్యం పలు ఇతర దేశాల్ని అవాంఛనీయ పర్యవసానానికి గురిచేస్తోంది. ఈ దుస్థితి తొలగిపోవాలంటే ఇంకా విధ్వంసం జరగకుండా ఉండాలంటే ఆ ఇరుదేశాల దృక్పథాలూ మారాలి.

వ్యక్తిపరంగానూ, సామాజికంగానూ, సాంస్కృతికంగానూ, కళల పరంగానూ, భాషపరంగానూ దృక్పథం తిన్నగా ఉండడమే కావల్సింది. దృక్పథం తిన్నగా ఉండకపోవడం నష్టాన్ని, నాశనాన్ని కలిగిస్తుంది. కొన్ని దశాబ్దుల క్రితం మెరుగైన దృక్పథం లోపించడంవల్ల ఇవాళ తెలుగు భాష, తెలుగు కవిత్వం వైభవాన్ని కోల్పోవడం కాదు వికృతం అయిపోయిన వైనాన్ని అందుకు ఉదాహరణగా మనం చూడచ్చు. పలువురు తమ దృక్పథాల్ని మార్చుకోలేక తాము పతనమైపోవడమే కాకుండా తమ కుటుంబాలకు తీక్షణమెన హాని చేస్తున్నారు. దృక్పథ వక్రత అన్న దానివల్ల సమాజానికి తీవ్రమైన చేటు కలుగుతోంది.

దృక్పథం అన్నది మనిషి మనుగడలో ప్రముఖమైంది ఆపై ప్రధానమైంది. ప్రతిమనిషికి దృక్పథం అన్నది ప్రత్యగ్రంగా ఉండాలి. మనిషికి దృక్పథం భవ్యంగా ఆపై సవ్యంగా ఉంటే సత్పథం అమరుతుంది. సత్పథం అమరితే మనుగడ ఉన్నతంగా ఆపై ఉజ్జ్వలంగా ఉంటుంది. కనుక మనిషి తన దృక్పథాన్ని సరిచూసుకుంటూ ఆపై సరిచేసుకుంటూ మనుగడకు మహత్తును సాధించుకోవాలి.
 

‘దృక్పథం మనిషిని ఎత్తులకు తీసుకు వెళుతుంది. దృక్పథం మనిషిని చిత్తు చేస్తుంది. దృక్పథం ఎత్తుల్లో ఉన్న వ్యక్తిని చిత్తు అయేట్టు చేస్తుంది. దృక్పథం చిత్తు అయిన వ్యక్తిని ఎత్తులకు చేరుస్తుంది. ఎత్తులకు చేరుకోవడానికైనా, చిత్తు అయిపోవడానికి అయినా దృక్పథం కీలకం’

– రోచిష్మాన్‌

Advertisement
Advertisement