Know About Interesting Unknown Facts About Balagam Movie Fame Vijaya Lakshmi In Telugu - Sakshi
Sakshi News home page

బలగం సినిమాలో మేనత్త పోచవ్వ..! కరీంనగర్‌ కోడలు.. సురభి పరివారంలో..

Published Tue, Apr 4 2023 11:22 AM

Balagam Movie Fame Vijayalakshmi Interesting Inspiring Facts About Her - Sakshi

ఇప్పుటి సంగతి ఏమోగాని ఒకప్పుడు ప్రతి ఇంట్లో మేనత్తల అజమాయిషీ ఉండేది. శుభాల్లో, అశుభాల్లో మేనత్త వచ్చి దగ్గర ఉండి మంచీ చెడ్డకు నిలిచేది. అనుబంధాల ఆనవాలు చెప్పేది. ‘బలగం’ సినిమా చూసి అందులో మేనత్త పోచవ్వగా నటించిన నటి విజయలక్ష్మిలో అందరూ తమ మేనత్తలను పోల్చుకుంటున్నారు.

సురభి ఆర్టిస్టయిన 65 ఏళ్ల విజయలక్ష్మికి ఇదే తొలి సినిమా. ఇంతకాలం గ్రాంథిక సంభాషణలు మాత్రమే పలికిన ఆమె పోచవ్వగా తెలంగాణ నుడికారాన్ని మెరిపించారు. ఆమె గొప్ప హరికథా కళాకారిణి కూడా. విజయలక్ష్మి పరిచయం.

‘తల వెంట్రుకంత అదృష్టమైనా తల చూపాలి కదా’ అన్నారు సురభి విజయలక్ష్మి. 65 ఏళ్లకు ఆమెకు అదృష్టం తల చూపిందనే అనుకోవాలి. సురభి ఆర్టిస్టుగా స్టేజ్‌ మీద ఎంత పేరున్నా, భాగవత కళాకారిణిగా ఎంత గుర్తింపున్నా ఇప్పుడు ‘బలగం’ సినిమాలో పోచవ్వగా చేసిన పాత్రే ఆమెకు ఎక్కువ పేరు, గుర్తింపు, ఉనికి ఇచ్చింది. పల్లెటూరి పెద్ద వయసు స్త్రీల విసురు, కసురు, మాట విరుపు, ఆర్ద్రత, అన్నింటినీ పోచవ్వ పాత్రలో రక్తి కట్టించడమే కారణం. ఆమె ఉద్వేగాలు ప్రేక్షకులను కట్టిపడేశాయి.

‘మా సురభి పరివారమంతా చాలా సంతోషంగా ఉన్నారు. సినిమా రంగం నుంచి ఫోన్లు వస్తున్నాయి. ఇదంతా చాలా కొత్తగా ఉంది’ అన్నారామె.
హైదరాబాద్‌ చందా నగర్‌లోని సురభి కాలనీలో నివాసం ఉంటున్న విజయలక్ష్మి ఒక రకంగా రంగస్థలంపైనే పుట్టారు. ఆమె తల్లి ప్రఖ్యాత నటి కమలాదేవి. తండ్రి నాగభూషణం. అయితే ఆరుగురు అక్కచెల్లెళ్లలో విజయలక్ష్మి మాత్రమే నటిగా స్టేజ్‌ మీద కొనసాగారు.

‘మూడేళ్ల వయసు నుంచే నాటకాల్లో పాత్రలు చేశాను. కృష్ణుడు, లోహితాస్యుడు... వయసు వచ్చాక దేవకి, సావిత్రి, అనసూయ, కాంతామతి... ఈ పాత్రలన్నీ పోషించేదాన్ని. సురభిలో ఏ పాత్రైనా ఎవరైనా చేయాలని రూలు. అందువల్ల మగవేషాలు కూడా వేశాను. కృష్ణుడిగా, బాలనాగమ్మలో మాయల పకీరుగా నటించాను’ అన్నారు విజయలక్ష్మి. 

కరీంనగర్‌ కోడలు
యుక్త వయసు రాగానే కరీంనగర్‌కు చెందిన బంధువుల కుర్రాడు కేశవరావుతో వివాహం జరిగింది. అతను కూడా నటుడు. భార్యాభర్తలిద్దరూ కలిసి నాటక సమాజం నడిపారు. అయితే పిల్లల చదువుల కోసం సురభీ నటీనటులు వేరే చోట్లకు వెళ్లిపోతుండటంతో అందరూ కలిసి సంచారం చేసే పరిస్థితి పోయింది. ‘నేను చిన్నప్పటి నుంచి బాగా పాడేదాన్ని.

హరికథలంటే ఆసక్తి ఉండేది. హరికథ నేర్చుకుంటే నేనొక్కదాన్నే ప్రదర్శన ఇవ్వొచ్చు. అలా హరికథా కళాకారిణిగా మారాను. నిజామాబాద్, కరీంనగర్, మెదక్, నల్గొండ... ఈ నాలుగు జిల్లాల్లో నేను తిరగని పల్లెటూరు లేదు. మహాభారతాన్ని 18 రోజులు ఒకే ఊరిలో ఉండి చెప్పేదాన్ని. నవరాత్రులొస్తే రాత్రి 8 నుంచి ఒంటి గంట వరకూ నా హరికథ ఉండేది.’ అంటారామె.

తెలంగాణ పలుకుబడి
‘బలగం సినిమాలో పోచవ్వ పాత్ర కోసం ఆర్టిస్టులను వెతుక్కుంటూ దర్శకుడు వేణు సురభి కాలనీకి వచ్చారు. అందరూ ఆడిషన్స్‌ ఇస్తుంటే నేనూ ఇచ్చాను. ఆశ్చర్యంగా నన్నే సెలెక్ట్‌ చేశారు. ఇంతకుముందు ఒకటి రెండు సినిమాలలో నటించినా నాకంటూ అసలు డైలాగు లేదు. ఇదే తగిన నిడివి ఉన్న మొదటి సినిమా. కాని తెలంగాణ మాండలికం.

నేనేమో జీవితమంతా రంగస్థలం మీద, హరికథల్లోనూ గ్రాంథికం మాట్లాడతాను. రోజువారి జీవితంలో కూడా నా భాష గ్రాంథికంలా ఉంటుంది. కాని హరికథలు చెప్పడానికి తెలంగాణ పల్లెలకు వెళ్లినప్పుడు అక్కడి స్త్రీలను గమనించిన అనుభవం నాకు ఉపయోగపడింది. డైలాగులను ఆ స్త్రీలు చెప్పినట్టుగా చెప్పాను. నేను నిజంగా అక్కడి ప్రాంత స్త్రీ అని, ఊరిలోని స్త్రీ చేత ఆ పాత్ర చేయించారని అనుకుంటున్నవాళ్లు చాలామంది ఉన్నారు’ అని నవ్వారామె.

సినిమాలో మేనత్తగా ఆమె ముఖ్యపాత్రల మధ్య వైషమ్యాలు తొలిగేలా చేయడంలో కీలకపాత్ర పోషిస్తారు. అందువల్ల చాలామంది విజయలక్ష్మిలో తమ మేనత్తను వెతుక్కున్నారు. ‘మన సమాజంలో మేనత్తకు ఎప్పటికీ ఇంటి ఆడబిడ్డ స్థానం ఉంటుంది. సోదరులు ఆమెను గౌరవించాల్సిందే. వదిన అయినా, మరదలు అయినా ఇంటి ఆడపడుచుకు తల వొంచాల్సిందే. ఆ అధికారం నా పాత్రలో చూపించాను’ అన్నారు విజయలక్ష్మి.

సినిమా నటీమణుల్లో శాంతకుమారిని ఇష్టపడే విజయలక్ష్మి ఒక రకంగా కొత్త ప్రయాణం మొదలెట్టారు. ఆమె ఇద్దరు కొడుకులు, కూతురు జీవితాల్లో స్థిరపడ్డారు కనుక నటనకు ఎక్కువ సమయం ఇవ్వాలనుకుంటున్నారామె. పోచవ్వకు ఆల్‌ ది బెస్ట్‌.    

చదవండి: బంగారంలాంటి ఆలోచన

Advertisement
Advertisement