భోగి రోజే గోదా కళ్యాణం.. చిన్నారులకు భోగిపళ్లు ఎందుకు పోస్తారు? | Sakshi
Sakshi News home page

భోగి రోజే గోదా కళ్యాణం.. చిన్నారులకు భోగిపళ్లు ఎందుకు పోస్తారు?

Published Sun, Jan 14 2024 8:00 AM

Bhogi Festival 2024: Story Fo Goda Kalyanam On Bhogi - Sakshi

తెలుగునాట సంబరంగా జరుపుకునే పెద్ద పండుగా సంక్రాంతి. ఈ నాలుగు రోజుల పండుగలో మొదటి రోజు భోగభాగ్యల "భోగి"తో మొదలవుతుంది. ఈ భోగి పండుగ రోజు పెద్ద చిన్నా అంతా నలుగుపెట్టుకుని తలంటు స్నానం చేసి భోగి మంటలతో పండుగ మొదలు పెడతారు. ఆ రోజే దేవాలయాల్లో అంగరంగ వైభవంగా గోదా కళ్యాణం జరుగుతుంది. ఆ రోజు సాయంత్రమే పసిపిల్లలకు తలపై భోగిపళ్లు పేరుతో రేగిపళ్లు పోయడం వంటి తతంగాలు జరుగుతాయి. ఆ రోజే ఇవన్నీ చేయడానికి గల కారణాలేంటో తెలుసుకుందామా!.

పూర్వం ఈ దినమే శ్రీ రంగనధాస్వామిలో గోదాదేవి లీనమై భోగాన్ని పొందిందని దీని సంకేతంగా "భోగి" పండగ ఆచరణలోకి వచ్చిందనేది మన పురాణ గాథ. ఒక రకంగా భగవంతుడి మనుసును గెలుచుకున్న ఓ భక్తురాలి గాథ ఇది. ప్రేమకు భగవంతుడైనా.. బంధీ అయిపోతాడని చెప్పే చక్కని పురాణ కథ ఇది. ఇక భోగి రోజు గోదా కళ్యాణం చేయడానికి కారణం ఏంటంటే..

గోదా కళ్యాణ ప్రాశస్యం..
శ్రీ మహావిష్ణువుకు భక్తులై ఆయనే లోకంగా జీవించి తరించిన మహాభక్తులను ఆళ్వారులు అంటారు. వీళ్లలో ముఖ్యమైన వారు 12 మంది. వీరిలో పెరియాళ్వారు అనే ఆయన శ్రీరంగనాధుడికి మహాభక్తుడు. ఈయన అసలు పేరు భట్టనాధుడు. ఈయనే తరువాతి కాలంలో విష్ణుచిత్తుడిగా ప్రసిద్ధి చెందాడు. విష్ణుచిత్తుడు రంగనాధుడికి ప్రతినిత్యం పూల మాలతో కైంకర్యం(అలంకరణ) చేసేవాడు. దీనికోసం ఒక తోటను పెంచి అందులో రకరకాలైన పూలతో అందంగా మాలలు కట్టి  శ్రీరంగ నాథుడికి సమర్పించేవాడు. 

ఒకనాడు విష్ణుచిత్తునికి తులసి మెుక్క గుబురులో ఒక పసిపాప కనిపించింది. అతడు ఆ బిడ్డను భూదేవియే ప్రసాదింగా భావించి అల్లారుముద్దుగా పెంచుకోసాగాడు. అతను ఆ బిడ్డకు గోదా అని పేరుపెట్టాడు. ఈ గోదాదేవి చిన్ననాటి నుంచి కృష్ణుడి లీలలను ఆడుతూ పాడుతూ పెరిగిందే. యుక్తవయసు వచ్చేసరికి ఆ భక్తి కాస్తా ప్రేమగా మారిపోయింది. తన తండ్రి విష్ణుచిత్తుడు రోజూ భగవంతుని కోసం రూపొందించే మాలలను ముందు తానే ధరించి, తనలో ఆ కృష్ణుని చూసుకుని మురిసిపోయేది. ఈ దృశ్యం ఒకరోజు విష్ణుచిత్తుని కంట పడనే పడింది. తన కూతురు చేసిన పని వల్ల ఇన్నాళ్లూ ఆ దేవదేవుని పట్ల అపచారం జరిగిందని ఎంతగానో బాధపడ్డాడు.

కానీ ఆ రోజు కృష్ణుడు అతనికి కలలో కనిపించి, గోదాదేవి సాక్షాత్తూ భూదేవి అవతారమేననీ, ఆమె వేసుకున్న మాలలను ధరించిడం వల్ల తనకు అపచారం కాదు కదా, ఆనందం కలుగుతుందనీ తెలియచేశాడు. ఇక ఆమె యుక్తవయస్సుకు రాగానే శ్రీరంగనాధుడినే వివాహం చేసుకోవాలని నిశ్చయించుకుంది. దీంతో ఆమె తన తండ్రి వద్దకు వెళ్లి మానవ కాంతలెవరైనా దేవుడిని వివాహమాడిన సందర్భాలు ఉన్నాయా? అని అడుగగా ఆయన ఉన్నాయని చెప్పాడు. దానికోసం కాత్యాయని  వ్రతమాచరించ వలసి ఉంటుందని చెప్పగా.. ఆమె ఆ వ్రత నియమాలను తెలుసుకొని ధనుర్మాసంలో ఆ వ్రతమును ఆచరించడమే గాక కృష్ణునిపై ప్రేమతో ఆయన్ను కీర్తిస్తూ 30 పాశురాలను కూడా పాడింది.

అలా గోదా దేవి ప్రేమకు లొంగిపోయిన కృష్ణుడు విష్ణుచిత్తుడి కలలో కనిపించి గోదా దేవిని తీసుకుని శ్రీరంగనాథం రావాలని, అక్కడ ఆమెను వివాహం చేసుకుంటానని చెప్పాడు. దీంతో విష్ణుచిత్తుని ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ఈ విషయం ఆలయ అర్చకులకు, విల్లిపుత్తూరులోని ప్రజలకు తెలియజేశాడు. అందర్ని వెంటబెట్టుకుని శ్రీరంగనాథ ఆలయానికి చేరుకున్నాడు. అయితే పెళ్లికూతురిగా గర్భగుడిలోకి ప్రవేశించిన గోదా దేవి అందరూ చూస్తుండగానే కృష్ణునిలో ఐక్యమైపోయింది. అయితే ఈ గోదా కళ్యాణం జరిగింది మకర సంక్రమణం జరిగే ముందు రోజైన భోగి నాడు. అందువల్లనే అప్పటి నుంచి ప్రతి ఏడాది భోగి రోజున గోదా కళ్యాణం ఒక పండుగలా చేస్తారు. 

భోగిపళ్లు ఎందుకు పోస్తారంటే..?
భోగి రోజున భోగి పళ్ళు పేరుతో రేగి పళ్ళను పిల్లల మీద పోస్తారు. రేగి చెట్టుకు బదరీ వృక్షం అని సంస్కృతంలో పిలుస్తారు. శివుణ్ని ప్రసన్నం చేసుకోవడానికి నరనారాయణులు బదరికావనంలో ఘోర తపస్సు చేశారట. ఆ సమయంలో దేవతలు వారి తలల మీద బదరీ ఫలాలని కురిపించారని చెబుతారు. ఆనాటి సంఘటనకు ప్రతీకగా పిల్లలను నారాయణుడిగా భావించి భోగిపండ్లను పోసే సంప్రదాయం వచ్చిందని పురాణ వచనం. అలాగే ఇది సూర్యునికి ప్రీతిపాత్రమైన ఫలం. సూర్యుని రూపం, రంగు, పేరు కలిగినవి ఈ రేగుపళ్లు. అందువల్ల వీటికి కొన్ని నాణేలను జత కలిపి పిల్లల తలపై పోస్తారు. వాటిని తలపై పోయడం వల్ల లక్ష్మీ నారాయణుల అనుగ్రహం మన పిల్లలకు ఉండటమేగాక, ఎలాంటి దిష్టి తగలకుండా దీర్ఘా ఆయుష్షుతో ఉంటారని ప్రతీతి. 

ఇలా పోయడంలో మరో అంతరార్థం ఏంటంటే..? మన బాహ్య నేత్రాలకి కనిపించని బ్రహ్మ రంధ్రం మన తల పైభాగంలో ఉంటుంది. ఈ భోగి పండ్లను పోయడంతో ఆ బ్రహ్మరంధ్రం ప్రేరేపించి జ్ఞానవంతులు అవుతారని ఒక నమ్మకం కూడా. అంతేగాదు ఈ రేగు పండ్లు సూర్య కిరణలలోని ప్రాణశక్తిని అధికంగా గ్రహించి, నిల్వ ఉంచుకుంటాయి కనుక వీటిని తల మీద పోయడం వలన వీటిలోని విద్యుచ్చక్తి, మన శరీరం, ఆరోగ్యంపై ప్రభావాన్ని చూపించి మంచి ఫలితాలు ఇస్తాయి. అందువలనే పిల్లలకి భోగి పండ్లు పోసి ఆశీర్వదిస్తారు పెద్దలు.

(చదవండి: భోగి పండుగకు ఆ పేరు ఎలా వచ్చింది? చలి మంటలు ఎందుకు వేస్తారు?)

Advertisement

తప్పక చదవండి

Advertisement