ప్రేమిస్తే.. అంతే! ప్రేయసి పనికి అందరూ అవాక్కు! వైరల్‌ వీడియో  | Bihar jamui love story: Couple Hugged Each Other, Created Drama Video Goes Viral On Social Media - Sakshi
Sakshi News home page

Jamui Couple Hug Video Viral: ప్రేమిస్తే.. అంతే! ప్రేయసి చేసిన పనికి అందరూ అవాక్కు! వైరల్‌ వీడియో 

Published Thu, Mar 7 2024 1:25 PM

Bihar jamui love story couple hugged each other vide goes viral - Sakshi

పిల్లలు ప్రేమించుకుంటారు. అదేదో సినిమాలో అన్నట్టు ‘‘ఈ పెద్దవాళ్లు ఉన్నారే...’’ కారణాలు ఏవైనా పెళ్లికి  వ్యతిరేకిస్తారు.. దాదాపు ప్రతీ ప్రేమ కథలోనూ ఈ ట్విస్ట్‌ ఉంటుంది. కానీ చావనైనా చస్తాను గానీ.. ప్రియుడిని వదిలేది  అంటూ  పట్టుబట్టిన ఒక  ప్రేయసి కథ ఒకటి ఇంటర్నెట్‌లో హల్‌ చల్‌ చేస్తోంది.  వివరాలు ఇలా ఉన్నాయి. 

బిహార్‌, జముయ్ జిల్లా టెటారియా గ్రామానికి చెందినవర్ష కుమారి, ధునియామన్రాన్ గ్రామానికి చెందిన ఉమేష్ యాదవ్ ప్రేమించు కున్నారు. ఇది తెలిపిన అమ్మాయి తరపు కుటుంబం వీరి ప్రేమను నిరాకరించింది.  హడావిడిగా ఒక ప్రభుత్వ ఉద్యోగిని చూసి మార్చి 11న పెళ్లి ముహూర్తం నిశ్చయించేశారు. పెళ్లి సన్నాహాలు  ఊపందుకున్నాయి.  అంతా పెళ్లి పనుల్లో నిమగ్నమయ్యారు. గ్రామంలో, తెలిసిన వారికి పెళ్లి కార్డులు పంపిణీ చేశారు.

ఇక సమయం లేదు మిత్రమా అనుకుందేమో..సరిగ్గా పెళ్లికి ఎనిమిది రోజులు ఉండగా శనివారం రాత్రి వర్ష ఇంట్లోనుంచి పారిపోయింది. క్షణం ఆలస్యం చేయకుండా  గుడిలో ప్రియుడు ఉమేష్‌ను పెళ్లాడింది. ఇంతలో కుమార్తె  కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు.వీరి ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు  రంగంలోకి దిగారు.

జముయి జిల్లాలోని బర్హత్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ధునియామారన్ గ్రామంలో ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. వెంటనే  ఆ  గ్రామానికి చేరుకుని అమ్మాయిని అదుపులోకి  తీసుకునేందుకు ప్రయత్నించారు పోలీసులు. ఇక్కడే హై డ్రామా నెలకొంది.

అమ్మాయిని అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు నానా తంటాలు పడ్డారు. పెద్ద తోపులాట జరిగింది. అయితే చావనైనా చస్తాను గానీ భర్తను వీడేది లేదంటూ అతడిని గట్టిగా వాటేసుకుంది. ఇద్దరినీ విడదీసేందుకు పోలీసులుఎంత యత్నించినా పట్టువీడలేదు. చివరికి పోలీసులు వారిద్దరినీ అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కానీ ఆ తరువాత  మేజర్లు కావడంతో పోలీసులు  కొత్త జంటను ఇంటికి పంపించారు. ఈ సంఘటన బర్హత్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు  చేసుకుంది. 

Advertisement
Advertisement