కృష్ణబిలాల అన్వేషణలో | Sakshi
Sakshi News home page

కృష్ణబిలాల అన్వేషణలో

Published Wed, Apr 24 2024 4:55 AM

Black Hole Hunter: Priyamvada Natarajan - Sakshi

‘టైమ్‌’ మేగజీన్‌ 2024 సంవత్సరానికి గాను ‘100 మంది ప్రభావపూరిత వ్యక్తుల’ జాబితా ప్రకటించింది. ప్రపంచవ్యాప్త ఉద్దండులతో పాటు భారతీయులు కూడా ఈ ఎంపికైన వారిలో ఉన్నారు. వారిలో ఒకరు ఆస్ట్రోఫిజిసిస్ట్‌ ప్రియంవద రంగరాజన్‌. కృష్ణబిలాలను లోతుగా అధ్యయనం చేయడం ద్వారా సృష్టి పుట్టుకను విశదం చేయగల మర్మాన్ని ఈమె విప్పుతున్న తీరు అసామాన్యమని ‘టైమ్‌’ భావించింది. కోయంబత్తూరులో జన్మించి అమెరికాలో స్థిరపడ్డ ప్రియంవద పరిచయం.

మన పాలపుంతలో ఎన్ని కృష్ణ బిలాలు (బ్లాక్‌ హోల్స్‌) ఉంటాయో తెలుసా? కనీసం కోటి నుంచి నూరు కోట్ల వరకు. అంతరిక్షంలో కృష్ణ బిలాలు ఒక నిగూఢ రహస్యం. ఐన్‌స్టీన్‌ వీటిని ఊహించాడుగాని ఆయన జీవించి ఉన్నంత కాలం వాటి ఉనికిపై వాస్తవిక ఆధారాలు వెల్లడి కాలేదు. 1967లో జాన్‌ వీలర్‌ అనే ఫిజిసిస్ట్‌ ‘బ్లాక్‌ హోల్‌’ పదం వాడినప్పటి నుంచి వీటిపై చర్చలు కొనసాగాయి. ఆ తర్వాతి కాలంలో ఉనికి గురించిన ఆధారాలు దొరికాయి. కృష్ణ బిలాలు కాంతిని కూడా మింగేసేంత శక్తిమంతమైనవి.

చిన్న చిన్న బ్లాక్‌హోల్స్‌ నుంచి అతి భారీ (సూపర్‌ మాస్‌) బ్లాక్‌ హోల్స్‌ వరకూ మన పాలపుంతలో ఉన్నాయి. ఒక తార తన గురుత్వాకర్షణలో తానే పతనం అయినప్పుడు బ్లాక్‌ హోల్స్‌ ఏర్పడతాయనేది ఒక సిద్ధాంతమైతే ఇవి విశ్వం ఏర్పడే సమయంలోనే అంతరిక్ష ధూళిమేఘాలు తమపై తాము పతనవడం వల్ల ఏర్పడ్డాయని మరో సిద్ధాంతం. ఈ మరో సిద్ధాంతానికి ఊతం ఇస్తూ ప్రియంవద రంగరాజన్‌ సాగిస్తున్న పరిశోధనల వల్లే ఆమె తాజాగా ‘టైమ్‌’ మేగజీన్‌లో ‘హండ్రెడ్‌ మోస్ట్‌ ఇన్‌ఫ్లుయెన్షల్‌ పీపుల్‌’లో ఒకరుగా నిలిచారు.

ఆమె పరిశోధన
ప్రియంవద కృష్ణబిలాల పరిశోధనలో ప్రత్యేక కృషి చేశారు. గురుత్వాకర్షణ లెన్సింగ్‌ పద్ధతి ద్వారా నక్షత్ర మండలాల ఆవిర్భావాన్ని, వాటి పరిణామాలను, అనేక నక్షత్ర మండలాల మధ్య అంతర్గత సంబంధాలపై అధ్యయనం చేశారు. నక్షత్ర మండల సమూహాల గతిశీలతను అధ్యయనం చేయడానికి లెన్సింగ్, ఎక్స్‌–రే, సున్యావ్‌–జెల్డోవిక్‌ డేటాను ఉపయోగించారు. అంతే కాదు ఒక నక్షత్రం, కృష్ణబిలం కలయిక ద్వారా ఏర్పడే విద్యుదయస్కాంత, గురుత్వాకర్షణ తరంగాలపై కూడా అధ్యయనం చేశారు. ఆమెను ఎన్నో అవార్డులు వరించాయి. ప్రతిష్టాత్మక లిబర్టీ సైన్స్‌ సెంటర్‌ వారి ‘జీనియస్‌ అవార్డు’ కూడా దక్కింది. ఈ విశ్వం ఎలా పరిణామం చెందిందో తెలుసుకోవడానికి ప్రియంవద సాగిస్తున్న కృష్ణబిలాల అన్వేషణ చాలా కీలకంగా ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

కోయంబత్తూరులో జన్మించి...
ప్రియంవద రంజరాజన్‌ కోయంబత్తూరులో జన్మించారు. తండ్రి ఉద్యోగం రీత్యా ఇంటర్‌ వరకూ ఢిల్లీలో చదువుకున్నారు. ఆమె అండర్‌ గ్రాడ్యుయేషన్‌ ‘మసాచుసెట్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ’లో జరిగింది. ఆ తర్వాత యూనివర్సిటీ ఆఫ్‌ కేంబ్రిడ్జ్‌ నుంచి పిహెచ్‌డి చేశారు. ప్రస్తుతం అమెరికాలోని యేల్‌ యూనివర్సిటీలోప్రోఫెసర్‌గా పని చేస్తున్నారు. ‘మ్యాపింగ్‌ ది హెవెన్స్: ది రాడికల్‌ సైంటిఫిక్‌ ఐడియాస్‌ దట్‌ రివీల్‌ ది కాస్మోస్‌‘ అనే ముఖ్యమైన గ్రంథాన్ని రచించారు. 

Advertisement

తప్పక చదవండి

Advertisement