మానసిక సౌఖ్యం మహోన్నతం | Sakshi
Sakshi News home page

మానసిక సౌఖ్యం మహోన్నతం

Published Mon, Aug 2 2021 7:22 AM

Borra Govardhan Spiritual Essay - Sakshi

సుఖం, అనేది అంగట్లో దొరికే వస్తువే అయితే ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడుపోయే వస్తువు అయ్యేది. వెండి, బంగారం, వజ్రాల కంటే విలువైనది అయ్యేది. అది కొని తెచ్చుకునేది కాదు. ప్రతి మనిషీ తనకు తాను, తనలో తాను రూపొందించుకునే గొప్ప అనుభూతి! మణిమాణిక్యాలు, వజ్రవైఢూర్యాలు, ధనరాశులు, రాజ్యం, అధికారం, మహా ఐశ్వర్యం ఇవన్నీ దర్పాన్ని తెచ్చిపెడతాయి కానీ, చిటికెడు సుఖాన్ని అందించలేవు. కనీసం కంటినిండా కునుకు తీసే అవకాశాన్ని ఇవ్వలేవు.

కప్పినుడు అలాంటి పరిస్థితిని చవిచూశాడు. అతను కుక్కుట రాజ్యానికి రాజు. తండ్రి మరణానంతరం రాజయ్యాక జంబూ ద్వీపం మొత్తాన్ని జయించాడు. రాజులందర్నీ పొరద్రోలాడు. కానీ... మెత్తటి పడక ఉన్నా, సుగంధ పరిమళ ద్రవ్యాలు ఉన్నా కంటినిండా నిద్రపోలేక పోయాడు. శత్రువులు ఏ క్షణాన, ఏ రూపంలో వచ్చి పడతారో అనే భయం. అతను ఒకరోజున నగర ప్రదక్షిణ చేస్తూ చెట్టుకింద హాయిగా నిద్రపోతున్న ఒక భిక్షువుని చూశాడు. ఆగి అతణ్ణి లేపి ‘‘నీ సుఖనిద్రకు కారణం ఏమిటి?’’ అని అడిగాడు. ఆ భిక్షువు రాజుని బుద్ధుని దగ్గరకు తీసుకుపోయాడు. బుద్ధ ప్రబోధం విన్నాడు రాజు.

‘‘కోరికలు ఎడతెరిపి లేనివి. వాటివల్ల కలిగే కామసుఖం తాత్కాలికం. కానీ నిష్కామసుఖం గొప్పది. శాశ్వతం. సంపాదనతో ముడిపడిన కర్మవల్ల కలిగే సుఖం కొద్దిపాటిది. అలా ముడిపడనిది మహత్తరమైనది. తృష్ణవల్ల కలిగే సుఖం తుచ్ఛం. తృష్ణారహిత సుఖం అమోఘం. లేశమంతే లౌకిక సుఖం. అద్వితీయం. అలౌకికసుఖం, శారీరక సుఖం కంటే మానసిక సుఖం మహోన్నతమైంది. సుఖం మీద ప్రీతితో పొందే సుఖం కంటే అప్రీతితో పొందే సుఖం అమరమైంది. అపేక్షతో పొందే సుఖం అమరమైంది. ఆపేక్షతో పొందే సుఖం కంటే ఉపేక్షతో పొందే సుఖం ఉన్నతమైంది. ఉత్తమమైంది. సమాధిస్థితిలో పొందే సుఖం అనిర్వచనీచమైంది. ఒక గృహస్తు పొందే సుఖం కంటే తాపసి. ధ్యాని పొందే సుఖం ధరణీతలంలో అన్నింటికంటే గొప్పది’’ అని చెప్పాడు.

మనం మరొకరి సుఖాన్ని దొంగిలించినా, లాక్కున్నా అది మనకు సుఖాన్నివ్వదు. దొంగ అందుకే ఎంత ధనాన్ని దోచుకున్నా సుఖంగా బతకలేడు. పట్టుబడతానేమో అనే భయంతో బతుకుతూనే ఉంటాడు. కామ దురాచారుల గతి కూడా అంతే! ఎదుటివారి శ్రమను దోపిడి చేసినా, సంపదను దోచుకున్నా, పరుల అధికారాన్ని, రాజ్యాల్ని బలవంతంగా హస్తగతం చేసుకున్నా, ఆస్తి, అంతస్తు అధికారాల్ని పెంచుతాయి గానీ, ఆదమరచి నిద్రపోనీయవు. కునుకు సుఖాన్ని కూడా దక్కనీయవు. కామ, క్రోధ, లోభ, మోహ, రాగాల్ని వీడినవారే అమరమైన సుఖాన్ని పొందగలరు. బుద్ధ ప్రబోధానంతరం, రాజ్యాన్ని త్యజించి, భిక్షువుగా మారాడు కప్పియరాజు. ‘ప్రజ్ఞాని మాత్రమే సుఖంగా జీవిస్తా’డనే బుద్ధవాక్కు ప్రకారం ఆ తర్వాత ఆనందంగా, సుఖంగా, కంటినిండా నిద్రపోయాడు. జీవితాంతం ధర్మాన్ని ప్రబోధిస్తూ మరణించాక కూడా అమరుడయ్యాడు. కప్పియ భిక్షువుగా కీర్తిగాంచాడు.                                
– డా. బొర్రా గోవర్ధన్‌

Advertisement
Advertisement