ఏఐ టెక్నాలజీతో పుట్టుకొస్తున్న ఫేక్‌న్యూస్‌, ఇలా గుర్తించండి | Can Artificial Intelligence Help To Spread Fake News? - Sakshi
Sakshi News home page

ఏఐ టెక్నాలజీతో కొత్త తరహా మోసాలు, ఏది నిజమో తెలుసుకోవడం కష్టం

Published Thu, Aug 24 2023 10:10 AM

Can Artificial Intelligence Help To Spread Fake News - Sakshi

నిజం నిలబడి ఉండగానే అబద్ధం ఊరంతా చుట్టి వస్తుందంటారు.. ఈ సామెత సోషల్‌ మీడియాలో కుప్పలు తెప్పలుగా పుట్టుకువచ్చే ఫేక్‌న్యూస్‌ విషయంలో సరిగ్గా సరితూలుతుంది. ఈ ఫేక్‌ న్యూస్‌ వల్ల నిజమేదో తెలుసుకోవడం కష్టంగా మారింది. అబద్దాన్ని నిజం అనుకునే ప్రమాదమూ ఉంటోంది. అలాగే.. ఫొటోలు, వీడియోలు కూడా ఫేక్‌వి పుట్టుకొస్తున్నాయి.

లైవ్‌ వీడియోలోనూ ఇటీవల ఏఐ టెక్నాలజీ ద్వారా అబద్ధం కొత్తగా సోషల్‌మీడియాను ఏలుతోంది. నిజమేంటో తెలుసుకోవడానికి మనం చాలా ప్రయత్నాలు చేయాల్సి ఉంటోంది. ఎందుకంటే, అబద్దాల వల్ల కలిగే మోసాలు ఎన్నో. వాటి బారిన పడకుండా జాగ్రత్త పడాలంటే ముందుగా నిజాలేమిటో తెలుసుకుందాం...


వార్తలకు సంబంధించిన సమాచారం, డేటా, నివేదికలు పూర్తిగా నిజమైనవి కానివి ప్రజల ముందుకు వస్తున్నాయి. అందుకని, మూలాధారాలు లేకుండా వచ్చిన సమాచారం అవాస్తవం అని గ్రహించాలి. అబద్ధపు వార్తలు విస్తృతంగా షేర్‌ అవుతుంటాయి. వీటికి ఎలాంటి సెన్సార్షిప్‌ ఉండదు.

నకిలీ వార్తల పుట్టుకకు..
తమకు తెలిసిన విషయాన్ని నలుగురికి తెలియజేయాలనే ఆత్రుత. స్వీయ లాభం, రాజకీయ ప్రభావం వల్ల ఇలాంటివి జరుగుతుంటాయి. కేవలం తమకు తెలిసినవి మరికొందరికి తెలియజేద్దామని నిజానిజాలు తెలుసుకోకుండా కొందరు అదేపనిగా షేర్‌ చేస్తుంటారు. సమాచారం అబద్ధమే కావచ్చు కానీ, దానిని షేర్‌ చేసే వ్యక్తి అది నిజమని నమ్ముతారు. తప్పుడు సమాచారం అని తెలిసీ ఉద్దేశపూర్వకంగానే షేర్‌ చేస్తారు. ఏదైనా సమస్యకు లేదా వ్యక్తికి సంబంధించిన కంటెంట్‌ అబద్ధమైతే మనల్ని ఆ వార్త తప్పుదారి పట్టించవచ్చు. ముఖ్యాంశాలు, విజువల్స్, క్యాప్షన్‌లు కంటెంట్‌కు సరిపోని విధంగా ఉంటాయి. మోసగించడానికి ఫొటోలు, కంటెంట్‌ను తారుమారు చేస్తుంటారు. 

తనిఖీ చేసే విధానం..
వీడియో మూలం ఎక్కడ ఉందో చెక్‌ చేయాలి. అది విశ్వసనీయమైనదే అని నిర్ధారించుకోవడానికి ప్రయత్నించాలి. 
సమాచారం నిజమైనదైనా ప్రత్యామ్నాయంగా ఇతర మూలాధారాల కోసం వెతకాలి. 
►  వీడియోలో అసహజమైన కదలికలు ఉన్నాయేమో గమనించాలి.
► డీప్‌ ఫేక్స్‌ గుర్తించడానికి ‘డీప్‌ ఫేక్‌ డిటెక్షన్‌ మోడల్‌’ వంటి స్పెషల్‌ సాఫ్ట్‌వేర్‌ అందుబాటులో ఉంది. 
► వీడియోలోని సంఘటనలు నమ్మదగినవేనా? ఆ వీడియో ఏ సందర్భాన్ని బట్టి తీశారో ఆ పరిస్థితులను పరిగణనలోకి తీసుకోవాలి. 
► వీడియోలో ఉన్న వ్యక్తిని మెయిల్, ఫోన్‌ ద్వారా సంప్రదించి, ప్రామాణికతను ధృవీకరించుకోవడానికి ప్రయత్నించవచ్చు.

వాస్తవం తెలుసుకోవాలంటే..

  • గూగుల్‌ రివర్స్‌ ఇమేజ్‌ చెక్‌ చేయాలి. లేదా ఫొటో వెరిఫికేషన్‌ కోసం www.tineye.comని ఉపయోగించాలి. 
  • ఫొటో లేదా వీడియో (https://www.invid-project.eu/tools-and-services/invid-verification-plugin/) కోసం ఇన్‌విడ్‌ టూల్‌కిట్‌ ఎక్స్‌టెన్షన్‌ని ఇన్‌స్టాల్‌ చేయాలి. 
  • ఫార్వర్డ్‌ చేసే ముందు ఏదైనా ఒక అంతర్జాతీయ ఫాక్ట్‌–చెకింగ్‌ నెట్‌వర్క్‌ ఆర్గనైజేషన్‌తో www.factly.in ని  వాస్తవాన్ని చెక్‌ చేయాలి.

ఇలా గుర్తించాలి...

డీప్‌ ఫేక్‌ వీడియో లేదా అడియోలో ఏవైనా లోపాలు ఉన్నాయేమో జాగ్రత్తగా పరిశీలించడం, వినడం చేయాలి. 
► డీప్‌ ఫేక్‌ వీడియో లేదా ఫొటోలలో లైటింగ్‌ నీడలను చెక్‌ చేయాలి. కొన్నింటిలో నీడలు కచ్చితంగా కనిపించకపోవచ్చు.
► ఇవే కాకుండా ఇంకేమైనా లోపాలు ఉన్నాయేమో చెక్‌ చేయాలి. వీడియోలలోని బ్యాక్‌గ్రౌండ్‌ చెక్‌ చేయాలి.
► సబ్జెక్ట్‌కు వీడియోలోని వ్యక్తుల కదలికల సరిపోలకపోవచ్చు. అంటే, ఎఐ టెక్నాలజీ ద్వారా నకిలీ వ్యక్తుల సృష్టి అయి ఉండవచ్చు.
► వీడియోలో వ్యక్తి కనురెప్పలు ఆర్పుతున్నారో లేదో పరిశీలించాలి.
► లైవ్‌ వీడియోలో మాట్లాడుతున్నప్పుడు ముఖాన్ని ఎడమ లేదా కుడికి కదిలించమని సదరు వ్యక్తిని ఉద్దేశించి అడగాలి.

ఇన్‌పుట్స్‌: అనీల్‌ రాచమల్ల, 
డిజిటల్‌ వెల్‌బీయింగ్‌ 
ఎక్స్‌పర్ట్, ఎండ్‌ నౌ ఫౌండేషన్‌ 

Advertisement
Advertisement