ఆ దీపావళి రోజులు

3 Nov, 2021 00:30 IST|Sakshi

దీపావళి పిల్లల పండుగ. కాకరపువ్వొత్తులు కలర్‌ పెన్సిళ్లు, చిచ్చుబుడ్లు పాము బిళ్లలు, తుపాకీ రీళ్లు... ఇప్పటి సంగతి ఏమోకాని కొన్ని తరాల బాల్యం దీపావళితో గడిచింది. ఒక్క బొమ్మ తుపాకీ కోసం అలకలు.. హర్తాళ్లు.. దొంగ– పోలీస్‌ ఆటలు.. ఆ రోజులే వేరు.

ఒక వారం  ముందు నుంచే వీధిలో ఠపా, ఠుపీ సౌండ్లు మొదలవుతాయి. ఆ వీధి చివరి ఇంట్లో పిల్లాడు శెట్టిగారి అంగట్లో దొరికే పది పైసల తుపాకీ బిళ్లలు కొని, ఆ బిళ్లల డబ్బీ జాగ్రత్తగా దాచుకుని, అందులో ఒకో బిళ్లను గచ్చు నేల మీద పెట్టి, గుండ్రాయితో ఠాప్‌మని పేల్చుతుంటాడు. డబ్బీ అయిపోతే మళ్లీ ఇంకో డబ్బీకి అమ్మ పదిపైసలు గ్యారంటీగా ఇస్తుంది.

ఆ పది పైసలూ లేనివాడు ఎలాగో చేసి చిన్న ఇనుపగుంట, గూటం సంపాదిస్తాడు. ఎక్కడ దొరుకుతుందో దొరుకుతుంది గంధకం పొడి. ఆ పొడి సీసాను దగ్గర పెట్టుకుని, కొంచెం గంధకం పొడి ఇనుప గుంటలో పెట్టి, గూటం బిగించి, ఆ గూటానికి ఉండే పాలజాటీని పట్టుకుని గట్టిగా గోడకు కొడితే ఠాప్‌ అని సౌండ్‌ వస్తుంది. ఇక గంధకం పొడి అయిపోయేంత కాలం వాడి దీపావళికి దిగుల్లేదు.

పోయిన దీపావళికి కొన్న గన్ను కనిపించదు. లేదా పాడై ఉంటుంది. కొత్త గన్‌ కొన్న పిలకాయలు వాటిని పట్టుకుని దొంగ పోలీస్‌ ఆట ఆడుతుంటారు. మనకూ కావాలనిపిస్తుంది. బజారుకు వెళ్లి టపాకాయల అంగడిలో అడిగితే రూపాయిన్నరది ఒకటి, మూడు రూపాయలది, ఐదు రూపాయలది చూపిస్తాడు. నల్లటి రంగు వేసిన రేకు తుపాకీలు, స్టీలు తుపాకీలు... కొనాలంటే డబ్బులెక్కడివి.

వచ్చిన అమ్మను అడిగితే వీపు మీద ఒక టపాకాయల పేలుతుంది. నాన్నను అడిగితే ‘కొందాం లేరా.. దీపావళి చాలా రోజులు ఉందిగా’ అంటాడు. ఈలోపు అన్నయ్య వాళ్లను వీళ్లను అడిగి, బంధువుల దగ్గర చిల్లర సంపాదించి ఒకటి సొంతానికి కొనుక్కుంటాడు. వాడు వాడిది మనకు చచ్చినా ఇవ్వడు. ఇంకేంటి? అలక... నిరాహార దీక్ష... హర్తాళ్‌.. రాస్తారోకో... చివరకు నిరసన దీక్షకు ఇంట్లో ఉన్న నానమ్మ ముక్కు చీది ‘పిల్లాడు ఏమడిగాడని’ అని ఏడుపు.

ఆఖరకు తుపాకీ శాంక్షన్‌ అవుతుంది. ఇంకేంటి. నానమ్మ తన ముక్కుపొడుం డబ్బులు త్యాగం చేసి రీల్స్‌ ప్యాకెట్‌ కొనిస్తుంది. ఒక ప్యాకెట్‌లో పది రీల్స్‌ డబ్బీలు ఉంటాయి. ఒక్కో డబ్బీలో ఒక్కో రీలు. తుపాకీ విప్పి రీలు చుట్టి మళ్లీ కచ్చితంగా బిగించడం ఒక ఆర్టు. ఆ పని చేశాక ట్రిగర్‌ నొక్కిన ప్రతిసారీ రీల్‌ రన్‌ అవుతూ ఠాప్‌ ఠాప్‌ సౌండ్‌ వస్తుంటే సూపర్‌స్టార్‌ కృష్ణ కూడా నిలువలేడు ఆ స్టయిల్‌కి.

డబ్బులు పెద్దగా ఉండని రోజులు అవి. పిల్లలు తమ కోర్కెలను కూడా జాగ్రత్తగా ఖర్చు పెట్టే రోజులు. ఒక తండ్రి ఒక కొడుక్కి నేల టపాకాయల సంచి కొనిస్తాడు. పది రూపాయలకు చాలా నేల టపాకాయలు ఉంటాయి దానిలో చిన్నవి. ఆ పిల్లవాడికి బుద్ధి పుట్టినప్పుడల్లా ఒక నేల టపాకాయ తీసి నేలన గట్టిగా బాదితే ఢమ్మని సౌండు. మరో బీద తండ్రి తన కొడుక్కి తాటాకు టపాకాయలు కొనిస్తాడు. తాటాకులో మందు కూర్చి వొత్తి బయటకు వచ్చేలా ఉండే ఆ చీప్‌ టపాకాయలు సౌండ్‌లో మేటి. క్యాండిల్‌ వెలిగించి ఒక్కో తాటాకు టపాకాయ అంటించి విసురుతూ ఉంటే ఠపాఠపా అంటాయి.

పీర్‌ ప్రెజర్‌ ఉండేది ఆ రోజుల్లో. మీ నాన్న ఎంతకు కొని తెచ్చాడు అనంటే మీ నాన్న ఎంతకు కొని తెచ్చాడు అని. పిల్లలు తమ దగ్గర ఉన్న అన్ని డబ్బాల కాకర పువ్వొత్తులను లెక్క వేసి పక్క కుర్రాడితో పోల్చుకునేవారు. చిచ్చుబుడ్లు ఫ్యాషన్‌వి కొనేవాళ్లు డబ్బున్నవాళ్లు. మట్టి చిచ్చుబుడ్లు కొనేవాళ్లు మధ్యతరగతి వారు. ఆ మట్టి చిచ్చుబుడ్లు మూడ్‌ బాగుంటే బుజ్‌మని వెలిగేవి.

లేకుంటే తుస్‌మనేవి. విష్ణుచక్రం, భూచక్రం అందరూ కొనలేరు. లక్ష్మీ ఔట్‌లు క్వాలిటీ ఔట్లు. ఆరు ఔట్లు ఒక ప్యాకెట్‌. కొంటే చెవులు చిల్లులు పడేలా పేలడం గ్యారంటీ. పురికొస బాంబులు కూడా మానం గల్లవి. తుస్‌మనడం వాటి చరిత్రలో లేవు. ఇక పిల్లిపిసర సరం ప్రమాద రహితమైనది. 500 వాలా, 1000 వాలా కొనేది శ్రీమంతులు. వాళ్లు అందరూ టపాకాయలు కాల్చేక ఏ అర్ధరాత్రో 1000 వాలా వెలిగించి పది నిమిషాలు ఢమఢమలాడించి తమ దర్జా చూపించుకుంటారు.

పిల్లలు దీపావళికి కొత్తబట్టలు అడగరు. కాని టపాకాయలు మాత్రం తప్పక అడుగుతారు. పాముబిళ్లలు, వెన్నముద్దలు, మెగ్నీషియం రిబ్బన్లు, కలర్‌ అగ్గిపెట్టెలు... ఇవి ఉంటే పెన్నిధి ఉన్నట్టే. ఇంతా చేసి దీపావళి ముందు రోజు నుంచి ముసురు పట్టుకుంటే వాళ్లు బెంగ పడతారు. చీటికి మాటికి ఆకాశం వైపు చూస్తుంటారు. అయ్యో.. వీటిని కాల్చడం ఎలా అనుకుంటారు. దీపావళి రోజు వాన రావడం ఆనవాయితీ. పిల్లలతో ఆడుకోవడానికే వచ్చి కాసేపు అల్లరి చేసి వెళ్లేది అది.

దీపావళికి చుట్టుపక్కల పిల్లలను గమనించుకోవడం పెద్దలు తప్పక చేసేవారు. కొన్ని టపాకాయల్ని కొనుక్కోలేని పిల్లలకు ఇచ్చేవారు. తమ పిల్లల చేత ఇప్పించేవారు. తమ ఇంటి ముంగిట్లో టపాకాయలు కాలుస్తున్నప్పుడు పక్కింటి పిల్లలు తెల్లముఖం వేసుకు చూస్తుంటే పిలిచి వారి చేత కూడా కాల్పించేవారు. ప్రేమ, స్నేహం ఉన్నది కాస్త పంచితే పెరుగుతుంది.

దీపం అంటే తాను వెలిగేది మాత్రమే కాదు.. వెలుతురు పంచేది. ఒక దీపం నుంచి వేయి దీపాలు వెలుగుతాయి.
ఈ దీపావళిని ప్రేమను పెంచుతూ జరుపుకోండి. చిన్నప్పటి రోజులను పిల్లలకు చెప్పండి. పిల్లలకు సురక్షితమైన దీపావళి సరంజామా ఇచ్చి దగ్గరుండి వారి చేత కాల్పించండి.
హ్యాపీ దీపావళి.

మరిన్ని వార్తలు