క్రికెట్‌ గాడ్‌ సచిన్‌కు అత్యంత అపురూపమైన 13 నాణేల గురించి తెలుసా?  | Sakshi
Sakshi News home page

క్రికెట్‌ గాడ్‌ సచిన్‌కు అత్యంత అపురూపమైన 13 నాణేల గురించి తెలుసా? 

Published Thu, Apr 25 2024 4:19 PM

do you know about Sachin Tendulkar Most Prized Possession 13 Coins - Sakshi

క్రికెట్‌ గాడ్‌, మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌  క్రికెట్‌ను  24  ఏండ్ల పాటు ఏకఛత్రాధిపత్యంగా  ఏలి క్రికెట్‌లో తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించుకున్నాడు. చిన్నతనంలోనే క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చి  లెజెండ్‌గా ఎదిగిన  సచిన్ రమేశ్ టెండూల్కర్ పుట్టినరోజు ( ఏప్రిల్‌, 24) ఈ రోజు.  ఈ సందర్భంగా ఒక విషయం  ఫ్యాన్స్‌ మధ్య  ఆసక్తికరంగా మారింది.

ఒక ఇంటర్వ్యూలో మీరు సొంతంచేసుకున్న దాంట్లో దేన్ని మీరు ఉన్నతంగా భావిస్తారు అని అడిగినపుడు సచిన్‌ సమాధానం తెలుస్తే  క్రికెట్‌ అభిమానులు  ఆశ్చర్యపోవాల్సిందే. మహ్మద్ అలీ సంతకం చేసిన బాక్సింగ్ గ్లోవ్స్, డైర్ స్ట్రెయిట్స్ మార్క్ నాప్‌ఫ్లెర్ సంతకం చేసిన గిటార్, సర్ డాన్ బ్రాడ్‌మాన్  ఆటోగ్రాఫ్ చేసిన బ్యాట్  వీటిల్లో ఏది  అపురూపంగా అనిపిస్తుంది అని అడిగినపుడు 

"నా కోచ్ అచ్రేకర్ సార్ నుండి పొందిన 13 నాణేలు నాకు చాలా ముఖ్యమైన జ్ఞాపకాలు’’ అని సమాధాన మిచ్చాడట సచిన్‌. ఇంతకీ  ఆ నాణేల కథ ఏంటి అంటే.

‘క్రికెట్ దేవుడు'గా  అవతరించిన సచిన్ టెండూల్కర్ ప్రయాణంలో  ఎత్తుపల్లాలుకూడా ఉన్నాయి. ఈ క్రమంలో సచిన్ టెండూల్కర్‌ రాటుదేలేలా  కీలక పాత్ర పోషించిన గురువు రమాకాంత్ అచ్రేకర్‌. శివాజీ పార్క్ జింఖానా మైదానంలోట్రైనింగ్‌ సెషన్‌లో కోచ్‌  అచ్రేకర్  అద్భుతమైన  శిక్షణలో సచిన్‌ రాటు దేలాడు. ఆయన శిక్షణలో ఉన్నప్పుడు  సచిన్ అలసిపోయినట్లు అనిపించినప్పుడల్లా అచ్రేకర్  ఒక ట్రిక్‌ వాడేవారట.

 క్రికెట్‌  స్టంప్ పైన ఒక రూపాయి నాణెం ఉంచేవారట.  ఆ నాణెం గెలవాలంటే సచిన్ టెండూల్కర్‌ను అవుట్ చేయమని బౌలర్లను సవాలు చేశాడు. బౌలర్లు అతనిని అవుట్ చేయడంలో విఫలమైతే, అచ్రేకర్ సచిన్‌కు నాణెం ఇచ్చేవాడు. అలాగే ఆ నాణెం దక్కించు కోవాలంటే.. అవుట్‌ కాకుండా ఆడాలని సచిన్‌కు సవాల్‌ విసిరే వారట. అలా అటు బౌలర్లకూ ఇటు తనకూ ఇద్దరికీ ప్రేరణగా నిలిచేదనీ, ఇది భవిష్యత్తులో తన ఆటకు  చాలా ఉపయోగపడిందని ఇంటర్వ్యూలో  గుర్తు చేసుకున్నాడు సచిన్‌.

'ద్రోణాచార్య' లేకపోతే నేను లేను
2023, జనవరిలో సచిన్ టెండూల్కర్  ఎక్స్‌ ద్వారా  కోచ్‌ అచ్రేకర్‌కి  కృతజ్ఞతలు తెలిపాడు.  ఆయన్ని 'ద్రోణాచార్య' అభివర్ణించాడు.  తనను  ప్రపంచ స్థాయి ఆటగాడిగా ఎలా మార్చాడో కూడా పంచుకున్నాడు.  ‘‘టెక్నిక్, క్రమశిక్షణ, ముఖ్యంగా ఆటను గౌరవించడం నేర్పించారాయన. నేను ప్రతిరోజూ ఆయన గురించే ఆలోచిస్తాను. ఈ రోజు, ఆయన వర్ధంతి సందర్భంగా, నా జీవితంలోని ద్రోణాచార్యుడికి  వందనం చేస్తున్నాను. ఆయన లేకపోతే. క్రికెటర్‌గా నేను లేను’’  అంటూ ఎమోషనల్‌ అయ్యాడు సచిన్‌.

కాగా సచిన్ టెండూల్కర్‌కు తొలుత టెన్నిస్‌పై ఆసక్తి ఉండేది. లెజెండరీ టెన్నిస్ ఆటగాడు జాన్ మెకెన్రోకి పెద్ద ఫ్యాన్‌ కూడా  అయితే, తరువాతి కాలంలో సచిన్ సోదరుడు, అజిత్ టెండూల్కర్ అతనిని క్రికెట్‌కు పరిచయం చేయడంతో క్రికెట్‌పై మక్కువ పెంచుకున్నాడు.  దీంతో అజిత్ ప్రఖ్యాత కోచ్ రమాకాంత్ అచ్రేకర్‌ వద్దకు సచిన్‌ను తీసుకెళ్లాడు. సచిన్‌ ఆటతీరు చేసిన అచ్రేకర్‌ అకాడమీకి ఎంపిక చేశాడు. లేదంటే క్రికెట్‌ ప్రపంచం, ఒక లెజెండ్‌ను మిస్‌ అయ్యేదేమో!

Advertisement
Advertisement