Don't Have The Time: Singer RIYA Self-Made Journey In Telugu - Sakshi
Sakshi News home page

ఆడియెన్స్‌ను ఉర్రూతలూగించే రియా పాటలు

Published Fri, Jul 21 2023 5:41 AM

Dont Have The Time: Singer RIYA Self-Made Journey - Sakshi

పాట లక్ష్యం హుషారుగా స్టెప్పులు వేయించడం మాత్రమే కాదు. పరుగును ఆపి మనలోకి మనం వెళ్లడం. మంచి ఊహలకు స్వాగతం పలకడం అంటోంది రియ సంగీతం. సాంగ్‌ రైటర్, సింగర్‌ రియ పాటలు హుషారెత్తిస్తూనే స్వీయ క్రమశిక్షణ నుంచి ఆత్మబలం వరకు ఎన్నో మంచి విషయాలను చెబుతాయి...

దిల్లీలో పుట్టిన రియ రెండు సంవత్సరాల వయసులో తల్లిదండ్రులతో యూకే వెళ్లింది. పాప్‌–బాలీవుడ్‌ మ్యూజిక్‌ను వింటూ పెరిగింది. చిన్న వయసులోనే స్టేజీపై ప్రదర్శనలు ఇచ్చింది. రియ ‘పర్మిషన్‌’ ట్రాక్‌ శ్రోతలను అలరించింది. ‘పర్మిషన్‌’ కోసం కలం కూడా పట్టింది రియ. ఇద్దరు ప్రేమికుల గురించి కావచ్చు, స్నేహం, కుటుంబ బంధాల గురించి కావచ్చు స్టోరీ–డ్రైవెన్‌ లిరిక్స్‌ రాయడం అంటే రియకు ఇష్టం.

క్లాసికల్‌ సింగింగ్‌లో డిప్లొమా చేసిన రియకు థియేటర్‌ మ్యూజిక్‌ అంటే ఇష్టం. ‘పర్మిషన్‌’ తరువాత వచ్చిన ‘డోన్ట్‌ హ్యావ్‌ ది టైమ్‌’కు మంచి పేరు వచ్చింది. ఇన్‌స్పిరేషన్‌ అనేది ఎప్పుడైనా, ఎక్కడైనా రావచ్చు అనే దానికి ఉదాహరణ...డోన్ట్‌ హ్యావ్‌ ది టైమ్‌. ఒక ఫెస్టివల్‌లో లైవ్‌ పర్‌ఫార్మెన్స్‌ ఇస్తున్నప్పుడు ఈ పాటకు ఆలోచన తట్టింది. ఆడియెన్స్‌ కూడా లీనమై తనతో పాటు డ్యాన్స్‌ చేసే పాట సృష్టించాలనుకుంది రియ. అలా పుట్టిందే... డోంట్‌ హ్యావ్‌ ది టైమ్‌.

అయస్కాంతంలా ఆకట్టుకునే పాట ఒకటి సృష్టించాలనుకుంది. అలా అని ఆ పాట అల్లాటప్పాగా ఉండకూడదని దానిలో సందేశం ఉండాలనుకుంది.
మనలో ఎంత టాలెంట్‌ ఉంటే మాత్రం? టైమ్‌ లేకపోతే అంతే! అందుకే టైమ్‌ విలువను క్షణ, క్షణం గుర్తు చేసుకునేలా ‘డోన్ట్‌ హ్యావ్‌ ది టైమ్‌’ను తీర్చిదిద్దింది. ప్రతి ఒక్కరూ రిలేట్‌ అయ్యేలా ఉండడమే ఈ పాట సక్సెస్‌ సాధించడానికి కారణం అయింది.

‘ప్రతి నిమిషం అపూర్వమైనది. వెల కట్టలేనిది’ అని గుర్తు చేసే ‘డోంట్‌ హ్యావ్‌ ది టైమ్‌’పై పాప్‌ బీట్‌ మాత్రమే కాదు బాలీవుడ్‌ మ్యూజిక్‌ ప్రభావం కూడా కనిపిస్తుంది. ట్రాక్‌ వీడియోల షూట్‌ కోసం ఎన్నో సార్లు దిల్లీకి వచ్చిన రియ ప్రతిసారి ఒక కొత్త అనుభవాన్ని సొంతం చేసుకుంది. ‘సాంస్కృతిక వైవిధ్యంతో వెలిగిపోయే దిల్లీలో అడుగు తీసి అడుగు వేస్తే ఎన్నో అద్భుతాలు కనిపిస్తాయి’ అని దిల్లీ గురించి మురిపెంగా చెబుతుంది రియ.

‘ప్రతి నెల ఒక సింగిల్‌ విడుదల చేయాలనుకుంటున్నాను’ అంటున్న రియ తన రచనలు, సంగీతంతో ఎప్పుడూ బిజీబిజీగా ఉంటుంది. ఇండియాలోని ప్రొడ్యూసర్‌లు, మ్యూజిషియన్‌లతో పనిచేయాలని, లైవ్‌ షోలలో పాల్గొనాలనేది రియ కల. మరి నెక్స్‌›్ట ఏమిటి? ‘చెప్పుకోతగ్గ అద్భుతమైన ఆనందకరమైన విషయాలు మున్ముందు ఉన్నాయి. మాంచెస్టర్‌ ఇంటర్నేషనల్‌ ఫెస్టివల్, బీబీసీ ది హండ్రెడ్‌ ప్రోగ్రామ్‌లో ప్రదర్శన ఇవ్వబోతున్నాను’ అంటుంది రియ.
 

Advertisement
Advertisement