14 ఏళ్లకు మెచ్యూర్‌ అయ్యాను, పీరియడ్‌ వచ్చినప్పుడల్లా విపరీతమైన నొప్పి.. తగ్గేదెలా?

3 Oct, 2021 11:09 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

గైనకాలజీ సమస్యలు

డా. వేనాటి శోభ గైనకాలజిస్ట్‌ సూచనలు

నా వయసు 22 సంవత్సరాలు. నేను 14 ఏళ్ల వయసులో మెచ్యూర్‌ అయ్యాను. నాకు రెగ్యులర్‌గా 45 రోజులకు పీరియడ్స్‌ వస్తాయి. వచ్చినప్పుడల్లా మొదటి రోజు విపరీతంగా కడుపునొప్పి ఉంటుంది. పీరియడ్స్‌లో కడుపు నొప్పి సాధారణమే అయినా, ఇలా విలవిలలాడేంతగా ఉండదని, ఇలాగైతే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పకపోవచ్చని నా ఫ్రెండ్స్‌ చెబుతున్నారు. నా సమస్యకు పరిష్కారం ఏమిటి?
– శ్రుతి, విజయవాడ

పీరియడ్స్‌ సమయంలో ప్రోస్టాగ్లాండిన్స్‌ అనే హార్మోన్లు విడుదలవుతాయి. వీటి ప్రభావం వల్ల గర్భాశయ కండరాలు బాగా కుదించుకున్నట్లయి, అది పట్టి వదిలేస్తూ బ్లీడింగ్‌ బయటకు వస్తుంది. ఇది కొందరిలో పొత్తికడుపు నొప్పిగా అనిపిస్తుంది. ఒక్కొక్కరి శరీరతత్వాన్ని బట్టి ప్రోస్టాగ్లాండిన్స్‌ విడుదలవ్వచ్చు. అవి విడుదలయ్యే మోతాదును బట్టి వాటి ప్రభావం వల్ల పీరియడ్స్‌లో నొప్పి ఒక్కొక్కరిలో ఒక్కోలా ఉంటుంది. కొందరిలో ఎలాంటి లక్షణాలూ ఉండవు. 

కొందరిలో నొప్పి కొద్దిగా ఉంటుంది. కొందరిలో నొప్పి బాగా ఎక్కువగా ఉంటుంది. అలాగే పీరియడ్స్‌ సమయంలో ప్రొజెస్టిరాన్‌ హార్మోన్‌ తగ్గిపోతుంది. దీని ప్రభావం వల్ల గర్భాశయం లోపలి ఎండోమెట్రియమ్‌ పొరకు రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళాలు కుంచించుకుపోయి, ఎండోమెట్రియమ్‌ పొర ఊడిపోయి బ్లీడింగ్‌ రూపంలో బయటకు వచ్చేస్తుంది. దీనివల్ల కూడా పీరియడ్స్‌ సమయంలో పొత్తికడుపులో నొప్పి ఒక్కొక్కరిలో ఒక్కోలా ఉండే అవకాశాలు ఉంటాయి. పైన చెప్పిన కారణాల వల్ల వచ్చే పీరియడ్స్‌ నొప్పి వల్ల ఇబ్బందులేమీ ఉండవు. కాకపోతే నొప్పి విపరీతంగా ఉన్నప్పుడు నొప్పి నివారణ మందులు వాడుకోవచ్చు. అలాగే ఆ సమయంలో పొత్తికడుపు మీద వేడి కాపడం పెట్టవచ్చు. యోగా, ప్రాణాయామం వంటి బ్రీతింగ్‌ ఎక్సర్‌సైజెస్‌ చేయడం వల్ల కూడా ఉపశమనం దొరుకుతుంది. 

కాకపోతే కొందరిలో గర్భాశయంలో కంతులు, ఫైబ్రాయిడ్స్, అడినోమయోసిస్, ఎండోమెట్రియాసిస్, ఇన్ఫెక్షన్స్, చాక్లెట్‌ సిస్ట్స్, అండాశయంలో సిస్ట్‌లు వంటి అనేక కారణాల వల్ల పీరియడ్స్‌ సమయంలో పొత్తికడుపులో విపరీతమైన నొప్పి, నడుం నొప్పి వంటి లక్షణాలు ఉంటాయి. కాబట్టి మీరు ఒకసారి గైనకాలజిస్టును సంప్రదించి, పెల్విక్‌ స్కానింగ్‌ వంటి అవసరమైన పరీక్షలు చేయించుకుని, సమస్య ఏదైనా ఉందా లేదా తెలుసుకోవడం మంచిది. సమస్య ఉంటే దానికి తగిన చికిత్స తీసుకోవచ్చు. సమస్య ఏమీ కనిపించకపోతే కంగారు పడాల్సిన అవసరం లేదు. భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులూ ఉండవు.

నా వయసు 28 ఏళ్లు. నాకు పీసీఓడీ సమస్య ఉంది. పెళ్లయి ఆరేళ్ళయినా ఇంతవరకు పిల్లలు లేరు. డాక్టర్‌ను సంప్రదిస్తే ఫోలిక్‌ యాసిడ్‌ మాత్రలు, ఓరల్‌ కాంట్రాసెప్టివ్‌ మాత్రలు రాసిచ్చారు. నాలుగు నెలలు వాడినా ఫలితం ఏమీ కనిపించలేదు. నా సమస్యకు ఎలాంటి చికిత్స చేయించుకోవాల్సి ఉంటుంది?
– సౌజన్య, గుత్తి

గర్భాశయం రెండువైపులా ఉండే అండాశయాల్లో హార్మోన్ల అసమతుల్యత, జన్యుపరమైన కారణాలు, ఇంకా ఎన్నో తెలియని కారణాల వల్ల అనేక చిన్న చిన్న అండాలు ఉండే ఫాలికిల్స్‌ పెరగకుండా నీటిబుడగల్లా ఏర్పడతాయి. వీటినే పీసీఓడీ (పాలీసిస్టిక్‌ ఒవేరియన్‌ డిసీజ్‌) అంటారు. ఇందులో మగవారిలో ఎక్కువగా విడుదలయ్యే టెస్టోస్టిరాన్‌ వంటి ఆండ్రోజన్‌ హార్మోన్లు ఆడవారిలో విడుదలవుతాయి. 

దీనివల్ల పీరియడ్స్‌ సక్రమంగా రాకపోవడం, అండం సరిగా పెరగకపోవడం వంటి సమస్యలు ఏర్పడి, దాని వల్ల పిల్లలు కలగడానికి ఇబ్బంది అవుతుంది. ఇందులో చికిత్సలో భాగంగా హార్మోన్ల అసమతుల్యత ఇంకా పెరగకుండా, ఇన్సులిన్‌ రెసిస్టెన్స్‌ తగ్గడానికి ఓరల్‌ కాంట్రాసెప్టివ్‌ మాత్రలు ఇవ్వడం జరుగుతుంది. ఇవి వాడే సమయంలో గర్భం రాదు. అవి కొన్ని నెలలు వాడిన తర్వాతే అండం పెరగడానికి మందులు వాడుతూ గర్భం కోసం ప్రయత్నం చెయ్యవలసి ఉంటుంది. 

మీ ఎత్తు, బరువు రాయలేదు. కొందరిలో కాంట్రాసెప్టివ్‌ మందులతో పాటు వాకింగ్, వ్యాయామాలు చేస్తూ, మితమైన ఆహార నియమాలు పాటిస్తూ, బరువు ఎక్కువగా ఉంటే బరువు తగ్గడం వల్ల కూడా అవి ఆపేసిన కొన్ని నెలల తర్వాత హార్మోన్ల అసమతుల్యత తగ్గి, గర్భం అదే నిలుస్తుంది. ఒకవేళ ఆలస్యం అవుతుంటే అప్పుడు అండం పెరగడానికి, గర్భం నిలవడానికి మందులతో చికిత్స తీసుకోవచ్చు. బిడ్డలో కొన్ని అవయవ లోపాలు రాకుండా ఉండటానికి ఫోలిక్‌యాసిడ్‌ మాత్రలను గర్భం కోసం ప్రయత్నం చేసే మూడు నాలుగు నెలల ముందు నుంచే వాడమని సలహా ఇవ్వడం జరుగుతుంది. 

- డా. వేనాటి శోభ, గైనకాలజిస్ట్‌, హైదరాబాద్‌

మరిన్ని వార్తలు