వేస్ట్‌ నుంచి ‘బంగారం’: అదిరిపోయే కళ | Sakshi
Sakshi News home page

వేస్ట్‌ నుంచి ‘బంగారం’: అదిరిపోయే కళ

Published Wed, Jan 17 2024 11:56 AM

Electronic and plastic waste into fine jewellery and others meet this stars - Sakshi

‘వ్యర్థాల గురించి మాట్లాడుకోవడం పరమ వ్యర్థం’ అనుకోవడం లేదు యువతరం. ఎలక్ట్రానిక్స్‌ నుంచి ప్లాస్టిక్‌ వ్యర్థాల వరకు రకరకాల వ్యర్థాలను కళాకృతులుగా రూపొందించి పర్యావరణ సందేశాన్ని అందించడం ఒక కోణం అయితే, ఎలక్ట్రానిక్‌ వ్యర్థాలలోని విలువైన వాటితో నగలు రూపొందించే ఎమర్జింగ్‌  ఆర్ట్‌ ట్రెండ్‌ లోతుపాతులు తెలుసుకోవడం మరో కోణం...

కోల్‌కతాలోని శ్రీశ్రీ అకాడమీ విద్యార్థులు తమ పాఠశాల అవరణలో పేరుకుపోయిన ప్లాస్టిక్‌ వ్యర్థాలతో అద్భుతాన్ని సృష్టించారు. ‘ట్రాష్‌ ఇన్‌స్టాలేషన్‌’  ప్రాజెక్ట్‌లో భాగంగా స్టూడెంట్స్‌ యుతిక, ఇషాని, రజనీష్, మంజరీ, అదిత్రిలు  ప్లాస్టిక్‌తో తయారుచేసిన డాల్ఫిన్‌ స్టాచ్యూను పాఠశాల ఆవరణలోని వర్టికల్‌ గార్డెన్‌లో ఏర్పాటు చేశారు.

నెలరోజుల వ్యవధిలో తయారు చేసిన ‘డాల్ఫిన్‌ ఇన్‌ పెరిల్‌’ అనే ఈ ఆర్ట్‌ ఇన్‌స్టాలేషన్‌ పాఠశాలకు ప్రత్యేక ఆకర్షణగా మారింది. ‘ప్లాస్టిక్‌ వల్ల పర్యావరణానికి, సముద్ర జీవులకు తీవ్రహాని కలుగుతుందనే విషయాన్ని ప్రచారం చేయడానికి కళను ఒక మాధ్యమంలా ఉపయోగించుకోవాలనుకుంటున్నాం. భవిష్యత్‌లో ఇలాంటివి మరిన్ని తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం’ అంటుంది అదిత్రి.

కేరళలోని తిరువనంతపురంలో ‘కాలేజీ ఆఫ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌’కు చెందిన యంగ్‌ టీమ్‌ 20,000 ప్లాస్టిక్‌ బాటిల్స్‌ను ఉపయోగించి 90 అడుగుల పాము ఇన్‌స్టాలేషన్‌ను రూపొదించింది. ప్లాస్టిక్‌ అనే విషసర్పం భూగోళాన్ని కాటు వేస్తున్నట్లుగా కనిపించే ఈ ఇన్‌స్టాలేషన్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వీటిని దృష్టిలో పెట్టుకొని ‘ఫ్యాషన్‌ ఆఫ్‌ ది న్యూ ఎరా 100 శాతం ట్రాష్‌ అండ్‌ ప్లాస్టిక్‌!’ అంటూ ఒక యువ ఆర్టిస్ట్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశాడు.

ముంబైలో ఉంటున్న హరిబాబు ఇ–వేస్ట్‌ కళలో ఎంతోమంది యూత్‌కు ఇన్‌స్పైరింగ్‌గా నిలుస్తున్నాడు. ఇ–వేస్ట్‌ కళారూపాలతో ప్రముఖ ఆర్ట్‌ గ్యాలరీలలో ఎగ్జిబిషన్‌ ఏర్పాటు చేశాడు. కేరళలో పుట్టిన హరిబాబు చెన్నైలో పెరిగాడు. చెన్నై గవర్నమెంట్‌ ‘కాలేజీ ఆఫ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌’లో చదువుకున్నాడు. ఇ–వ్యర్థాలతో కళాకృతుల తయారీకి ప్రశంసల మాట ఎలా ఉన్నా బ్యాంకు బ్యాలెన్స్‌ మాత్రం ఎప్పటికప్పుడూ ఖాళీ అవుతుండేది. ‘నీకేమైనా పిచ్చి పట్టిందా?’ అని తిట్టేవారు మిత్రులు.

అయితే బజాజ్‌ ఆర్ట్‌ గ్యాలరీ ఫెలోషిప్‌ అవార్డ్‌ అందుకున్న తరువాత హరిబాబుకు బ్రేక్‌ వచ్చింది. ఏడాది తరువాత ‘స్టేట్‌–ఆఫ్‌–ది–ఆర్ట్‌ స్టూడియో’ ముంబైలో ప్రారంభించాడు. టన్నుల కొద్దీ ఇ–వ్యర్థాల నుంచి ఎన్నో శిల్పాలు రూపొందించిన హరిబాబు దగ్గరికి సలహాలు, సూచనల కోసం ఎంతోమంది యంగ్‌ ఆర్టిస్ట్‌లు వస్తుంటారు.

భువనేశ్వర్‌కు చెందిన మ్యూరల్‌ ఆర్టిస్ట్‌ దిబూస్‌ జెనా, ఆర్టిస్ట్‌ సిబానీ బిస్వాల్‌ ఆర్గానిక్‌ స్క్రాప్, రీయూజ్‌డ్‌ మెటల్‌లతో ఆర్ట్‌ ఇన్‌స్టాలేషన్‌లను సృష్టించారు. మానవ తప్పిదాల వల్ల సముద్రానికి జరుగుతున్న హాని గురించి తెలియజేసేలా ఉంటుంది జెనా రూపొందించిన తిమింగలం.

‘ఒషాబా బ్రాండ్‌ గురించి తెలుసుకున్న తరువాత ఎలక్ట్రానిక్‌ వ్యర్థాలపై ఆసక్తి పెరిగింది. వృథా అనుకునే వాటి నుంచి ప్రయోజనం సృష్టించాలి అనే వారి ఫిలాసఫీ నాకు నచ్చింది’ అంటుంది భో΄ాల్‌కు చెందిన ఇరవై రెండు సంవత్సరాల రీతిక. కళ తప్పి మూలన పడ్డ ఎలక్ట్రానిక్‌ వ్యర్థాలకు కొత్త జీవితాన్ని ఇవ్వడానికి గత సంవత్సరం లండన్‌ కేంద్రంగా ఒషాబా బ్రాండ్‌కు అంకురార్పణ జరిగింది. వాడి పారేసిన స్మార్ట్‌ఫోన్‌ సర్క్యూట్‌ బోర్డులు, ప్లగ్, యూఎస్‌బీ కేబుల్స్, చార్జింగ్‌ కేబుల్స్‌..మొదలైన వాటిలోని విలువైన వాటిని ఈ బ్రాండ్‌ ఆభరణాల తయారీలో ఉపయోగిస్తారు.

నిజానికి ఎలక్ట్రానిక్‌ వ్యర్థాలను ఆభరణాల తయారీలో ఉపయోగించడం ఇదే తొలిసారి కాదు. 2018లో  అమెరికన్‌  టెక్నాలజీ కంపెనీ ‘డెల్‌’ కాలం చెల్లిన తమ కంప్యూటర్‌ విడి భాగాల నుంచి సేకరించిన విలువైన వాటితో నగలు రూపొదించడానికి లైఫ్‌స్టైల్‌ బ్రాండ్‌ ‘బాయూ విత్‌ లవ్‌’తో కలిసి భాగస్వామ్య ఒప్పందాన్ని కుదుర్చుకుంది. విలువైన పదార్థాల వృథాను నివారించడానికి, ఎలక్ట్రానిక్‌ వ్యర్థాల గురించి వినియోగదారులలో అవగాహన కలిగించే సృజనాత్మక విధానాన్ని ‘డెల్‌’ ఎంచుకుంది.

‘జువెలరీ బ్రాండ్స్‌ రీ–సైకిల్డ్‌ అల్టర్‌నేటివ్స్‌పై ఆసక్తి చూపుతున్నాయి. వాడిపాడేసిన స్మార్ట్‌ఫోన్లు, లాప్‌టాప్‌లు... మొదలైన వాటిలో గోల్డ్‌ మైన్‌ ఉందని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే మూలకు పడి ఉన్న ఎలక్ట్రానిక్‌ వ్యర్థాలలో దాగి ఉన్న విలువైన లోహలు, ఒక టన్ను ఇ–వేస్ట్‌ నుంచి ఎన్ని గ్రాముల బంగారం వస్తుంది... లాంటి వివరాలు నాకు ఆసక్తికరంగా మారాయి’ అంటుంది ముంబైకి చెందిన నవీన. 23 సంవత్సరాల నవీనకు పాత, కొత్త అనే తేడా లేకుండా నగల డిజైనింగ్‌ ఐడియాలపై ఆసక్తి. ఈ ఆసక్తి ఆమెను ఎలైజా వాల్టర్‌లాగే నలుగురు మెచ్చిన డిజైనర్‌గా మార్చవచ్చు.


నగ దరహాసం

ఎలక్ట్రానిక్‌ వ్యర్థాల నుంచి నగలు తయారు చేసే బ్రాండ్‌గా బ్రిటన్‌లో మంచి పేరు సంపాదించింది లైలీ జువెలరి. ఎలైజా వాల్టర్‌  24వ యేట ఈ  బ్రాండ్‌ను  ప్రారంభించింది, యువతలో ఎంతోమందిలాగే ఇ–వ్యర్థాలలోని అపురూప అంశాలపై ఆసక్తి పెంచుకుంది. ‘ప్రపంచంలోని బంగారంలో ఏడు శాతం నిరుపయోగంగా ఉన్న ఎలక్ట్రానిక్స్‌లో దాగి ఉన్నందున ఆభరణ  బ్రాండ్‌లు వాటిని ముఖ్యమైన వనరుగా చూస్తున్నాయి’ అంటున్న ఎలైజా వాల్టర్‌ ప్రయాణం యువతలో ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తోంది. ఇ–వ్యర్థాల నుంచి రూపొందించిన ఈ ఆభరణాన్ని ఎలైజా వాల్టర్‌ డిజైన్‌ చేసింది.

Advertisement
Advertisement