Brahmasri Chaganti Koteswara Rao: Encouraging The Enemy Leads To Downfall - Sakshi
Sakshi News home page

నీ ఆకలి, నీ నిద్ర నీదే కదా...మరి..!!!

Published Mon, Jun 19 2023 12:58 AM

Encouraging the enemy leads to downfall - Sakshi

నీవు ఎదగలేకుండా పోవడానికి కారణం ఎవరు ? నీకు సలహాలిచ్చేవారికోసం, నీకు సహాయపడేవారికోసం చూస్తున్నావా? నీకు బంధువులు లేరా? వాళ్ళు నిన్ను పట్టించుకోవడంలేదా? నీకు స్నేహితులు, శ్రేయోభిలాషులెవరూ లేరా? వారు నీకు మార్గదర్శనం చేయడం లేదా? లేక... నీకు శత్రువులు ఎక్కువగా ఉన్నారా? వాళ్లు నిన్ను ముందుకు పోనీయడం లేదా? అంటే ఎవరో రావాలనీ, వాళ్ళు నిన్ను జాగ్రత్తగా నడిపించాలనీ, నీ ప్రతి కష్టంలో వారు నీకు తోడుగా నిలబడి దిశానిర్దేశం చేయాలని నీవు కోరుకుంటున్నావని అర్థం... దీనికి జగద్గురువయిన కృష్ణ పరమాత్మ ఏమంటున్నాడో చూడండి...

‘‘ఉద్ధరేద్‌ ఆత్మనాత్మానమ్‌ నాత్మానమ్‌ అవసాదయేత్, ఆత్మైవ హై ఆత్మనో బంధుర్‌ ఆత్మైవ రిపుర్‌ ఆత్మనః’’
– అంటే నీకు నీవే బంధువువు, నీకు నీవే స్నేహితుడివి, నీకు నీవే శత్రువివి. నీకు ఆకలివేస్తే నీవే తినాలి, నీకు నిద్రవస్తే నీవే నిద్ర పోవాలి, నీకు దాహం వేస్తే నీవే నీళ్లు తాగాలి...అలాగే నీకు కష్టం వచ్చినప్పుడు, నీకు సమస్యలు ఎదురయినప్పుడు ఎవరో వస్తారని, నిన్ను కటాక్షిస్తారని, నిన్ను ఉద్ధరిస్తారని ఎదురు చూస్తూ కూచోవద్దు. బంధువులు, స్నేహితులు, శత్రువులు బయట లేరు... నీలోనే ఉన్నారు. నీవు వారిని గుర్తిస్తే... నీకు ఇక ఏ చింతా ఉండదు. నీ నిద్ర నీవు పోయినట్లుగానే, నీ ఆకలి నీవు తీర్చుకున్నట్లుగానే... నీ కష్టాన్ని కూడా నీవే తీర్చుకుంటావు.

భగవంతుడు మనకు కొన్ని అద్భుతమయినవి ఇచ్చాడు. భువనం.. ఈ ప్రపంచాన్ని ఇచ్చాడు. నీ జీవితం వర్ధిల్లడానికి ప్రకృతిని ఇచ్చాడు. నీకు ఆహ్లాదమయినవి చూసి సంతోషించడానికి కళ్ళు ఇచ్చాడు.. నీకు ఇష్టమయినవి వినడానికి చెవులిచ్చాడు. తాకి అనుభూతి చెందడానికి చర్మానికి స్పర్శనిచ్చాడు. వాసనలు చూడడానికి ముక్కు ఇచ్చాడు... ఇలా చాలా ఇచ్చాడు... ఇవన్నీ నీకోసం, నీవు అనుభవించడానికే ఇచ్చాడు... అయితే ఇవన్నీ ధర్మచట్రంలో ఇమిడేటట్టు చూసుకోమన్నాడు... అంతే.. అదే చేసెయ్‌... ఇవన్నీ వదిలేసి మనసు పక్కచూపులు చూస్తున్నదనీ, ఎటో లాగుతున్నదనీ విచ్చలవిడిగా పోతే ... నీలో ఉన్న శత్రువును... నీవే ఉత్సాహపరిస్తే... నీ పతనానికి నీవే దారి ఏర్పాటు చేసుకుంటున్నట్లు అవుతుంది.

పిల్లలను కూర్చోబెట్టుకుని వారికి మంచీ చెడూ ఎలా చెబుతుంటావో... నీ మనసుకు కూడా ప్రతిరోజూ, ప్రతి క్షణం అలా చెబుతూ ఉండు... అప్పడది నీకు ఆత్మబంధువుగా మారుతుంది. నీ శ్రేయస్సు కోరే నీ స్నేహితుడిగా, నీ శ్రేయోభిలాషిగా నీకు మార్గదర్శనం చేస్తుంది. నీ కంటికి కనురెప్ప ఉంది. అది నీ కంటిని ఎలా కాపాడుతుంటుందో నీ మనసును అనుక్షణం నీవు అలా కాపాడుతుండాలి. అదే నిన్ను నీవు ఉద్ధరించుకోవడం– అని పరమాత్మ గీతాబోధ చేసాడు. ఇంతకన్నా చెప్పడానికి ఎవరికయినా ఏముంటుంది.
 

బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు

Advertisement
Advertisement