ప్రెసిడెంటు గారి భార్య మాట..

11 Feb, 2021 00:02 IST|Sakshi

జిల్‌ బైడెన్‌ 

ఇంటి పని, ఆఫీస్‌ పని, పిల్లల పని, భర్తగారి పని.. ఇన్ని పనులు ఉండగా ‘మీ కోసం కూడా మీరు కొంచెం టైమ్‌ మిగుల్చుకోవాలి’ అనే మాట వింటే వచ్చే నిట్టూర్పు కూడా ఒక పెద్ద పనిలానే ఉంటుంది! తల్లులకు తండ్రుల కన్నా మూడింతలుగా ఇంటి పనుల బాధ్యత ఉంటోందనీ, ఆఫీస్‌ పనిలోని ఒత్తిడి కూడా తండ్రుల కన్నా తల్లులకు రెండింతలు ఎక్కువగా ఉంటోందని ‘లీన్‌ ఇన్‌ అండ్‌ మెకెన్సే’ అనే సంస్థ తన సర్వేలో కనుక్కుంది. అయితే ఇంటిని, ఆఫీస్‌ని బ్యాలెన్స్‌ చేసుకోడానికి తల్లులకు అదృష్టం పట్టక్కర్లేదని అమెరికా ప్రథమ మహిళ జిల్‌ బైడెన్‌ అంటున్నారు. మరో నిట్టూర్పు! ‘హూ.. ఆమెకేం, ప్రెసిడెంటు గారి భార్య. ఏమైనా చెప్తారు’ అనుకోనక్కర్లేదు. విందాం.. అసలేం చెబుతున్నారో. 

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ సతీమణి జిల్‌ బైడెన్‌ వయసు 69 ఏళ్లు. ముగ్గురు పిల్లల్ని పెంచి పెద్ద చేశారు. సొంత కూతురు, సొంత కొడుకు. బైడెన్‌ మొదటి భార్య కొడుకు. ఆ ముగ్గుర్నీ ప్రయోజకుల్ని చేశారు. వాళ్లు రెక్కలొచ్చి వెళ్లిపోయాక భర్త ఆమెకు మరో పిల్లాడు అయ్యాడు. అంటే ఆమె మళ్లీ తల్లిస్థానంలోకి వచ్చేశారు. ఆలూమగల మధ్య ఉండేదే. జిల్‌ టీచర్‌. లెక్చరర్, ఇప్పుడు ప్రొఫెసర్‌. భర్త అమెరికా ఉపాధ్యక్షుడిగా ఉన్న ఎనిమిదేళ్లూ వైట్‌ హౌస్‌ విధులకు దూరంగా ఆమె తన బోధన వృత్తిలోనే కొనసాగారు. ఇప్పుడు ప్రథమ మహిళ అయ్యాక కూడా ప్రొఫెసర్‌గానే ఉండిపోయారు.  చదవండి: (2024లో.. అగ్రరాజ్యానికి తొలి మహిళా ప్రెసిడెంట్‌!)

ఆ మాట ముందే చెప్పారు కూడా.. ‘ఒకవేళ జో బైడెన్‌ అమెరికా అధ్యక్షులు అయినా, నేను అమెరికాలో ఒక టీచర్‌గా మాత్రమే ఉంటాను’ అని! భార్యగా, తల్లిగా, టీచర్‌గా ఆమె తన జీవితాన్ని బ్యాలెన్స్‌ చేసుకుంటూ ఇంతవరకు వచ్చారు కనుక.. ఆమె అనిన ‘అదృష్టం పట్టక్కర్లేదు’ అనే మాటను విని.. ‘ఆ.. ఎన్నయినా చెబుతారు..’ అని మనం అనుకోనక్కర్లేదు. ఫుల్‌టైమ్‌ వర్కింగ్‌ పేరెంట్‌ జిల్‌ బైడెన్‌. ఉద్యోగం చేస్తుండే తల్లుల కష్టం గురించి ఆమెకు తెలియంది కాదు. ఇప్పుడీ కరోనా సమయంలోనైతే ఆ కష్టాన్ని ఊహించనేలేము. తండ్రి ఆఫీస్‌కు పరుగులు తీస్తుంటాడు. తల్లి కూడా పరుగులు తీయవలసిందే. కానీ పిల్లల్ని సంరక్షించడం ఆమె బాధ్యతగానే ఉంటోంది. మునుపటిలా పిల్లల్ని బడికి పంపి వీళ్లు ఆఫీస్‌కు వెళ్లేందుకు కూడా లేదు. స్కూళ్లు ఇంకా తెరవనిదే! కొన్ని స్కూళ్లు తెరిచినా పిల్లల విషయమై ఇప్పుడు మరింత శ్రద్ధ అవసరం. ‘పేరెంట్స్‌’ మ్యాగజీన్‌కు తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇవన్నీ మాట్లాడారు జిల్‌ బైడెన్‌.

యూఎస్‌లో తొంభై లక్షల ఎనభై వేల మంది వర్కింగ్‌ మదర్స్‌ ఉన్నారని ‘మావెన్‌’ అనే స్టార్టప్‌ అంచనా. బైడెన్‌ ప్రస్తుతం ప్రొఫెసర్‌గా పని చేస్తున్న నార్తర్న్‌ వర్జీనియా కమ్యూనిటీ కాలేజ్‌లో వర్కింగ్‌ మదర్స్‌కి కూడా ఆమె పాఠాలు చెబుతుంటారు. వాళ్లకు ఆమె చెప్పే మాట ఒక్కటే. ‘మీ కోసం కూడా మీరు సమయం కేటాయించుకోవాలి’ అని! సేమ్‌ ఇంతకు క్రితం మనం అనుకున్నదే. కానీ ఎలా కుదురుతుంది ఒక వర్కింగ్‌ మదర్‌కి ఇంటిని, భర్తను, పిల్లల్ని, ఉద్యోగాన్ని వదిలి ఒక నిముషమైనా తన కోసం తను జీవించడం! ‘యు హ్యావ్‌ టు’ అంటారు బైడెన్‌. ‘సమయాన్ని వెతుక్కోవలసిందే’ అని. ‘‘మనల్ని వేధిస్తున్న ప్రశ్నలకు మనమే కదా సమాధానం వెతుక్కోవాలి. నేనైతే అలానే చేస్తాను’’ అని వారికి చెబుతారు బైడెన్‌. తల్లి పని తల్లికి ఉంటుంది. ఆమె చేయవలసిన పనుల ప్రాధాన్యతలు మారినప్పుడు తండ్రి ఆమెకు సహాయం చేయాలి. ఆమెకు ఆఫీస్‌ వర్క్‌ ఉంటే తండ్రి పిల్లల వర్క్‌ చూసుకోవాలి.  చదవండి: (తొలిసారి ఎయిర్‌ఫోర్స్‌ వన్‌లో బైడెన్‌)

‘థ్యాంక్‌ఫుల్లీ ప్రెసిడెంట్‌ బైడెన్‌ ఇంటి పనుల్లో, పిల్లల పనుల్లో నాకెంతో హెల్ప్‌ చేసేవారు. కానీ మనం అడగాలి. మనం చెప్పాలి. మనం హెల్ప్‌ తీసుకోవాలి’ అని తల్లులకు సూచన ఇస్తున్నారు జిల్‌ బైడెన్‌. ఈ సందర్భంగా ఆమె ‘లీన్‌ ఇన్‌ అండ్‌ మెకెన్సే’ సర్వేను ప్రస్తావిస్తూ.. ఇంట్లో మూడింతల పనిని, ఆఫీస్‌ నుండి ఇంటికి తెచ్చుకునే రెండింతల ‘ఒత్తిడి’ని తగ్గించుకునేందుకు భర్త సహాయాన్ని అడిగి తీసుకోమని కూడా చెబుతున్నారు. ఆమె చెప్పిన ఇంకో మాట కూడా అమెరికన్‌ తల్లులకు కాస్త ధైర్యాన్ని ఇచ్చేలా ఉంది. ప్రెసిడెంట్‌ బైడెన్‌తో మాట్లాడి తల్లుల శ్రమను, ఒత్తిడిని తగ్గించే విధాన నిర్ణయాలను తీసుకునేలా చేయబోతున్నారట. ‘‘పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు బైడెన్‌ నా పనిని పంచుకునేవారు. ఐ వాజ్‌ లక్కీ. అలాగని తల్లులు తమ కెరీర్‌ను ఇంటి బాధ్యతలతో బ్యాలెన్స్‌ చేసుకోడానికి వారికేమీ గొప్ప అదృష్టం పట్టక్కర్లేదు. ప్రతి తండ్రికీ పిల్లల బాధ్యత ఉంటుంది. అయితే తల్లే అంతా మీద వేసుకుని చేస్తుంటే అతడికి ఆ విషయం అర్థం కాకపోవచ్చు’’ అంటారు జిల్‌ బైడెన్‌. 

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు