స్మార్ట్‌ సేద్యం! అధిక ఆదాయాన్ని ఆర్జిస్తున్న రైతులు | Sakshi
Sakshi News home page

స్మార్ట్‌ సేద్యం! అధిక ఆదాయాన్ని ఆర్జిస్తున్న రైతులు

Published Tue, Jul 4 2023 9:41 AM

Fruit Orchard Farmers Reaping Multiple Benefits By Using Modern Technology - Sakshi

మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఆధునిక సాంకేతికతను ఉపయోగిస్తూ బహుళ ప్రయోజనాలు పొందుతున్నారు అనంతపురం జిల్లా పండ్ల తోటల రైతులు. ‘ఆటోమేటిక్‌ వెదర్‌ స్టేషన్ల’ను ఏర్పాటు చేసుకుని చీడపీడలను ముందే పసిగట్టి తగిన జాగ్రత్తలు పాటిస్తూ పంట నష్టాన్ని నివారించుకుంటున్నారు. పనిలో పనిగా సస్యరక్షణ ఖర్చు సగానికి తగ్గినట్టే. నాణ్యత పెరగడమే కాదు.. ఆశించిన దిగుబడులు సాధిస్తున్నారు. ఈ సూత్రాలను ‘స్మార్ట్‌’గా పాటిస్తూ పండ్ల తోటల్లో ‘ఆటోమేటిక్‌ వెదర్‌ స్టేషన్ల’ ద్వారా చక్కటి ఫలితాలను సాధిస్తున్నారు అనంతపురం రైతులు. దానిమ్మ, ద్రాక్ష, బొప్పాయి, బత్తాయి వంటి పండ్ల తోటలు సాగు చేసే పెద్ద రైతులకు వెదర్‌ స్టేషన్లు ఉపయుక్తంగా ఉన్నాయి. తోటల యాజమాన్యాన్ని ‘స్మార్ట్‌’ సాధనాలతో సులభతరం చేసుకోవడమే కాక ఖర్చును తగ్గించుకుంటూ అధికాదాయాన్ని ఆర్జిస్తున్నారు. 

ఆటోమేటిక్‌ స్మార్ట్‌ వెదర్‌ స్టేషన్‌ సోలార్‌ సిస్టమ్‌తో నడుస్తుంది. భూమి రకాన్ని బట్టి 3 ఎకరాలకు ఒకటి సిఫారసు చేస్తున్నారు.. ఒకే పంటను సాగు చేసే రైతులు ఒక పరికరంతోనే సత్ఫలితాలను పొందుతున్నారు. రూ.50 వేల వ్యయంతో దీన్ని తోట మధ్యలో అమర్చుకోవాలి. భూమి లోపల కనీసం 2–3 మొక్కలను కలుపుతూ ఒక అడుగు లేదా 15 అంగుళాల లోతులో సెన్సార్‌ను పెడతారు. అలాగే, రాబోయే 14 రోజుల్లో ఉండే ఉష్ణోగ్రతలను అంచనా వేసేందుకు టవర్‌కు మధ్యలో మరో సెన్సార్‌ను ఏర్పాటు చేస్తారు. 

గాలివేగం, తేమశాతం తెలుసుకునేందుకు టవర్‌కు రెండో వైపు 2.5–3 అడుగుల ఎత్తులో మరో సెన్సార్‌ను ఏర్పాటు చేస్తారు. భూమిలో ఉండే సెన్సార్‌ మొక్కల వేర్లకు ఏ స్థాయిలో నీరు అందుతోంది? వేర్ల దగ్గర తేమ శాతం, ఒత్తిడి ఎలా ఉందో చెబుతుంది. అలాగే రెండో సెన్సార్‌ ఉష్ణోగ్రతలను, మూడో సెన్సార్‌ ద్వారా గాలిలో తేమ శాతం, గాలి వేగం గురించి చెబుతుంది. రెయిన్‌ గేజ్‌ ద్వారా వర్షపాతాన్ని నమోదు చేస్తుంది. 3 సెన్సార్ల ద్వారా వచ్చే సమాచారాన్ని తనే విశ్లేషించుకొని రైతులకు  తగిన సూచనలు, సలహాలతో మెస్సేజ్‌లు పంపుతుంది.

మంచి ఫలితాలొస్తున్నాయి
నేను 25 ఎకరాల్లో దానిమ్మ, 10 ఎకరాల్లో ద్రాక్ష పండ్లు సాగు చేస్తున్నా. మహారాష్ట్రకు చెందిన డాక్టర్‌ బాబాసాహెబ్‌ ఘోరే శిక్షణా కార్యక్రమంలో వీటి ప్రయోజనాల కోసం తెలుసుకున్నా. రెండేళ్ల క్రితం వీటిని మా తోటల్లో ఏర్పాటు చేశాం. చాలా బాగా పనిచేస్తున్నాయి. వచ్చే సిఫార్సులకు అనుగుణంగా యాజమాన్య పద్ధతులు పాటిస్తున్న. మంచి ఫలితాలు వస్తున్నాయి. ఏర్పాటు చేసిన ఫసల్‌ కంపెనీ ఏడాది పాటు ఉచితంగా సేవలందించింది. మా జిల్లాలో 10 మంది రైతులు ఈ పరికరాలను ఏర్పాటు చేసుకున్నారు. ఎకరాకు 5 టన్నులు దిగుబడి రాగా, పెట్టుబడులు పోను రూ.2–3 లక్షల  వరకు నికరాదాయం వస్తో్తంది.
– గౌని పాతిరెడ్డి, కల్యాణదుర్గం, 
అనంతపురం జిల్లా (9440752434)

ఇంట్లో నుంచే తోట యాజమాన్యం
నేను 64 ఎకరాల్లో దానిమ్మ, బత్తాయి, బొప్పాయి తోటలు సాగు చేస్తున్నా. ఆటోమేటిక్‌ వెదర్‌ స్టేషన్‌ ఏర్పాటు చేసుకున్నా. ఇంట్లో కూర్చొని వ్యవసాయం చేయొచ్చు. పంట ఏ తెగులు బారినపడుతుందో అన్న దిగులు లేదు. ఎప్పటికప్పుడు సెల్‌ఫోన్‌కి మెస్సేజ్‌లొస్తాయి. సమాచారం చాలా పక్కాగా ఉంటుంది. అనుగుణంగా స్పందించి తగిన చర్యలు తీసుకుంటే చాలు. గతంతో పోలిస్తే∙నీరు 50% ఆదా అవుతుంది. 25% పెట్టుబడి ఖర్చులు తగ్గాయి. దిగుబడి పెరిగింది. పండ్ల నాణ్యత 50% పెరిగి మంచి రేటు కూడా వస్తోంది.
– సుగాలి చిన్న నాగరాజు, యలగలవంక తండా, 
బేలుగుప్ప మం., అనంతపురం జిల్లా (7702828062)

చీడపీడలను ఇట్టే పసిగడుతుంది
గాలిలో తేమ శాతం ఎక్కువగా ఉంది.. ఫలానా చీడపీడలు వచ్చే అవకాశం ఉంది. ఉష్ణోగ్రత పెరిగే అవకాశం ఉంది.. ఫలానా తెగులు సోకే ప్రమాదం ఉంది.. మరో గంటలో వర్షం పడే అవకాశం ఉంది వంటి హెచ్చరికలు పంపిస్తుంది. భూమిలో ఉండే సెన్సార్‌ ఆధారంగా ఏ సమయంలో ఎంత మేరకు నీరు పెట్టాలో చెబుతుంది. పోషక లోపాలు ఏమేరకు ఉన్నాయో గుర్తించి తగిన సిఫారసులు చేస్తుంది. చీడపీడలకు పిచికారీ చేసేందుకు వాతావరణం అనుకూలంగా ఉందో లేదో కూడా తెలియజేస్తుంది. ఎంత మోతాదులో ఎటు నుంచి పిచికారీ చేయాలో కూడా చెబుతుంది.

టవర్‌కు ఉండే రెయిన్‌ గేజ్‌ ఆధారంగా  పంటపొలం వద్ద ఎన్ని మిల్లీమీటర్ల వర్షపాతం పడింది? ఆ ప్రభావం పంటలపై ఏ మేరకు ఉంటుందో కూడా రైతులకు తెలియజేస్తుంది. టవర్‌ లోపల సిమ్‌ కార్డు నిక్షిప్తం చేసి ఉంటుంది. ఇది ఎప్పటికప్పుడు టెక్ట్స్‌ మెసేజ్‌ రూపంలో రైతుకు సమాచారం వస్తుంది. రైతు తోటలో ఉండాల్సిన అవసరం లేదు. ఎక్కడున్నా సరే ప్రత్యేక యాప్‌ ద్వారా మెసేజ్‌ రూపంలో అన్ని విషయాలు ఎప్పటికప్పుడూ తెలిసిపోతాయి. ఏమైనా తెగుళ్లు సోకినట్టు గుర్తిస్తే తప్ప అనవసరంగా మందులు కొట్టే అవసరం ఉండదు.

సిఫారసు చేసిన పురుగుమందులను సిఫార్సు చేసిన మోతాదులో స్ప్రే చేయడం వలన అదనపు ఖర్చు తగ్గుతుంది. సరైన సమయంలో సరైన మందు స్ప్రే చేయడం వలన దిగుబడి కూడా పెరుగుతుంది. తెగుళ్లు, చీడపీడలు సోకకుండా ముందస్తుగా గుర్తించడం వలన పెట్టుబడి ఖర్చు గణనీయంగా తగ్గించుకోవచ్చు. పురుగుమందుల వినియోగం తగ్గడంతో ఆశించిన స్థాయిలో నాణ్యమైన దిగుబడులు సాధించవచ్చు. పొలంలో వెదర్‌ స్టేషన్‌ను ఏర్పాటు చేసుకున్న తర్వాత పెట్టుబడి ఖర్చు 20% తగ్గడంతోపాటు, నాణ్యత 50%, దిగుబడి 25% వరకు పెరుగుతుంది. 20% పైగా అదనపు ఆదాయం వస్తున్నదని రైతులు చెబుతున్నారు.
– పంపాన వరప్రసాదరావు,
సాక్షి, అమరావతి

(చదవండి: ఇంగ్లండ్‌లో సర్దార్జీల సేద్యం! స‍్మెదిక్‌లో సిక్కు జాతీయుల ఫార్మింగ్‌ సిటీ)

Advertisement
Advertisement