ఆర్కిటెక్చర్‌ విద్యార్థులకు గీతాబోధ

27 Mar, 2022 00:32 IST|Sakshi
ఆర్కిటెక్ట్‌ గీతా బాలకృష్ణన్‌

తమ చుట్టూ ఉన్న అవకాశాలను అందిపుచ్చుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించిన వారు కొందరైతే.. పనిచేస్తోన్న రంగంలో మూలాల వరకు ఉన్న లోటుపాట్లు, అవకాశాలను వ్యక్తిగతంగా శోధించి తెలుసుకుని, వాటిని సరిచేయడానికి, సమాజాభివృద్ధికి తోడ్పడే విధంగా కార్యరూపం దాల్చుతారు. ఈ కోవకు చెందిన వారే 53 ఏళ్ల ఆర్కిటెక్ట్‌ గీతా బాలకృష్ణన్‌.  

కోల్‌కతాకు చెందిన గీతా బాలకృష్ణన్‌.. ఢిల్లీలోని స్కూల్‌ ప్లానింగ్‌ అండ్‌ ఆర్కిటెక్చర్‌లో బీఆర్క్‌ చదివింది. కార్నెగీ మెల్లన్‌ విశ్వవిద్యాలయంలో ప్రాక్టికల్‌ శిక్షణ తీసుకుంది. తరువాత వివిధ ఆర్టిటెక్ట్‌ల దగ్గర ఉద్యోగం చేసింది. కానీ ఆమెకు అక్కడ చేసే పని సంతృప్తినివ్వలేదు. దీంతో ‘నిర్మాణ రంగంలో ప్రత్యామ్నాయ పద్ధతులు’ పై కోర్సు చేసింది. ఈ కోర్సు చేసేసమయంలో ప్రొఫెసర్‌ కేఎస్‌ జగదీష్‌తో పరిచయం ఏర్పడింది.

ఈయన మార్గదర్శకంలో సాంప్రదాయేతర ఆర్కిటెక్ట్‌ డిజైన్లపై గీతకు మక్కువ ఏర్పడింది. దీంతో పర్యావరణానికి హాని కలగని డిజైన్లు చేస్తూనే..బెంగళూరుకు చెందిన ఎన్జీవో ఆవాస్‌ (అసోసియేషన్‌ ఫర్‌ వాలంటరీ యాక్షన్‌ అండ్‌ సర్వీసెస్‌) పరిచయంతో ఎన్జీవో తరపున సేవాకార్యక్రమాలు నిర్వహించేది. ఇలా చేస్తూనే పట్టణాల్లో నివసిస్తోన్న నిరుపేదలకు ఆవాసం కల్పిస్తున్న మరో సంస్థతో కలిసి పనిచేసే అవకాశం లభించింది. ఈవిధంగా సామాజిక సేవచేస్తూనే మరోపక్క ఎంతోమంది కలల ఇంటినిర్మాణాలకు ప్లాన్‌లు రూపొందించేది.  
 
ఇథోస్‌

 అనేక ప్రాజెక్టుల్లో పనిచేసిన తరువాత ఆర్కిటెక్చర్‌ విద్యార్థులకు, నిర్మాణ రంగంలో ఉన్న ఇంజినీరింగ్‌ వృత్తి నిపుణులకు మధ్య సమన్వయం కొరవడిందని గుర్తించింది గీత. ఈ గ్యాప్‌కు ఏదైనా ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయాలన్న ఆలోచనతో  ‘ఇథోస్‌’ సంస్థను స్థాపించి విద్యార్థులకు, సివిల్‌ ఇంజినీరింగ్‌ నిపుణులకు మధ్య వారధిని ఏర్పాటు చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న ఆరువందల కాలేజీల్లోని మూడువేలకుపైగా విద్యార్థులను వివిధ ఆర్టిటెక్ట్‌ సెమినార్‌లు నిర్వహించి వారికున్న సందేహాలను నివృత్తి చేసేలా, ఇంజినీరింగ్‌ పట్ల వృత్తిపరమైన అవగాహన కల్పించేలా వృత్తినిపుణులకు, విద్యార్థులను ముఖాముఖి పరిచయ కార్యక్రమాల ఏర్పాటు చేస్తున్నారు. దీనిద్వారా ఆర్కిటెక్ట్‌ విద్యార్థులు తమ డిగ్రీ అయిన వెంటనే వారి ఆసక్తికి తగిన ఉద్యోగం సులభంగా దొరికే సదుపాయం కల్పిస్తోంది ఇథోస్‌. 2018లో ఇథోస్‌.. ఏసీఈడీజీఈ పేరిట ఆన్‌లైన్‌ ఎడ్యుకేషన్‌ను ప్రారంభించింది. దీనిద్వారా కన్‌స్ట్రక్షన్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ డిజైనింగ్‌లో ఆన్‌లైన్‌ మాడ్యూల్స్‌ను అందిస్తోంది.  
 
ఆరు రాష్ట్రాలు..1700 కిలోమీటర్లు

మానవుని జీవన శైలిపై అతను నివసించే భవన నిర్మాణ ప్రభావం కూడా ఉంటుందని గీత గట్టిగా నమ్ముతోంది. ఆర్కిటెక్ట్‌లు అందరూ ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని డిజైన్లు రూపొందించాలని ఆమె చెబుతోంది. అలా చెప్పడం దగ్గరే ఆగిపోకుండా తన ఇథోస్‌ ఫౌండేషన్‌ స్థాపించి ఇరవై ఏళ్లు పూర్తయిన సందర్భంగా కోల్‌కతా నుంచి ఢిల్లీవరకు అర్కాజ్‌ పేరిట 1700 కిలోమీటర్లు పాదయాత్ర చేసింది. ఈ పాదయాత్రలో భాగంగా పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, ఢిల్లీలలో పర్యటించింది. కాలినడకనే ఆరు రాష్ట్రాల్లో తిరుగుతూ అక్కడి సంప్రదాయాలు, భవన నిర్మాణ శైలిని దగ్గరగా పరిశీలించింది.

ఆయా ప్రాంతాల్లో నివసిస్తోన్న కొంతమందితో మాట్లాడి వారి ఇంటి నిర్మాణం, ఆ ఇంటితో ఉన్న అనుబంధం, ఎలాంటి అనుభూతిని పొందుతున్నారో అడిగి తెలుసుకుంది. ఇంటి నిర్మాణానికి మంచి ప్లానింగ్‌ ఉంటే జీవితం మరింత సుఖమయమవుతుందని పాదయాత్రలో అనేకమందికి అవగాహన కల్పించింది. వందల కిలోమీటర్ల ప్రయాణంలో తాను తెలుసుకున్న అనేక విషయాలను యువ ఆర్కిటెక్ట్‌లకు తెలియ జెబుతోంది. బాగా స్థిరపడిన వారు వృద్ధాప్యం లో తమ సొంత గ్రామాల్లో జీవించేందుకు వసతి సదుపాయాల డిజైన్లు, నిరుపేదలు కనీస వసతి సదుపాయాల కోసం ఏం కోరుకుంటున్నారో దగ్గరగా చూసిన గీత వారికి తగిన డిజైన్లు ఎలా రూపొందించాలి? ఆ డిజైన్లు నిరుపేదల జీవన శైలిపై ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తాయో కాబోయే ఆర్కిటెక్ట్‌లకు వివరిస్తోంది.

 చేస్తోన్న పనిలోని లోటుపాట్లు్ల, అవకాశాలను లోతుగా అధ్యయనం చేసి భవిష్యత్‌ తరాలను మెరుగుపరిచేందుకు కృషిచేస్తోన్న గీత లాంటి వాళ్లు మరింత మంది ఉంటే నాణ్యమైన వృత్తి నిపుణులుగా మరెందరో ఎదుగుతారు.  

మరిన్ని వార్తలు