Attractive Mini Charpoy Trays: నులక మంచం ట్రే, తోపుడి బండి ట్రే.. ఇంకా..

13 Sep, 2021 13:29 IST|Sakshi

 ∙హోమ్‌ క్రియేషన్స్‌ 

ఇంటి అలంకరణలో పాత ఒక వింత ఎలా అవుతుందో చూడాలంటే ఇంట్లో కాఫీ, టీ సర్వింగ్‌లో ఉపయోగించే ట్రే ను గమనిస్తే చాలు. కళాత్మకత ఇంటి గోడలు, పై కప్పు, ఫ్రేమ్స్, ప్లాంట్స్‌.. విషయంలోనే కాదు వాడుకునే వస్తువుల్లోనూ కనువిందు చేస్తోంది అనకుండా ఉండలేరు. కాదేదీ అలంకరణకు అనర్హం అనే పదం ఇప్పుడు మంచాలు, తోపుడుబండ్లు, ఆట వస్తువులకూ వచ్చేసింది. వీటిలో ప్రతీదాన్ని హోమ్‌ క్రియేషన్‌లో భాగం చేసుకోవచ్చు. 

నులక మంచం ట్రే
పల్లెటూళ్లలో బామ్మల కాలం నాటి నవారు మంచాలు, నులక మంచాలు ఇప్పుడు నగరీకరణ విల్లాలలో సెంటర్‌ టేబుల్‌ మీద ఖుషీగా విందు చేసుకుంటున్నాయి. నాలుగు కప్పులు, ఆరు బిస్కెట్లు పట్టేటంత పరిమాణంలో బుజ్జి మంచాల ట్రేలు అబ్బురంగా కనిపిస్తున్నాయి. కళాభిలాషుల కోసం మార్కెట్లోకి వచ్చిన ఈ తరహా ట్రే లు ‘ఎంత బాగున్నాయో కదా!’ అనిపించేస్తున్నాయి. రూ. 700 నుంచి రూ.1,500 వరకు ఇవి లభిస్తున్నాయి. టేబుల్‌ పరిమాణం అంత నులక మంచాన్ని మూలల్లో అలంకరణగానూ వాడచ్చు. 

తోపుడి బండి ట్రే
కూరగాయలు, పండ్లు లాంటివి తోపుడు బండ్ల మీద పెట్టుకొని అమ్ముతుంటారు బడుగు జీవులు. ఆ తోపుడు బండి మీద తినుబండారాలు పెట్టుకొని అతిథులకు కొత్తగా ఆహ్వానం పలుకుతున్నారు ఇంటి సభ్యులు. కలప, ఐరన్‌ జోడీతో తయారుచేసే ఈ తోపుడు బండి ట్రేలు క్రియేటివిటీ, క్వాలిటీని బట్టి రూ. 500 నుంచి వేలల్లో ధరలు పలుకుతున్నాయి. 

టేబుల్‌ ఎక్కిన టేబుల్‌
ఇది కొంచెం సింపుల్‌ అనిపించినా బెడ్‌ మీద కూర్చొని తినేవారికి టేబుల్‌ ట్రే మరింత సౌలభ్యంగా ఉంటుంది. కూచొని, పడుకుని ల్యాప్‌టాప్‌ వర్క్‌ చేసుకొనేవారికి ఇది అనువుగానూ ఉంటుంది. టేబుల్‌ మీద పెట్టినా అందుకోవడానికి ఉపయోగంగా ఉంటుంది. అందుకే టేబుల్‌ స్టైల్‌ ట్రే టేబుల్‌ ఎక్కి మరీ దర్జా పోతోంది. బెడ్‌ మీద హాయిగా వాలిపోతుంది. రూ.300 నుంచి నాణ్యతను బట్టి రూ.1000 ఆ పైన ధరలు ఉన్నాయి. 

ఆట వస్తువులూ ట్రే రూపంలో..
గాలిపటాల్లో వాడే థ్రెడ్‌ రోలర్, క్రికెట్‌ బ్యాట్, టేబుల్‌ టెన్నిస్‌ బ్యాట్‌ కూడా స్నాక్స్‌ అందించడానికి కొత్తగా ముస్తాబు అయ్యాయి. ఇంటి అతిథ్యంలోనూ తమదే పై చేయి అంటూ క్రియేటివ్‌గా టీపాయ్‌ మీదకు చేరాయి. ధరలు రూ.1000 నుంచి రూ.3,000 కు సెట్‌గా మార్కెట్లో లభిస్తున్నాయి. 
 

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు